
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవానికి సన్నాహకంగా విశాఖపట్నం బీచ్ రోడ్‌లో నిర్వహించిన శోభాయాత్రలో శాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభా యాత్రలో ఉత్సవ మూర్తులకు నిర్వహించిన అర్చనా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ రామాలయ సేవా సంఘం, విశాఖపట్నం మరియు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, భద్రాచలం వారి సంయుక్త ఆధ్వర్యంలో ధర్మప్రచార లక్ష్యంతో ఈ శోభాయాత్రను నిర్వహించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా గాదిరాజు ప్యాలెస్ నందు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, మన ధార్మిక సంప్రదాయాల పరిరక్షణ యొక్క ప్రాధాన్యతను ఇటువంటి కార్యక్రమాలు తెలియజేస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్ని కలిగించే కార్యక్రమాలు భారతీయ సంస్కృతి, విలువలను రాబోయే తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.





