ArticlesNews

బ్రిటిష్ పన్నులపై గాంధీకంటే ముందే పర్వతనేని పోరు

21views

( ఫిబ్రవరి 8 – పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి  )

భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. ఆంగ్లేయుల బారి నుంచి మాతృభూమి దాస్య శృంఖలాలు తొలిగించేందుకు తమ సర్వస్వాన్ని అర్పించిన మహానుభావులు ఎందరో. తెలుగునేలపై సైతం ఎందరో సమరయోధులు తమ రక్తాన్ని ఉద్యమానికి ధారపోశారు. జాతీయోద్యమంలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత ‘ఆంధ్రావని పెదనందిపాడు ఉద్యమం’. తెలుగువారి స్వాతంత్ర్య ఇచ్ఛ, పోరాట పటిమను తెలియజేసే దృష్టాంతం ఇది.

అది 1921. ఆంగ్లేయులపై పోరాటం కొత్తపంథా తొక్కుతున్న వేళ అది. పన్ను నిరాకరణ ఉద్యమం పురుడు పోసుకుంది. బర్దోలీలో గాంధీజీ ఆరంభించాలనుకున్న ఉద్యమం కంటే ముందు..పన్ను సహాయ నిరాకరణ గుంటూరు జిల్లా పెదనందిపాడులో మొదలైంది. పెదనందిపాడులో ఈ ఉద్యమం మొదలయ్యే సమయానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీ నారాయణ, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు జైళ్లలో ఉండగా, కొండా వెంకటప్పయ్య అనారోగ్యంతో ఉన్నారు. అలాంటి సమయంలో గ్రామీణ ప్రాంతం నుంచి గొప్ప నాయకత్వం అందించినవారు ‘ఆంధ్రా శివాజీ’ పర్వతనేని వీరయ్య చౌదరి.

వీరయ్యచౌదరి మాటకు విలువిస్తూ పెదనందిపాడు పరిధిలో 18 గ్రామాల్లోని కరణాలు, మునసబులు, గ్రామాధికారులు రాజీనామాలు చేశారు. ఆంగ్లేయ సర్కారు రెవెన్యూ సభ్యుడైన హారిస్‌ను రాయబారానికి పంపింది. అదీ విఫలం అయింది. ఉలిక్కిపడ్డ ఆంగ్లేయ సర్కారు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ రూథర్‌ఫర్డ్‌ను దించింది. ప్రజలు చెల్లించిందెంత..??ఇంకా చెల్లించాల్సింది ఎంత..?? ఏ రికార్డులు అందుబాటులో లేవు. రూథర్‌ఫర్డ్ రిజర్వ్ పోలీసులను, బ్రిటీష్ సైన్యాన్ని రప్పించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

ఆంగ్లేయులు ప్రజలపై, పర్వతనేని వీరయ్య చౌదరి ఏర్పాటు చేసిన శాంతి సైనికులపై ఉమ్మేశారు. ఉసిగొల్పారు. కానీ, ఆంధ్రా శివాజీ మార్గనిర్దేశంలో ఎవరు సహనం కోల్పోలేదు. కులమత భేదాలు లేకుండా, పేదధనిక అంతరాల్లేకుండా అంతా ఏకతాటిపై నిలబడ్డారు. అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులను అల్లాడిస్తూ…పన్నుల నిరాకరణలో దేశానికి మార్గదర్శకం అయ్యారు. శాంతి మార్గంలో ఉద్యమాన్ని నడిపించి అందరి దృష్టి పెదనందిపాడు పై పడేలా చేశారు ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి.

బ్రిటీష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని గుర్రంపై తిరుగుతూ ఊరూరు తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన పర్వతనేని వీరయ్యచౌదరి గుంటూరు జిల్లా పెదనందిపాడులో లక్ష్మయ్య, అంకమ్మ దంపతులకు 1886 అక్టోబరు 4న జన్మించారు. చిన్నతనంలోనే దక్షిణాదికి వెళ్లి సంగీతంలో శిక్షణను పొంది హరికథా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. గ్రామాలలో కచేరీలు, బుర్రకథలు ఏర్పాటు చేసి ప్రజలలో దేశభక్తిని రగిల్చారు. ఆయన ప్రభావం వల్ల గ్రామాలలో ప్రజలు మిలిటరీ కవాతులకు భయపడే పరిస్థితి తొలిగిపోవడమే కాదు బ్రిటీష్ సైన్యంలో, వారికి విధేయులుగా పనిచేసిన సీతాపతి వంటివారిలోనూ దేశభక్తి రగిలింది. అయితే అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ నేతల్లో అభిప్రాయభేదాలు పెదనందిపాడు ఉద్యమం పాలిట శాపమయ్యాయి. బర్దోలి ఉద్యమ ఫలితాలు అందేవరకు పెదనందిపాడు ఉద్యమాన్ని ఆపాలంటూ గాంధీజీ నిర్ణయించారు.

గాంధీజీ నిర్ణయంతో వీరయ్యచౌదరి కృంగిపోయారు. సుమారు 100 గ్రామాల్లో తన సారధ్యంలో ప్రారంభమై 4 నెలలపాటు ఉధృతంగా సాగిన ప్రజా ఉద్యమం ఒక్కసారిగా నీరుగారిపోవడం, తనకు తలవంపులు తేవడంతో ఆయన ఆతర్వాత ఎప్పుడూ ప్రజాజీవితంలోకి రాలేదు. ఆంధ్ర శివాజీగా పేరు తెచ్చుకున్న వీరయ్య చౌదరి 1970 ఫిబ్రవరి 8న హైదరాబాదులో కాలధర్మం చేశారు. వీరి స్మారక చిహ్నంగా 1992 ఫిబ్రవరిలో పెదనందిపాడులో శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒకే ఒక ఉద్యమంలో అచిరకాలంలోనే అజరామరమైన ఖ్యాతిని గడించిన వీరయ్య చౌదరి నిస్వార్థ, నిరాడంబర జీవితం మనందరికీ సదా ఆదర్శం.