News

మంచు కొండల్లో… ఏడుకొండలవాడు….

853views

దేశానికి తలమానికంలా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోనుంది. ఏడుకొండలవాడి ఆలయ నిర్మణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కొద్దిరోజుల కిందటే టీటీడీ అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

అంతా ఆర్టికల్ 370 రద్దు వల్లనే…

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత.. అక్కడి పరిస్థితులు సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. అఖండ భారతావనిలో అంతర్భాగమైంది ఆ భూతల స్వర్గం. భారతీయులెవ్వరైనా జమ్మూ కాశ్మీర్‌లో భూములను కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికీ వీలు కల్పించింది. అంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఎన్నో ఆంక్షలుండేవి.

జమ్మూలో… రెండెకరాలలో…

మారిన పరిస్థితుల మధ్య జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనివాసుడి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై ఇదివరకే పాలక మండలి కూడా ఓ తీర్మానం చేసింది. కొద్దిరోజుల కిందట టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సహా ఇతర అధికారులు జమ్మూ పర్యటనకు వెళ్లారు. అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించడానికి వారు అంగీకరించారు. జమ్మూలో ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు.

తిరుమల ఆలయ నమూనాలో…

దేశంలో పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు ఉన్నాయి. వాటి పరిపాలన, నిర్వహణ వ్యవహారాలన్నింటినీ టీటీడీ స్వయంగా పర్యవేక్షిస్తోంది. నిర్వహణ కోసం నిధులను మంజూరు చేస్తోంది. అదే తరహాలో- జమ్మూలో కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని, నిర్వహణ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న దేవస్థానాల కంటే ప్రత్యేకంగా- తిరుమల శ్రీవారి ఆలయ నమూనా తరహాలో దీన్ని నిర్మించాలని టీటీడీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

Source : One India
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.