News

పాక్‌ జాతీయతను దాచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న మహిళపై కేసు

40views

పాకిస్థాన్‌ జాతీయతను దాచి ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపుర్‌కు చెందిన మాహిరా అక్తర్‌ ఎలియాస్‌ ఫర్జానా అనే మహిళ 1979లో ఓ పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమెకు ఆ దేశ పౌరసత్వం లభించింది. కొన్నేళ్లకు విడాకులు కావడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి పాకిస్థాన్‌ వీసాపై భారత్‌కు చేరుకుంది. స్థానికంగా ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది.

అదే సమయంలో తనను తాను భారతీయురాలిగా చెప్పుకొంటూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రాంపుర్‌ జిల్లా కుమ్హరియా గ్రామంలో విధులు నిర్వహించింది. అయితే, విద్యాశాఖ అధికారులు నిర్వహించిన అంతర్గత విచారణలో ఆమె పాకిస్థానీ జాతీయురాలిగా తేలింది. నకిలీ పత్రాలతో ఉద్యోగం సాధించినట్లు గుర్తించింది. తొలుత ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అనంతరం విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.