ArticlesNews

నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు

232views

( డిసెంబర్ 15 – శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి )
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆయన పోరాట ఫలితంగానే డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు.

సత్యాగ్రహం, నిరాహారదీక్ష, సహాయనిరాకరణ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి మెడలు వంచడానికి వాడిన అస్త్రాలు. వాటిని త్రికరణశుద్ధిగా నమ్మి ప్రాణత్యాగం చేసిన వారు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మంది కూడా లేరు. వారిలో అరుదైన నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఆత్మత్యాగ ఫలితం. శ్రీపొట్టి శ్రీరాములుగారి వర్థంతి సందర్భంగా ఆయనకు పరిపూర్ణ నివాళులు అర్పించడం ప్రతి తెలుగువాడి కృతజ్ఞతాపూర్వక కర్తవ్యం. ఆయన త్యాగనిరతి మనందరికీ ఆదర్శం