
142views
2019 లో జాతీయవాది రామలింగం హత్య కేసులో కీలక పరిణామం సంభవించింది. తమిళనాడులో జరిగిన ఈ దారుణ హత్యకి సంబంధముండి, పరారీలో వున్న ఇద్దరు నేరస్థులను, వారికి ఆశ్రయం కలిగించిన మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు బృందం ప్రకటించింది.అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ బుర్హానుద్దీన్, మహ్మద్ నబిల్ హసన్ వున్నారు. రామలింగం హత్య జరిగినప్పటి నుంచి ఏడు సంవత్సరాలుగా పరారీలోనే వున్నారు.
వెల్లూరు జిల్లాలోని పల్లికొండలో ఇద్దరు ప్రకటిత నేరస్థులను పట్టుకున్నట్లు NIA తెలిపింది. “తంజావూరు జిల్లాలోని PFI సభ్యులు, ఇద్దరూ కుట్ర పన్ని, రామలింగం చేతులు నరికి హత్య చేయడానికి అనేక మందితో సమన్వయం చేసుకున్నారు” అని NIA ఒక ప్రకటనలో తెలిపింది.నేటికి, ఐదుగురు దోషులను అరెస్టు చేయగా, మొహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఆగస్టు మాసంలోనూ కీలక అరెస్ట్..
ఆగస్టు మాసంలో ఇదే కేసుకు సంబంధించి ఎన్ఐఏ తమిళనాడులో చాలా చోట్ల సోదాలు నిర్వహించింది. రామలింగం హత్య కేసుతో సంబంధముండి, పరారీలో వున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న కొడైకెనాల్‌లోని అంబర్ బిర్యానీ దుకాణం యజమాని ఇమ్తతుల్లాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.దిండిగల్, తెన్కాసి మరియు కొడైకెనాల్‌లలో NIA అధికారులు దాడులు నిర్వహించారు, వాటిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆఫీస్ బేరర్ షేక్ అబ్దుల్లా నివాసం కూడా ఉంది.

రామలింగం హత్య కేసు నేపథ్యం ఇదీ…
2019 ఫిబ్రవరిలో తంజావూరు జిల్లాలోని తిరుబువనంలో రామలింగం హత్య జరిగింది. రామలింగం ఆ ప్రాంతంలో ఇస్లామిక్ మత మార్పిళ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటికి వ్యతిరేకంగా చైతన్యం కూడా తీసుకొచ్చారు. దీనిని సహించలేని నిషేధిత PFI సభ్యులు ఆయన్ను టార్గెట్ చేశారు. రామలింగం పీఎంకే కార్యకర్త. అయినా అక్రమ ఇస్లామిక్ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తల ముఠా ఆయన్ను దారుణంగా హత్య చేశారు.
తంజావూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇస్లామిక్ ఛాందసవాదులు దళితులు మరియు ఇతర హిందూ సోదరుల మతమార్పిడులను ఎదుర్కోవడానికి రామలింగం నిరంతర ప్రయత్నాలు చేసేవారు. ఫిబ్రవరి 5న తంజావూరులోని తిరుభువనమ్ ప్రాంతంలో ప్రజలను ఇస్లాంలోకి మార్చడంలో పాల్గొన్న వ్యక్తులతో రామలింగం వాదిస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది.

రామలింగంను ఇస్లాం మతంలోకి మారమని అడిగినప్పుడు వాగ్వాదం చెలరేగింది. అక్కడ మతమార్పిడిలో పాల్గొన్న ఇస్లామిస్ట్ నుండి అతను తలపై ఉన్న టోపీని తీసుకొని స్వయంగా ధరించాడు.తరువాత, రామలింగం తాను వాదిస్తున్న వ్యక్తి నుదిటిపై విభూతిని పూయడం కూడా అందులో కనిపిస్తుంది. ఆ ముస్లిం వ్యక్తి వెంటనే తన నుదుటిపై బొట్టును తుడిచేశాడు. అప్పుడు రామలింగం మాట్లాడుతూ.. తాను గౌరవ చిహ్నంగా ముస్లిం టోపీ ధరించానని, విభూతిని ఎందుకు తొలగించావు? అంటూ నిలదీశారు.అంతేకాకుండా మళ్లీ కాసేపు వాదన జరిగింది. వారు నిజమైన ముస్లింలు కారని, ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడంలో వున్న ఉగ్రవాదులంటూ మండిపడ్డారు. ఇలాంటి చాలా మంది వ్యక్తులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న బృందాన్ని గ్రామం నుంచి బయటకు వెళ్లిపోవాలని వారికి హుకూం జారీ చేశారు.
అయితే.. ఈ వాదన తర్వాత రామలింగం తన మోటార్ బైక్ ను రిపేర్ చేయించుకొని, తన కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ సమయంలో మసీదు వున్న వీధికి చేరేకున్నారు. అప్పుడు ఎదురు నుంచి నలుగురు వ్యక్తులు కారులో వచ్చి, అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కారం పొడి, కసాయి దుకాణాల్లో ఉపయోగించే కత్తులతో కారు నుంచి దిగారు. ఆ తర్వాత రామలింగం, అతని కుమారునిపై దాడి చేశారు. రామలింగం ప్రతిఘటిస్తున్న సమయంలోనే దుండగులు నరికేశారు. ఆ తర్వాత దుండగులు వెళ్లిపోగా, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిని చేర్చుకొని, చికిత్స ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారు.
ఆ తర్వాత అతన్ని కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుడు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం ఉన్న తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించమని సూచించారు.కానీ దురదృష్టవశాత్తు, రామలింగం తీవ్ర రక్త స్రావం కారణంగా మరణించారు.





