News

ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద వెలిగిన కార్తికదీపం

228views

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తికదీపం వెలిగించే విషయమై ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందూమున్నని, బిజెపి నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయం వద్ద కార్తిక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. ఈ సంవత్సరం అక్కడ కాకుండా కొండపై సికందర్‌ దర్గాకు 15 మీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభంపై దీపం వెలిగించేందుకు రామ రవికుమార్‌ అనే వ్యక్తి పటిషన్‌ దాఖలు చేయగా అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు చేయలేదని తెలిపి పిటిషనర్‌ బుధవారం సాయంత్రం 5 గంటలకు కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. 6 గంటలకు కార్తికదీపం వెలిగించాలని లేదంటే 6.05కు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతారని న్యాయమూర్తి తెలిపారు. దీపం వెలిగించేందుకు మదురై ధర్మాసనంలో భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో వెళ్లాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటికే ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్వాహకం తరఫున కార్తిక దీపం వెలిగించారు.

ఉత్తర్వులు చట్టవిరుద్ధం..
తిరుప్పరకుండ్రం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జయచంద్రన్, జస్టిస్‌ రామకృష్ణన్‌ ధర్మాసనంలో విచారణకు వచ్చింది. దీప స్తంభంలో దీపం వెలిగించే వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం తరఫున తెలిపారు. తాము అప్పీల్‌కు సిద్ధమవుతుండగా సీఐఎస్‌ఎఫ్‌ భద్రత నడుమ దీపం వెలిగించేందుకు అనుమతిచ్చారని, ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. పిటిషనర్‌ 10 మందితో వెళ్లి దీపం వెలిగించేందుకు అనుమతివ్వగా ఆయన చాలామందితో బయల్దేరారన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని హైకోర్టు భద్రతకు నియమించారని, వారికి హైకోర్టు ప్రాంగణం దాటి ఏ అధికారం లేదన్నారు.

ప్రభుత్వ అప్పీల్‌ కొట్టివేత..
దీప స్తంభంలో కార్తిక దీపం వెలిగించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించిన న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ని కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో తప్పు ఉన్నట్లు తెలియలేదని, ప్రభుత్వం ఏదో ఉద్దేశంతో కేసు దాఖలు చేసిందని తెలిపారు. మరోవైపు 144 సెక్షన్‌ ఉత్తర్వులు రద్దు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ తిరుప్పరకుండ్రం కొండపై రాత్రి 7 గంటల్లోపు దీపం వెలిగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కొండపైకి వెళ్లేందుకు అనుమతి లేదని, 144 నిషేధ ఉత్తర్వులను రద్దుచేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్‌ చేయనుందని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్, సీనియర్‌నేత హెచ్‌.రాజా తదితరులు అరెస్టు చేశారు.

బారికేడ్లను ధ్వంసం చేసి.. ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
దీపం వెలిగించేందుకు హిందూ మున్నని, బిజెపి నేతలు భారీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో తిరుప్పరకుండ్రం కొండ, చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్‌ విధిస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో తిరుప్పరకుండ్రంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి ఆందోళనకారులు పోలీసులపై దాడిచేయడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డాడు. కొండపైకి వెళ్లేందుకు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అనుమతివ్వలేదు. హిందూ మున్నని నిర్వాహకులతోపాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి సూర్య సహా 15 మందిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.