News

అమరావతిలో గిరిజన చిన్నారుల ఉద్భవ్-2025 వేడుక

132views

గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని కేఎల్ యూనివర్శిటీ వేదికగా ఉద్భవ్-2025 వేడుకలను కేంద్రమంత్రి తొలిరోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాష కూడా ముఖ్యమే అన్నారు. గిరిజన వ్యవహారాల శాఖకు వాజ్ పేయి హయాంలో నామకరణం జరిగిందని ప్రస్తావించారు. గత ఐదేళ్లూ జరిగిన గిరిజన సంస్కృతి ఉత్సవాల సమయంలోనూ తానే కేంద్రమంత్రిగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జవహర్ లాల్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి ఓరమ్ స్పష్టం చేశారు. క్రీడల్లో కూడా గిరిజన విద్యార్థులు మెరుస్తున్నారన్నారు. ఉద్భవ్ అంటే హృదయాంతరాల నుంచి బయటకి తీయడం అనే అర్థం అన్నారు. అందుకే ఈ ఉత్సవాలకు ఆ పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంతో కష్టపడి ఉత్సవాలలో లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ లను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవాన్ని జువల్ ఓరమ్ ఆవిష్కరించారు. అనంతరం కేంద్రమంత్రి జువల్ ఓరమ్ ని రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి సన్మానించారు. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ఓరమ్ ను ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆయన సభా ప్రాంగణం వద్ద గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. బొమ్మలను పరిశీలించారు. విల్లును పట్టుకుని బాణాన్ని ఆకాశానికి ఎక్కుపెట్టి కేంద్రమంత్రి ఓరమ్ సందడి చేశారు. అక్కడే ఏర్పాటైన గిరిజనుల ఉత్పత్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాల్ ను సందర్శించారు. దాంతో పాటు గిరిజనుల ఉత్పత్తి అయిన తేనే బాటిళ్లను పరిశీలించారు.

ఉద్భవ్-2025 వేడుక కాదు..గొప్ప మార్పుకు వేదిక : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
ఉద్భవ్-2025 అంటే వేడుక కాదు..గొప్ప మార్పుకు వేదిక అని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. చిన్నారులలోని ప్రతిభ, సృజనాత్మకతను బయటకి తీసి విశ్వాసం నింపాలనేదే లక్ష్యమన్నారు. కొత్త పరిచయాలు, కొత్త సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఈ ఉత్సవం వల్ల సాధ్యపడుతుందన్నారు. 405 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి 1647 మంది తరలివచ్చారని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావడం సంతోషకరమన్నారు. 110 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

గిరిజనుల అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఉద్భవ్ -2025 వేదికగా మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు సీఎం నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. గిరిజన చిన్నారులు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్ల వంటి గొప్ప చదువు చదవడమే కాకుండా మంచి పౌరులుగా నిలవాలన్నారు. గెలుపు ముఖ్యమే..కానీ ఓటమికి మాత్రం భయపడకూడదంటూ ప్రసంగంతో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలోని గిరిజన బిడ్డల చదువు, పాఠశాల వసతులకు మరిన్ని నిధులివ్వాలని కేంద్రమంత్రి ఓరమ్ కు విన్నవించారు. గిరిజనులుండే రిమోట్ ఏరియాలో రోడ్డు నిర్మాణం, అనుసంధానానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఏపీకి మరిన్ని ఈఎంఆర్ఎస్ స్కూళ్లను మంజూరు చేయాలన్నారు