News

నేషనల్ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై నేరపూరిత కుట్ర అభియోగాలు..!

178views

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్లు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు.

ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతోపాటు యంగ్‌ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌‌కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని వెల్లడించింది.

అయితే కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్‌ వోరా 2020లో, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మరణించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్‌ జర్నలిస్ట్స్‌ లిమిటెడ్‌ (AJL‌)కు కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది.