
1922 మార్చి 7వ తేదీన, గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఉండే పాల్ దధ్వావ్ అనే ప్రశాంతమైన గిరిజన గ్రామం.. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత భయంకరమైన ఊచకోతల్లో ఒకదానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 1,200 మందికి పైగా గిరిజన స్త్రీ, పురుషులు బ్రిటిష్ వలస సైన్యం చేతిలో దారుణంగా చంపబడ్డారు. ఈ విషాదాన్ని తరచుగా గుజరాత్ మరుగునపడిన జలియన్ వాలాబాగ్ అని పిలుస్తారు. వలస పాలకుల దారుణాలకు ఇది నిదర్శనంగా మిగిలినా, చరిత్రలో దీనికి సరైన గుర్తింపు రాలేదు.
అడవుల్లో నివసించే భిల్లులు మరియు ఇతర గిరిజన వర్గాలపై బ్రిటిష్ వారు విధించిన అధిక భూమి శిస్తు (Land Tax) కారణంగా.. ఉద్యమం ప్రారంభమైంది. అప్పటికే పేదరికంలో ఉన్న గిరిజనులను.. ఈ పన్నులు మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. రాజస్థాన్‌కు చెందిన గిరిజన సంస్కర్త అయిన మోతీలాల్ తేజావత్ ఈ ప్రతిఘటనకు నాయకుడిగా నిలిచారు. ఈ అన్యాయాన్ని గుర్తించిన ఆయన.. గుజరాత్, రాజస్థాన్‌లలోని భిల్ తెగలను ఏకం చేసి, ‘ఏకీ ఉద్యమం’ అనే శాంతియుతమైన నిరసనను ప్రారంభించారు.
ఆ దారుణమైన ఘటన జరిగిన రోజున, వేలాది మంది భిల్లులు మరియు ఇతర గిరిజనులు.. హిరూ నది ఒడ్డున గుమిగూడారు. వాళ్లు తమ సాంప్రదాయ విల్లులు, బాణాలు పైకి ఎత్తి, “మేము పన్ను చెల్లించము!” అంటూ బిగ్గరగా నినదిస్తూ.. అన్యాయంగా విధించిన భూమిపై పన్నును వ్యతిరేకించారు.
ఈ ప్రజా ఉద్యమాన్ని చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం.. మేవార్ భిల్ దళాన్ని (Mewar Bhil Corps) మరియు ఇతర వలస సైనికులను పంపింది. అక్కడికి వచ్చిన హెచ్.జి.సట్టన్ అనే అధికారి నిరాయుధులైన ఆ జన సమూహంపై కాల్పులు జరపమని సైనికులను ఆదేశించాడు. ఈ ఊచకోతలో సుమారు 1,200 నుంచి 1,500 మంది గిరిజనులు చనిపోయినట్లు అంచనా. అయితే, అధికారిక బ్రిటిష్ రికార్డులు మాత్రం.. ఈ సంఖ్యను చాలా తక్కువగా చూపించాయి. అయితే ఈ ఘటన తాలూకు సాక్ష్యాలను దాచిపెట్టే ఉద్దేశ్యంతో.. బ్రిటీష్ అధికారులు పెద్ద సంఖ్యలో శవాలను సమీపంలో ఉన్న బావుల్లో, హీరూ నదిలో పడేశారు.
ఈ ఊచకోతలో ఓ గొప్ప విషయం ఏమిటంటే.. ఈ ఉద్యమానికి నాయకుడైన మోతీలాల్ తేజావత్ బతికి బయటపడటమే. ఆయనపై రెండుసార్లు కాల్పులు జరిగినా.. గ్రామస్తులు ఒంటెపై పంపించి ఆయన్ని కాపాడారు. చివరకు ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తన ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధత చూపిన తేజావత్.. తర్వాత ఊచకోత జరిగిన ప్రాంతానికి తిరిగి వచ్చి, చనిపోయిన వీరులకు నివాళులర్పిస్తూ ఆ ప్రదేశానికి “వీరభూమి” అని పేరు పెట్టారు.
ఈ రోజుకీ.. గిరిజన కుటుంబాలు తమ సంస్కృతిలో ఈ విషాదాన్ని మర్చిపోకుండా.. నోటి మాట ద్వారా చెప్పే కథలు, పాటల ద్వారా గుర్తు చేసుకుంటారు. “హంసు దుఖి, దునియా దుఖి” (హంసు దుఃఖాన్ని చూసి లోకం విలపిస్తుంది) లాంటి పాటలతో ఆ చరిత్రను పదిలపరుస్తున్నారు.
ఈ ఊచకోత పవిత్రమైన గిరిజన పండుగ అయిన ఆమ్లకీ ఏకాదశి రోజున.. హోలీకి కొద్ది రోజుల ముందు జరిగింది. పూజ, నిరసన కలగలిపి జరిగిన ఆ శాంతియుత సమావేశం.. భయంకరంగా మారి, ఆ ప్రాంతం అంతా శవాల దిబ్బలా తయారైంది. చాలా మంది గ్రామస్తులు బావుల్లోకి దూకి లేదా అడవుల్లోకి పారిపోవడానికి ప్రయత్నించినా.. కనికరం లేకుండా కాల్చి చంపేశారు. గిరిజన వర్గాలను భయపెట్టి లొంగదీసుకోవడానికి బ్రిటిష్ వారు చేసిన ఈ ఊచకోత.. చివరకు మరింత ప్రతిఘటనకు కారణమై, గిరిజనుల అకుంఠిత పోరాట స్ఫూర్తికి చిహ్నంగా మారింది.
నేడు, పాల్ దధ్వావ్ గ్రామంలో అమరుల జ్ఞాపకార్థం ఒక స్మారక గోడ (memorial wall) ఉంది. అంతేకాకుండా, చనిపోయిన ప్రతి అమరుడికి గౌరవంగా 1,200 చెట్లతో నాటిన ‘షహీద్ వన్’ అనే అడవి కూడా ఉంది. బాధితుల వారసులు, బతికి ఉన్న వాళ్ళు తమ పూర్వీకుల ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంటూ.. వారిని స్మరించుకుంటారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. అంతేకాక, భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కూడా దీనికి స్థానం దక్కింది. ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి గిరిజన వర్గాలు అందించిన ముఖ్యమైన సహకారాన్ని తెలియజేస్తుంది.
భారత స్వాతంత్య్ర పోరాటం పట్టణాలకు, ప్రసిద్ధ నాయకులకే పరిమితం కాలేదు. మారుమూల అడవులు, గ్రామాల్లో కూడా పోరాటం జరిగింది. అలాంటి గిరిజనుల ధైర్యం, త్యాగాలకు చిరస్థాయిగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ మరుగునపడిన అధ్యాయమే గుర్తుచేస్తుంది.





