
( నవంబర్ 17 – శ్రీ కావ్యకంఠ గణపతి ముని జయంతి )
గణపతి ముని లౌకిక, ఆలౌకికమైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు. తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణకి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేసారు గణపతి ముని. రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాలలో గణపతి ముని అనుభవపూర్వక జ్ఞానం ఆయన రచనలలో కనిపిస్తుంది. సమాజాన్ని ధర్మ దృష్టితో చూసి, దానిలో రావలసిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావులలో ఒకరు గణపతి ముని.
అస్పృశ్యత నిర్మూలించటానికి, షెడ్యుల్ కులాలు, తెగలకు చెందినవారిని తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణిలోకి ఐక్యం చేయడానికి, వారి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయడమేకాక అందుకు స్వయంగా ప్రయత్నించారు. మంత్ర దీక్షల ద్వారా, బోధల ద్వారా ఈ వర్గాలకు చెందినవారి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి కృషిచేసారు. ఈ పనిలో సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే, సమాజాన్ని దుయ్యబట్టకుండా సకారాత్మకమైన ఉద్యమం చేపట్టారు.
నాయనగా సుప్రసిద్ధులైన కావ్యకంఠ గణపతిముని 1878 నవంబరు 17న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. 19 ఏళ్లకే వ్యాకరణాలంకార సాహిత్య శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో పండితుడై 1896 నుండి 1902 వరకు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కాలక్రమేణా కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిగా ప్రసిద్ధి పొందారు. భారత దేశ వైభవాన్ని కోరుతూ 1922 లో “ఇంద్రాణీ సప్తశతి” అనే పుస్తకం వ్రాసి మహిళలు సైతం యజ్ఞోపవీతం, మంత్రోపదేశానికి అర్హులని బహిరంగంగా చాటి చెప్పిన మన ఆంధ్రుడు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని 1936 జూన్ 25న సమాధి పొందారు.
మహావిద్యా సూత్రాలలో గణపతి ముని శాక్త విద్యల తత్వాన్ని బొధిస్తూ, వేదంలో, ఉపనిషద్విద్యలలో, తంత్రంలో, గ్రామ దేవతలలో ఉన్న ఐక్యతను చూపించారు. శాక్తం లోని చిన్నమస్త దేవతే , గ్రామ దేవత అయిన రేణుక అని ఆయన చూపించారు. ఆ విధంగా గ్రామీణ, స్థానిక దేవతలు, పుజాపద్దతులు వేద సంప్రదాయం నుంచి, దానికి కొనసాగింపుగా వచ్చినవేనని గణపతి ముని నిరూపించారు. తద్వారా ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని మనకు గుర్తుచేశారు. హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది నాయకులు చెప్పినా, గణపతి ముని ఆ ఐక్యతను జన మానసంలో తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు.




