
( అక్టోబరు 26 – జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవం )
స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎదుర్కొన్న సమస్యల్లో స్వదీశీ సంస్థానాల విలీనం ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించడానికి భారత ప్రభుత్వం 1947 జూన్ 25న ఎస్టేట్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అధ్యక్షుడిగా, వి.పి. మీనన్‌ను కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరి కృషి ఫలితంగానే స్వదేశీ సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయి. అయితే జునాగఢ్‌తో పాటు పెద్ద సంస్థానాలైన హైదరాబాద్, కశ్మీర్ విలీనానికి అంగీకరించలేదు. 1947 నాటికి కశ్మీర్ సంస్థానాధీశుడిగా రాజా హరిసింగ్ ఉన్నారు. హరిసింగ్ పాలనను వ్యతిరేకిస్తూ ముస్లింలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా పోరాటం చేశారు. 1946 మేలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘క్విట్ కశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. అబ్దుల్లాకు నెహ్రూ మద్దతు తెలపడంతో రాష్ట్రంలో అరాచక పరిస్థితి తలెత్తింది. చివరకు ‘క్విట్ కశ్మీర్’ ఉద్యమం పూర్తిగా విఫలమైంది. అబ్దుల్లా భారతదేశానికి మిత్రుడు కాదని, అతడిని జైలు నుంచి విడుదల చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని భారత జాతీయ కాంగ్రెస్ ను ఒప్పించడానికి మహారాజా చాలాసార్లు ప్రయత్నించాడు. అయినప్పటికీ అబ్దుల్లా పట్ల నెహ్రూకు ఉన్న మక్కువ చెక్కుచెదరలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులెవరూ నెహ్రూ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. భారత ప్రధానమంత్రి అయిన తరువాత, అబ్దుల్లాను విడుదల చేయమని నెహ్రూ మళ్ళీ మహారాజాపై ఒత్తిడి తెచ్చారు. చివరకు అబ్దుల్లా 1947 సెప్టెంబరు 29న విడుదలయ్యాడు. ఆ వెంటనే అక్టోబరు 2న హజూరి బాగ్ లో అబ్దుల్లా ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రజలు పాకిస్థాన్ లో చేరాలని నిర్ణయిస్తే దానిపై సంతకం చేసే మొదటి వ్యక్తి తానేనని ప్రకటించాడు.
మహారాజు హరిసింగ్ కు సర్దార్ పటేల్ అంటే ఎంతో గౌరవం ఉండేది. 1947 జూలై 3న భారతదేశంతో విలీనాన్ని అంగీకరించమని మహారాజాకు సర్దార్ లేఖ రాశారు. ఆయన మాత్రం సమయం కోసం ఎదురు చూశారు. పాక్‌తో విలీనం తన రాష్ట్రానికి, భారతదేశానికి మంచిది కాదని హరిసింగ్ విశ్వసించారు. కశ్మీరును తమ యూనియన్లో కలపాలని పాకిస్థాన్ హరిసింగ్‌పై ఒత్తిడి తెచ్చింది. దీనికి అంగీకరించలేదని కశ్మీర్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఆహార పదార్థాల సరఫరాను నిలిపివేసింది. చివరగా 1947 అక్టోబరు 22న తమ సరిహద్దు సైన్యంతో పాకిస్థాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడింది.
పరమ పూజ్య శ్రీగురూజీ మహారాజా హరిసింగ్ ను ఒప్పించి కశ్మీర్ ను భారత్ లో విలీనం చేయగలరని పటేల్ కు నమ్మకం ఉంది. అప్పటి జమ్ముకశ్మీర్ ప్రధాని మెహర్ చంద్ మహాజన్ తో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని, వీలైనంత త్వరగా మహారాజా, గురూజీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పటేల్ కోరారు. 1947 అక్టోబరు 17న ప్రత్యేక విమానంలో పూజ్య గురూజీ శ్రీనగర్ చేరుకున్నారు. గురూజీతో హరిసింగ్ అధికారికంగా చర్చలు జరిపారు. ‘ఆరెస్సెస్ స్వయం సేవకులు ఎప్పటికప్పుడు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నారు. మొదట్లో ఆ నివేదికలను మేం నమ్మలేదు… కానీ ఇప్పుడు వాటిపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పాకిస్తాన్ సైన్యం కదలికల గురించి తెలియజేయడంలో సంఘ్ వాలంటీర్లు చూపిన ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. అబ్దుల్లా కార్యకలాపాల పట్ల స్వయంగా పటేల్ అప్రమత్తంగా ఉంటే, కశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం` అని హరిసింగ్ ప్రకటించారు. 1947 అక్టోబరు 24న మీనన్ శ్రీనగర్ వెళ్లి విలీన పత్రంపై సంతకంతో ఢిల్లీకి తిరిగొచ్చారు. గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఆమోదంతో 1947 అక్టోబర్ 26న జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగమైంది. వెంటనే భారత సైన్యం విమానాల ద్వారా శ్రీనగర్ చేరుకుని పాక్ సైన్యాన్ని నిలువరించింది.





