
ప్రజాస్వామ్యం అనే పదం పాకిస్థాన్‌కు ఎప్పటికీ వింతేనని భారత్ దుయ్యబట్టింది. ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆ దేశ సైన్యం ఆక్రమణ, అణచివేత, వనరులను చట్టవిరుద్ధంగా వినియోగించడం వంటి వాటిపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. ఆ ప్రాంత ప్రజలు భారత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇది పాక్‌కు ఎప్పటికీ మింగుడుపడని విషయమని ఎద్దేవా చేశారు.
ఇక, భారత్ వసుదైవ కుటుంబకం అని అన్నారు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడటం, అందరికీ న్యాయం, గౌరవం కోసం తన గొంతుకను వినిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఆశాకిరణంగా యూఎన్ స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. వలస రాజ్యాల నిర్మూలనకు సంస్థ ఎంతో కృషి చేసిందన్నారు.





