
( అక్టోబరు 25 – నాగుల చవితి )
పశుపక్ష్యాదుల్ని దైవంగా భావించడం హైందవ సంస్కృతి. మన ప్రతి ఆచారంలోనూ ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంటాయి. ఈ క్రమంలో కార్తిక శుద్ధ చతుర్థి అయిన నాగులచవితి నాడు.. నాగుపామును ఆరాధించడం పరిపాటి.
ఈ రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే స్నానపానాదులు ముగించి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగులతో కలిసి పుట్టదగ్గరకు చేరుకుంటారు. ఆ ప్రదేశాన్ని శుభ్రంచేసి, ముగ్గులు వేసి కుంకుమ, పసుపు చల్లుతారు. పుట్టచుట్టూ దీపాలు పెట్టి, అగరొత్తులు వెలిగిస్తారు. బెల్లం, నువ్వులు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆవుపాలను పుట్టలో పోస్తారు. ఇలా పూజిస్తే నాగదేవత తమను కాపాడుతుందని విశ్వసిస్తారు. చిన్నారులు చదువులో రాణించాలని కోరుకుంటే.. యువతులు మంచి వరుడు భర్తగా లభించాలని వేడుకుంటారు. పెళ్లయిన స్త్రీలు కుటుంబంలో సుఖసౌఖ్యాలు, సిరిసంపదలు వర్థిల్లాలని ప్రార్థిస్తారు.
నవ రంధ్రాలు గల మానవ దేహాన్ని పుట్టతో పోలుస్తారు. మట్టితో తయారైన ఈ దేహం మట్టిలోనే కలిసిపోతుందనే నగ్నసత్యాన్ని గుర్తుచేస్తుంది పుట్ట. అందులో ఉండే నాగదేవత మన ప్రాణానికి ప్రతిరూపం. మూలాధార చక్రంలో రెండు మహాకాలసర్పాలు మూడు చుట్టలు చుట్టుకొని నిద్రాణస్థితిలో ఉన్న కుండలినీ శక్తికి ప్రతీక. ఇదే శక్తి వెన్నెముకలో సుషుమ్ననాడి రూపంగా పైకీ, కిందికీ సంచరిస్తుంటుంది. వెన్నెముకను ‘వీణాదండం’, ‘వెన్నుబాము’ అని కూడా అంటారు. పుట్టలోని నాగదేవత మనలో కుండలినీశక్తిగా ఉంది.. ధ్యాన, ప్రాణాయామాలతో మనలోని నాగన్నను పూజించాలి- అన్నదే ఈ పండుగలోని పరమార్థం.
దేవాలయాల్లో నాగశిలలు దర్శనమిస్తుంటాయి. వాటిని కూడా మూలాధారంలో రెండు కాలసర్పాలు చుట్టలు చుట్టుకొని ఉన్న కుండలినీశక్తిగానే భావించి ఆరాధించాలి. నాగుల చవితిరోజు పుట్టలోని పామును పూజించినట్లే ఆలయంలోని నాగశిలకు నమస్కరించాలని, ఈ పర్వదినాన గుడిలో నాగశిలను ప్రతిష్టిస్తే జన్మజన్మల కర్మ దోషాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు.
ఆలయాల్లో మూలమూర్తులకు నాగాభరణాలను ధరింపచేయడం సాధారణం. శ్రీమహావిష్ణువు పాలకడలిలో శయనించడానికి ఆదిశేషుణ్ణి పాన్పుగా మలచుకున్నాడు. కైలాసపతి పరమేశ్వరుడు వాసుకిని కంఠహారంగా ధరించాడు. నాగులనే ఆభరణాలుగా చేసుకున్నాడు. హరిహరులకు నాగజాతి పట్ల ఉన్న ప్రేమకు ఇవి నిదర్శనం.
నాగదేవతను ఆరాధించే ఆచారం అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అసోంలో మరింత ప్రత్యేకం. నాగులచవితి సందర్భంగా ఇక్కడి మానసాదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నాగలోకానికి రాణి అయిన మానసాదేవి ఇష్టకామ్యాలను సిద్ధింపజేయడమే కాకుండా విషప్రాణుల వల్ల హాని కలగకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు. గువాహటిలో 13వ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి ఆలయానికి సమీపంలో కొండపై కొలువైంది మానసాదేవి.





