
కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత భారతీయులందరిది అని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ అన్నారు.ఆయన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ సభ్యులతో కలసి గుంటూరు జిల్లాలోని అమరావతిని సందర్శించారు.
ఈ సందర్బంగా ఠాగూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాచీన వారసత్వ కట్టడాలను పరిరక్షించటానికి ప్రస్తుతం 241 ఇంటాక్ చాప్టర్లు పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చారిత్రక ప్రాచీన వారసత్వ సంపదను గుర్తించటానికి రాష్ట్రంలోని సంస్థ సభ్యులు పనిచేయాలన్నారు. లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలను అమరావతి మ్యూజియంలో ఉంచాలన్నారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అమరావతి శిల్పాలలో ప్రాచీన నాగరికతలు, అనాటి చారిత్రక పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయన్నారు. అమరావతి అర్కియాలజీ మ్యూజియం, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయంలను సందర్శించారు.





