
– ఆచార్య అవధాని
ఆంధ్ర విశ్వకళాపరిషత్
మన భారతావని ఎన్నో ఆవిష్కరణలకు పెట్టింది. పేరు. ఇక్కడ ఎందరో మహర్షులూ, జ్ఞానులూ, శాస్త్రవేత్తలూ పుట్టారు. ఎంతోమంది ఎన్నో వైజ్ఞానిక విషయాలను ఆవిష్కరించి మానవాళికి ఎంతోసేవ చేశారు. వారెవ్వరూ పేరు ప్రఖ్యాతులాశించి ఈ పనులు చేయలేదు. మానవాళికి మంచి చేయాలన్న తపనే వారి లక్ష్యం. వారు చేసిన పనులూ, ఆవిష్కరణలూ ఈనాటి కంప్యూటరు యుగంలో కూడ చాల అవసరమయ్యాయి. అందులో ఒకదాని గురించి ఈనాటి ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను.
మనము ప్రస్తుతం ఉన్న కంప్యూటరు యుగంలో కంప్యూటరు భాషలు తెలియనివారుండరు. ఎన్నో భాషలున్నాయి. ఉదాహరణకి జావా, సి, సీ++, పైధాన్ మొదలైనవి దాదాపుగా 300 పై చిలుకు భాషలున్నాయి. మనం ముందుగా ఈ భాషల గురించి కొంచెం తెలిసికొంటే మన పాణిని యొక్క గొప్పతనము అర్థమౌతుంది.
మామూలుగా చెప్పాలంటే భాషయొక్క ప్రధాన ఉద్దేశ్యం భావవ్యక్తీకరణ కదా! మాట్లాడటం కాకుండా, వ్రాయవలసిన భాషైతే దీనికి మూడు అంశాలుండాలి.
1. అక్షరమాల (Alphabets)
2. ఆ అక్షరమాలని పదాలుగా, వాక్యాలుగా వ్రాయడానికి కావలసిన సూత్రాలు (Syntax)
3. అలా వ్రాసిన పదాలు, వాక్యాలు అర్థములు తెలుపునవి (Semantics)
ఉదాహరణకి, తెలుగులో 56 అక్షరములున్నాయి. అ నుండి ఱ వరకు వాటిని తెలుగు అక్షరమాల అంటాం కదా. (తెలుగు యొక్క Alphabets)
మనం ‘అమ్మ’ అని పలికితే దానిని అంమ అని వ్రాయము కదా! ఎందుకంటే ‘అంమ’ అని వ్రాయడం వ్యాకరణ సూత్రపరంగా తప్పు. అంటే Syntax పరంగా ‘అంమ’ అని వ్రాయటం తప్పు . మూడవది. ‘అమ్మ’ అన్ని వ్రాస్తే దాని అర్థం తెలియడం Semantics అంటాం.
ఉదాహరణకి ‘శార్దులము’ అని వ్రాస్తే దాని అర్ధం పులియనికదా! అది Semantics. ‘‘శార్దూలము’’ అనే పదాన్ని ‘సార్దులము’ అని వ్రాయటం తప్పు అది Syntax. అలాగే ‘విద్యని విధ్య అని వ్రాయటం తప్పు.
మనకి పైన చెప్పిన మూడు విషయాలు అర్ధమైయ్యాయనుకుంటాను. ఈ మూడింటిని కలిపి వ్యాకరణం అనవచ్చు.
ఈ వ్యాకరణమున తయారయే పదాలు, అర్ధవంతమైన పదాలు కలిపితే భాష అనవచ్చు. అది మామూలు వ్యావహారిక భాష అయినా సరే, కంప్యూటరు భాషైనా సరే.
వ్యావహారిక భాషలంటే తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లం లాంటివి. కంప్యూటరు భాషలంటే JAVA, C, C++, PYTHON లాంటివి.
అందువల్ల భాషలను రెండు రకాలుగా విభజించవచ్చు.
1. వ్యావహారిక భాషలు
2. కంప్యూటరు భాషలు
ప్రధానమైన తేడా ఏమిటంటే, మొదటివాటిల్లో పదాలలో గానీ, వాక్యాలలో గానీ కొంత అందిగ్ధత ఉండవచ్చు. కాని రెండవదానికి అలాంటివి కుదరవు. ఒక మాటకి ఒకే అర్థముండాలి.
ఉదాహరణకి ‘దయచేయండి’ అని మనం అంటే రమ్మని అర్థమే, పొమ్మనీ అర్థమే తెలుగులో దీనినే కృతిమ మేధని ఉపయోగించి ఒక రోబోకి నేర్పాలంటే దానికి ఖచ్చితమైన ఒకటే అర్థం చెప్పాలి.
ఇలాంటి సందిగ్ధాలు భాషలో ఎంత తక్కువగా ఉంటే భాషను అంత శాస్త్రీయమైనభాష అని మనం గమనించవచ్చు.
కంప్యూటరు భాషల విషయానికొస్తే 1957వ సంవత్సరంలో FORTRAN అనేభాషను ప్రవేశపెట్టేరు. తర్వాత PASCAL, COBOL, C, C++, JAVA అలాంటి అనేక భాషలు వచ్చేయి. భాష అనగానే దానికి వ్యాకరణం (అంటే మొదట చెప్పిన 3 విషయాలు ) ఉండాలి కదా. ఒక్కొక్క భాషకీ, ఒక్కొక్క రకమైన సూత్రాలున్నాయి.
అసలు కంప్యూటరు భాషలు తయారు చేయాలంటే వ్యాకరణాలు ఉండాలి? వీటన్నింటికీ కలిపి ఒక రకమైన విధానము ( Formalism ) తయారు చేయగలమా ? అని ఇద్దరు భాషా శాస్త్రజ్ఞులు సుమారు 50 సంవత్సరాల క్రితం ఆలోచించి ఒక విధానాన్ని రూపొందించారు. వారి పేర్లు BACKUS మరియు NAUR అందువల్ల దానిని BACKUS – NAUR – FORM బిఎన్ఎఫ్ అని అంటారు. ఈ విధానం ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం మట్టి వినాయకుని తయారు చేసే అచ్చు లాంటిది అన్నమాట. ఈ విధానం గానీ అనుసరిస్తే తయారుకాబడిన కంప్యూటర్ భాషకు కావలసిన లక్షణాలన్నీ వస్తాయన్నమాట.
ఈ విధానం ప్రకారం 15 లక్షణాలుగా విభజించవచ్చు. అందులో ఎన్ని లక్షణాలు కలిగి ఉంటే ఆ భాష అంత శాస్త్రీయమైన భాషగా సిద్ధాంతరీకరించారు. ఈ 15 లక్షణాలూ కంప్యూటర్ భాషలకు సరే, మరి వ్యవహారిక భాషలకు ఎన్ని సరిపోతాయి ? అని ఒక భాషా శాస్త్రవేత్తకి సందేహం కలిగి వాటిని వ్యవహారిక భాషలకు అన్వయించి చూశాడు.
ఆంగ్లభాష సుమారుగా నాలుగు లక్షణాలను కలిగి ఉన్నట్లు గమనించాడు. 15 లక్షణాలలో భారతీయ భాషలు 7, 8, 9 దాకా లక్షణాలను కలిగి ఉన్నాయి. దానితో అతనికి ఆశ్చర్యం కలిగింది దీనికి కారణమేమిటనే ప్రశ్న మొదలైంది. వీటికి మూలమైన సంస్కృత భాషకు ఈ లక్షణాలు ఉన్నాయా ? ఉంటే ఎన్ని ఉన్నాయని చూశాడు ఆశ్చర్యంగా 11 లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మిగతా నాలుగు లక్షణాలు సంస్కృతం భాషకి లేవు అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అంటే 11 లక్షణాలు కచ్చితంగా ఉన్నాయి మిగతా నాలుగు ఉన్నాయంటే ఉన్నాయి. లేవనుకుంటే ఆధారాలు లేవు.
అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆంగ్లంలో ‘రామ కిల్డ్ రావణ’ అనే మాటలు పదాలను మార్చితే అర్థం మారిపోతుంది ఉదాహరణకు ‘రావణ కిల్డ్ రామ’ అంటే అర్థం సమూలంగా మారిపోయింది. అదే విషయం తెలుగులో వ్రాస్తే ‘రాముడు రావణున్ని చంపెను’, పదాలు మార్చిన ‘రావణున్ని రాముడు చంపెను’, అర్థం మారలేదు కదా !
ఇది ఒక లక్షణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. దీనిని బట్టి మనకి అర్థమైనదేమిటి ? సంస్కృతం భాష పాశ్చాతుల లెక్క ప్రకారం ( 15 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ) శాస్త్రీయ భాషగా పరిగణించబడిందని చెప్పవచ్చు. అయితే సంస్కృతానికి 15 కంటే ఎక్కువ లక్షణాలే ఉన్నాయి. అది వేరే సంగతి.
దీనిని బట్టి మనకు తెలిసినదేమిటంటే కంప్యూటర్లకు దగ్గరగా పనికి వచ్చే భాష సంస్కృతం అని చెప్పవచ్చు కృత్రిమ మేధకు అది చాలా ఉపయోగపడుతుంది కూడ.
ఇదంతా ఎందుకు చెప్తున్నానన్న అనుమానం రావచ్చు. పాణిని యొక్క ప్రతిభావంతమైన వ్యాకరణ శాస్త్ర రూపమైన “అష్టాధ్యాయి” గురించి చెప్పడానికి ఇన్ని వివరాలు.
పాణిని అనే శాస్త్రజ్ఞుడు “అష్టాధ్యాయి” అన్న సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. అందులో ఎనిమిది అధ్యాయాలున్నాయన్నమాట. దానిలో ఆయన ఈ విధంగా రాశాడు.
సంస్కృత భాష యొక్క శబ్దాలు శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ఢమరుకం నుండి వెలువడే శబ్దాల నుండి ఉత్పన్నమైనవనీ, వాటిని 14 సూత్రాలుగా విభజించాడు. వాటిని ‘మహేశ్వర సూత్రాలు’ అంటారు. ఆ 14 సూత్రాల ఆధారంగా సంస్కృత భాషకు అతడు అష్టాధ్యాయి రాయడం జరిగింది. ఈ 14 సూత్రాలు వ్రాయడానికి అతడు ఒక విధానాన్ని అనుసరించేడు. విధానం అంటే ఆంగ్లంలో Formalism అని చెప్పుకున్నాం కదా. ఆ విధానం చూసిన తర్వాత పాశ్చాతులకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అదే విధానం బిఎన్ఎఫ్ (మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం) అంటే BACKUS -NAUR కనిపెట్టిన బిఎన్ఎఫ్ విధానం పాణిని ఎప్పుడో చెప్పడం జరిగింది. అందుకే సంస్కృతం అంత శాస్త్రీయమైన భాష అయింది పాణిని వ్రాసిన 14 సూత్రాలు ఈ క్రింద చూడవచ్చు.
మహేశ్వర సూత్రాలు
1. अ इ उ ण्
2. ऋ लृ क्
3. ए ओ ङ्
4. ऐ औ च्
5. ह य व र ट्
6. ल ण्
7. ञ म ङ ण न म्
8. झ भ ञ्
9. घ ढ ध ष्
10. ज ब ग ड द श्
11. ख फ छ ठ थ च ट त व्
12. क प य्
13. श ष स र्
14. ह ल्
అందుకే దానిని PAṆINI – BACKUS – NAUR FORM అనాలి అని కొందరు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు.
మనం పాణిని గురించి తెలుసుకుందాం. పాణిని పుట్టిన ప్రదేశంపై భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు చరిత్రకారులు అతని జన్మస్థానం పాటలీపుత్రమనీ, మరికొందరు వాయువ్య భారతమని చెబుతారు. మనం మన ఏకాత్మతా స్తోత్రంలో….. పాణిని నిశ్చ పతంజలి: అని చెప్పుకుంటాం కూడా.
ఆయన వివరాలు మనకు ఆయన రచనల ద్వారా మరియు మిగతా గ్రంథాల ద్వారా సేకరించినవీ, ఊహించినవేగానీ సరైన వివరాలు లభ్యం కాలేదని చెప్పాలి. ఆయన రచనలలో మనకు ప్రస్తుతం తెలిసినది ఆయన వ్రాసిన గొప్ప సంస్కృత వ్యాకరణ గ్రంథం “అష్టాధ్యాయి” దానిని గురించి ముందుగానే చెప్పుకున్నాం
రేవ్ బోడ్ అనే ఆమ్ స్టర్ డాం విశ్వవిద్యాలయంలో పనిచేసే భాషా శాస్త్రవేత్త ఇలా అన్నారు “భాషా శాస్త్ర చరిత్ర ప్లేటో లేదా అరిస్టాటిల్ తో కాదు. భారతీయ వ్యాకరణ వేత్త పాణినితో ప్రారంభమవుతుంది.”
బుద్ధుని కంటే ముందు శతాబ్దానికి చెందిన వాడని కొందరు, చంద్రగుప్త మౌర్యుడు పాటలీ పుత్రాన్ని జయించే నాటికి పాణిని అక్కడ మహా పండితులుగా గుర్తింపు పొందాడని కొందరు తమ పరిశోధనాలలో ఉటంకించారు అంటే అతడు కనీసం 3000 సంవత్సరాలకి పైగా ముందువాడు. సంస్కృతానికి ఒక నిర్దిష్టమైన సశాస్త్రీయమైన గొప్ప వ్యాకరణ గ్రంథాన్ని అందించినవాడు. ఆ గ్రంథం ఎంత సశాస్త్రీయమైనదంటే ఇప్పటి కంప్యూటర్ భాషలకు దీటుగా, వాటిని కృత్రిమ మేధలో ఉపయోగించడానికి కావలసిన మేలుకువలన్నీ ఉన్నంతగా. దీనిని బట్టి సంస్కృతం ఎంతటి గొప్ప భాషో అర్థమవుతుంది. కాలంతోపాటు క్షీణించకుండా, రూపాంతరం చెందకుండా ఇప్పటికీ అమృత భాషగా చలామణి అయ్యే భాష సంస్కృతం.
ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త ఇలా అన్నాడు “కొన్ని వేల సంవత్సరాల క్రితమే సంస్కృతానికి ఇంత గొప్ప వ్యాకరణ గ్రంథం వ్రాయబడిందంటే, ఆ భాష గొప్పతనం మన అర్థం చేసుకోవచ్చు. ఆ భాష కాలానికి అతీతం. సశాస్త్రీయం.”
పాణిని గురించి గానీ, అష్టాధ్యాయి గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం మన దేశంలో కొన్ని, అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ “అష్టాధ్యాయి”ని అనుసరిస్తూ కంప్యూటర్ భాషలను మెరుగుపరిచే విధంగా వాటిని కృత్రిమ మేధకు అనుసంధానం చేసే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం వారు 2004లో ఆయన గౌరవార్థం తపాలా బిళ్ళను కూడా ప్రవేశపెట్టారు.
రచయిత :
ప్రొఫెసర్ పి.ఎస్ అవధాని
(రిటైర్డ్ ) ప్రిన్సిపాల్, AVCE(A)
ఆంధ్ర యూనివర్సిటీ &
ఫార్మర్ డైరెక్టర్, IIIT, అగర్తల





