ArticlesNewsvideos

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శతాబ్ది సంవత్సరం, శ్రీ విజయదశమి ఉత్సవ్, యుగాబ్థి 5127

103views

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్
శ్రీ విజయదశమి సందర్భంగా నాగపూర్ లో ప.పూ. సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఇచ్చిన ఉపన్యాస సారాంశం
( ఆశ్వీయుజ శుక్ల 10, యుగాబ్ది 5127, గురువారం 02 అక్టోబర్ 2025)

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఈ విజయదశమికి నూరు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంలో మనమిక్కడ కలుసుకున్నాము. అలాగే శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదానం చేసి ఈనాటికి 350 ఏళ్ళు అవుతోంది. హిందుత్వ రక్షకుడిగా ఆయన చేసిన బలిదానం విదేశీయులు, విధర్మీయుల అత్యాచారాల నుండి హిందూ సమాజాన్ని రక్షించింది. ఆంగ్ల తేది ప్రకారం ఈనాడే స్వర్గీయ మహాత్మా గాంధీజీ జన్మదినం కూడా. మన స్వాతంత్య్ర పోరాటకర్తలలో ఆయన అగ్రగణ్యుడు కావడమేగాక, భారతదేశపు ‘స్వ’ ఆధారంగా స్వాతంత్ర్యానంతర భారతదేశపు సంకల్పం చేసిన దార్శనికులలోనూ ఆయన స్థానం విశిష్టమైనదే. నిరాడంబరత్వం, వినమ్రత, నిజాయితీ, దృఢత్వాలకు పేరొంది, దేశహితం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈనాడే.

భక్తి, సమర్పణ, దేశసేవ మొదలైన విషయాలలో వీరి సమున్నత ఆదర్శం మనందరికీ అనుసరణీయం. మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాడు అనే విషయాలు ఈ మహాపురుషులను చూస్తే మనకు అర్థమవుతుంది. నేడు భారతదేశపు పరిస్థితి, ప్రపంచపు స్థితిగతులలో ఇటువంటి వ్యక్తిగత, జాతీయ శీలసంపన్నుల అవసరం ఎంతైనా ఉంది. ఒక స్వతంత్ర దేశంగా మనం ఎంచుకున్న మార్గాన్ని గురించి గుర్తుచేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది.

ప్రస్తుత పరిస్థితి – ఆశలు, సవాళ్ళు
సంవత్సరమంతా విశ్వాసం, ఆశలను మరింతగా బలోపేతం చేసేదిగా గడిచింది. మరోవైపు పాత, కొత్త సవాళ్ళు మరింత స్పష్టమైన రూపంలో మనముందు నిలబడి మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.

ప్రయాగరాజ్ లో జరిగిన మహాకుంభమేళా పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షించి, అత్యద్భుతమైన ఏర్పాట్ల కారణంగా ప్రపంచప్రసిద్ధి పొందింది. భారతదేశమంతటా భక్తి, ఐకమత్యాలను బలంగా పాదుకొల్పింది.

సరిహద్దులు దాటుకుని వచ్చిన తీవ్రవాదుల ఏప్రిల్ 22న పహల్గాంలో జరిపిన దాడిలో 26 మంది భారతీయ పౌరులైన యాత్రీకులు మరణించారు. తీవ్రవాదులు వారి మతాన్ని అడిగి, హిందువులని నిర్ధారించుకునిమరీ హత్య చేశారు. భారతదేశంలోని ప్రజలందరిలో దుఃఖం, కోపజ్వాలలు పెల్లుబికాయి. భారత ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసి, మే మాసంలో ఈ మారణకాండకు తగిన సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో దేశ నాయకత్వపు దృఢత్వాన్ని, ఐకమత్యాన్ని మనమందరమూ చూశాము. అయితే అందరితోనూ స్నేహభావన చూపుతూనే రక్షణ విషయంలో మరింత ఎక్కువగా జాగ్రత్తతో వ్యవహరించడం, సమర్థత కలిగి ఉండటం అవసరమనే విషయాలు ఈ సందర్భంగా అర్థమయ్యాయి. అలాగే ప్రపంచంలోని దేశాలన్నింటి ప్రతిస్పందనలతో మనకు ఎవరెవరు స్నేహితులు, ఎవరు కాదన్న విషయం తేలిపోయింది.

దేశంలోపల ఉగ్రవాద నక్సలైటు ఉద్యమం పట్ల ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృఢంగా వ్యవహరించిన కారణంగాను, ప్రజలముందు వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టబయలు చేయడంవల్ల, దాన్ని నియంత్రించడం జరిగింది. శోషణ, అన్యాయం, అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వం, అధికారయంత్రాంగంలో ఈ విషయాల పట్ల సంవేదన లేకపోవడం కారణంగా అనేకచోట్ల నక్సల్స్ బలపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య దూరమై, ఆయా ప్రదేశాలలో న్యాయం, అభివృద్ధి, సద్భావన, సంవేదనాశీలత, సామరస్యం ఏర్పరచడం కోసం విస్తృతమైన ప్రణాళికను ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రూపొందించబడాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక రంగంలో కూడా జరుగుతున్న పరిణామాల కారణంగా మన ఆర్ధిక స్థితి అభివృద్ధి దిశలో సాగుతోందని చెప్పుకోవచ్చు. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టాలనే కోరిక సర్వసాధారణ ప్రజలలోనేగాక, పారిశ్రామిక రంగంలో, మరీ విశేషంగా నూతన తరంలో కనబడుతోంది. అయితే ప్రస్తుతం సాగుతున్న ఆర్థిక ప్రయోగాల ద్వారా ధనిక, పేద తేడా పెరగడం, ఆర్థిక సామర్థ్యమనేది ఒకేచోట కేంద్రీకృతం కావడం, శోషణ మార్గాలు పెరగడం, పర్యావరణానికి హాని కలగడం, మనుషుల మధ్య పరస్పర వ్యవహారంలో సంబంధాల స్థానంలో వ్యాపార దృష్టి, మానవత్వలేమి లాంటి దోషాలు కూడా ప్రపంచమంతటా కనిపిస్తున్నాయి. ఈ దోషాలవల్ల మనకు బాధ కలగకుండా చూసుకుంటూనే, ఈనాడు అమెరికా తన స్వీయ హితం కొరకు రూపొందించుకుంటున్న దిగుమతి సుంకాల విధానం గమనించి, మనం కూడా కొన్ని విషయాలను పునరాలోచించుకోవాల్సి ఉంది. ప్రపంచమనేది పరస్పర సమృద్ధి ద్వారా జీవిస్తుంది. అయితే స్వయంగా స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచ జీవనపు ఏకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ పరస్పర సమృద్ధిని ఒక తప్పనిసరి భావనగా మార్చకుండా, మనం స్వేచ్ఛగా జీవించగల స్థితికి చేరుకోవాలి. స్వదేశీ, స్వావలంబనకు పర్యాయమేదీ లేదు.

మొండి వేర్పాటువాద దృక్పథంపై ఆధారపడిన అభివృద్ధి కల్పనను ఆధారం చేసుకుని అభివృద్ధి అనే జడత్వంతో కూడిన, వినియోగవాదమనే విధానం ప్రపంచమంతటా అనుసరించబడుతోంది. దాని దుష్పరిణామం అన్ని వైపులా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. భారతదేశంలో కూడా అదే విధానంలో ఏళ్లతరబడి నడచిన కారణంగా క్రమరహిత, అనూహ్యమైన వర్షపాతమన, భూకంపాలు, హిమనదాలు కరగడం లాంటి పరిణామాలు గత మూడు నాలుగేళ్ళుగా మరింత అధికమవుతున్నాయి. వాయవ్య ఆసియాలోని నదులన్నీ హిమాలయాలనుండే పుడతాయి. ఆ హిమాలయాలలో ఇలాంటి దుర్ఘటనలు జరగడమన భారతదేశంతోబాటు దక్షిణ ఆసియాలోని ఇతర దేశాలకు ప్రమాదఘంటికలుగా భావించాల్సి ఉంది.

గత సంవత్సరాలలో మన పొరుగు దేశాలలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, ఈ మధ్య నేపాల్ లో జరిగిన ప్రజాందోళనలు హింసాత్మకంగా మారి, అధికార మార్పు జరగడం మనకు ఆందోళన కలిగించే విషయం, మనదేశంలోనూ, ప్రపంచంలో కూడా భారతదేశంలో ఈ రకమైన సమస్యలు, ఉపద్రవాలను కోరుకునే శక్తులు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగాలకు సమాజంతో తెగిపోయిన సంబంధాలు, చురుకుగా లేని ప్రజాభిముఖమైన అధికారిక కార్యకలాపాల లేమి ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారుతున్నాయి. అయితే హింసాత్మక ఉద్యమాలు కోరుకున్నంత మార్పు సాధించలేవు. ప్రజాస్వామ్య మార్గాలలోనే సమాజంలో ఆమూలాగ్ర మార్పును తీసుకొచ్చే వీలుంటుంది. లేకపోతే ఇలాంటి హింసాత్మక సందర్భాలలో, ప్రపంచశక్తులు తమ ఆటలు సాగించే అవకాశం ఏర్పడుతుంది. పొరుగుదేశాలు మనతో సాంస్కృతికంగా, ప్రజల మధ్య నిత్య సంబంధాల ద్వారా జోడించబడి ఉన్నాయి. ఒకరకంగా మనది ఒక కుటుంబం. అక్కడ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి.

సుఖసమృద్ధులతో కూడిన వ్యవస్థ ఉండటమనేది మన హితరక్షణకన్నా ఎక్కువగా స్వాభావిక ఆత్మీయతతో కూడిన అవసరం. ప్రపంచమంతటా జ్ఞాన విజ్ఞానాల అభివృద్ధి, సుఖసమృద్ధులతో కూడిన సాంకేతికత అనేక రకాల వ్యవస్థలను అందిస్తోంది. సంచార మాధ్యమాలు, అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ప్రపంచంలోని దేశాల మధ్య దగ్గరితనం పెరుగుతోంది. అయితే విజ్ఞానం, సాంకేతిక అభివృద్ధిలో వేగం, మనుషులు దానితో సమన్వయం చేసుకునే వేగం మధ్య చాలా తేడా ఉంది. కాబట్టి సాధారణ మనుష్యుల జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే అన్నిచోట్లా జరుగుతున్న యుద్దాలు, చిన్నాపెద్ద కలహాలు, పర్యావరణం దెబ్బతింటున్న కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, అన్ని సమాజాలలో, కుటుంబాలలో ఏర్పడిన విచ్ఛిత్తి, ప్రజా జీవితంలో పెరుగుతున్న అనాచారాలు, అత్యాచారాల లాంటి సమస్యలు కూడా మనకు కనబడుతున్నాయి. వీటన్నింటి పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఈ సమస్యలను ఆపడంలో లేదా వాటిని తగ్గించడంలో విజయం సాధించలేకపోతున్నాము. మనుషుల మధ్య పెరుగుతున్న కలహాలు, హింస, సంస్కృతి, పరంపర వినాశనంతోబాటు, ఇలాంటి వికృతాలు, ఆలోచనలతో సాగే శక్తుల సమస్య కూడా అన్ని దేశాలకు అనుభవంలోకి వస్తోంది. భారతదేశంలోనూ అటుయిటూగా ఇవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఈ సమస్యలన్నింటికీ భారతదేశం నుండి వెలువడిన ఆలోచన ద్వారా పరిష్కారం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

మనందరిలో ఆశ, విశ్వాసం రేకెత్తించే విషయమేమిటంటే, మనదేశంలో అన్నిచోట్లా, విశేషంగా కొత్త తరంలో దేశభక్తి భావన, తన సంస్కృతిపట్ల శ్రద్ధ, విశ్వాసం నిరంతరం పెరుగుతున్నాయి. సంఘ స్వయంసేవకులతో సహా సమాజంలో జరుగుతున్న వివిధ ధార్మిక, సామాజిక సంస్థలు, వ్యక్తులు, సమాజంలో సౌకర్యాల లేమి అనుభవిస్తున్న వర్గాలలో నిస్వార్ధంతో సేవచేయడం కోసం ముందుకు రావడం పెరుగుతోంది. ఈ అన్నింటి కారణంగా సమాజం స్వయంగా సామర్థ్యం పెంచుకోవడం, తన ఎదుట ఉన్న సమస్యలను పరిష్కరించడం, లోటుపాట్లను సవరించడము పెరుగుతోంది. సంఘం, సమాజ కార్యాలలో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక సమాజంలో పెరుగుతోందన్నది సంఘ స్వయంసేవకులకు అనుభవంలోకి వస్తోంది. సమాజంలోని మేధావులలో కూడా మనదేశపు జీవనదృష్టి, అలవాట్లు, అవసరాల ఆధారంగా మనదైన నమూనా ఎలా ఉండాలన్న ఆలోచన సాగుతోంది.

భారతీయ ఆలోచనా దృష్టి
భారతదేశంతో బాటు ప్రపంచం గురించి భారతీయ దృష్టితో ఆలోచించే మన ఆధునిక మహాపురుషులైన స్వామి వివేకానంద మొదలుకుని మహాత్మాగాంధీ, దీనదయాల్ ఉపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియా లాంటి సామాజిక నాయకత్వం పైన పేర్కొన్న అన్ని సమస్యల గురించి ఆలోచిస్తూ, ఒక దిశాదర్శనం చేశారు. ఆధునిక ప్రపంచం వద్దగల జీవనదృష్టి పూర్తిగా తప్పుకాదు, అసంపూర్ణమూ కాదు. కాబట్టి దాని ప్రకారం సాధించిన భౌతికాభివృద్ధి కొన్ని దేశాలు, సముదాయాలలో కనబడుతోంది. అది అందరిదీ మాత్రం కాదు. అందరినీ వదిలేయండి. భారతదేశంలో అమెరికాలాంటి సమృద్ధి, భౌతిక అభివృద్ధితో కూడిన జీవితం గడపాలంటే, మన భూమిలాంటివి మరో అయిదింటి అవసరం పడుతుందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. నేటి ఈ ప్రణాళికతో భౌతికాభివృద్ధితోబాటు మానవుడి మానసిక, నైతిక అభివృద్ధి జరగలేదు. కాబట్టి అభివృద్ధితోబాటు కొత్తకొత్త సమస్యలు ప్రాణసంకటంగా మారి నిలబడి ఉన్నాయి. దీనికి కారణం దృష్టిలోపమే!

మన సనాతన, ఆధ్యాత్మిక, సమగ్ర, ఏకాత్మ దృష్టివల్ల భౌతికాభివృద్ధితోబాటు మనసు, బుద్ధి, ఆధ్యాత్మికతల అభివృద్ధి, వ్యక్తితోబాటు మానవ జాతి, ప్రపంచ అభివృద్ధి, మనిషి అవసరాలు, కోరికలకు అనుగుణంగా ఆర్థిక స్థితితోబాటు అన్నింటిలో తననుతాను సాక్షాత్కరింపజేసుకునే అనుభవము పొందే స్వభావాన్ని సాధించుకునే శక్తి కలుగుతుంది. ఎందుకంటే మనవద్ద అందరినీ కలిపి ఉంచే తత్త్వముంది. దాని ఆధారంగా వేలాది సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలో మనం ఒక అందమైన, సమృద్ధమైన, శాంతిపూరితమైన, పరస్పర సంబంధాలను గుర్తించే మనిషి సృష్టి మధ్య సహకార జీవనాన్ని రూపొందించడం జరిగింది. మన ఈ సమగ్రమైన, ఏకాత్మ దృష్టి ఆధారంగా, నేటి ప్రపంచ అవసరాలను తీరుస్తూ, ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఒక కొత్త వ్యవస్థ ప్రపంచానికి అవసరముంది. మన ఉదాహరణ ద్వారా ఆ వ్యవస్థ స్వరూపాన్ని ప్రపంచానికి ఇచ్చే పని, మన భారతీయులనుండి విధి అపేక్షిస్తోంది.

సంఘ ఆలోచన
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తన శత జయంతిని పూర్తి చేసుకుంటోంది. సంఘంలో ఆలోచన, సంస్కారాలను పొంది సమాజజీవనంలోని వేర్వేరు విషయాలలో, వివిధ రంగాలలో, సంస్థలలో, స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు స్వయంసేవకులు క్రియాశీలంగా ఉన్నారు. సమాజ జీవనంలో ఉన్న అనేకమంది సజ్జన వ్యక్తులతో కూడా స్వయం సేవకులు చర్చించడమూ, సహకరించుకోవడమూ జరుగుతోంది. ఈ అనుభవాల ఆధారంగా సంఘం కొన్ని పరిశీలనలు, అవగాహనలను రూపొందించుకుంది.

1. భారతదేశం అభివృద్ధి ప్రక్రియ వేగాన్ని అందుకుంది. అయినా నేటికి కూడా మనం ఆ విధానం, వ్యవస్థ పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నాము. ఆ విధానపు ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ విధానాల మీద ప్రపంచంతోబాటు మనమూ ముందుకు సాగిపోయాము. వాటినుండి ఒక్కసారిగా మార్పు తేవడం సంభవమయ్యేది కాదు. ఒక సుదీర్ఘమైన వృత్తంలో నుండి మెల్లమెల్లగా పక్కకు వైదొలగడం అవసరమవుతుంది. అయితే మనతోబాటు ప్రపంచం ముందు నిలిచిన సమస్యలు, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలనుండి కాపాడుకోవడానికి మరో ఉపాయం లేదు. మనం సమగ్ర, ఏకాత్మ దృష్టి ఆధారంగా మనదైన అభివృద్ధి మార్గాన్ని రూపొందించుకొని, ప్రపంచం ముందు ఒక విజయవంతమైన ఉదాహరణను ఉంచాల్సి ఉంది. ధనం, కోరికల వెనుక గ్రుడ్డిగా పరుగులు తీస్తున్న ప్రపంచానికి మతాలకు అతీతంగా అందరినీ కలిపి ఉంచే, అందరినీ వెంటబెట్టుకెళ్ళే అందరినీ ఒక్కసారిగా అభివృద్ధి పరిచే ధర్మమార్గాన్ని చూపించాల్సి ఉంది.

2. దేశపు మొత్తం ఆదర్శచిత్రాన్ని ప్రపంచం ముందు నిలబెట్టే పని కేవలం దేశంలోని వ్యవస్థలది మాత్రమే కాదు. ఎందుకంటే వ్యవస్థలకు తమలో మార్పు చేసుకునే సామర్థ్యం, కోరిక రెండూ ఉంటాయి. వాటికి ప్రేరణ, వాటిపట్ల నియంత్రణ సమాజపు తీవ్రమైన ఇచ్ఛ ద్వారానే జరుగుతాయి. కాబట్టి వ్యవస్థ మార్పు కోసం సమాజానికి తెలియజెప్పడం, దాని ఆచరణలో మార్పు తేవడమన్నది ఈ వ్యవస్థ మార్పుకు అవసరం. సమాజ ఆచరణలో మార్పు ఉపన్యాసాల ద్వారా లేదా గ్రంథాల ద్వారా రాదు. సమాజానికి విస్తృతంగా బోధపరచాల్సి వస్తుంది. బోధపరిచేవాళ్ళు స్వయంగా మార్పుకు ఉదాహరణగా తయారవాల్సి ఉంటుంది. ప్రతిచోటా ఇలాంటి ఉ దాహరణరూపంలో వ్యక్తి, తనదైన సమాజం కోసం, తన జీవితంలో పారదర్శకత్వం, నిస్వార్థం కలిగి ఉండి, సంపూర్ణ సమాజాన్ని తనదిగా భావించి సమాజంతోబాటు తన నిత్య వ్యవహారం జరపాల్సి ఉంటుంది. సమాజంలో అందరితో బాటు కలసి ఉంటూ తనదైన ఉదాహరణతో సమాజానికి ప్రేరణ ఇచ్చేవాడు, స్థానికంగా సామాజిక నేతృత్వం వహించేవాడు కావాలి. కాబట్టి వ్యక్తి నిర్మాణంతో సమాజంలో మార్పు, సమాజంలో మార్పుతో వ్యవస్థలో మార్పు ఈ దేశంలో, ప్రపంచంలో తేవడానికి సరైన మార్గమవుతుందన్నది స్వయంసేవకుల అనుభవం.

3. అలాంటి వ్యక్తుల నిర్మాణ వ్యవస్థ వేర్వేరు సమాజాలలో ఉంటుంది. మన సమాజంలో సుదీర్ఘమైన దురాక్రమణ కాలంలో ఈ వ్యవస్థలు ధ్వంసమైపోయాయి. కాబట్టి యుగానుకూలమైన వ్యవస్థలను ఇంట్లో, విద్యావ్యవస్థలో సమాజ కార్యకలాపాలలో మళ్ళీ స్థాపితమయ్యేలా చూడాలి. ఈ పని చేసే వ్యక్తులను తయారుచేయాల్సి ఉంటుంది. ఈ ఆలోచనను అర్ధం చేసుకున్న తర్వాత కూడా. వాటిని ఆచరణలోకి తేవడానికి మనస్సు, వాక్కు క్రియల సామర్థ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక వ్యవస్థ అవసరం. సంఘశాఖ అలాంటి వ్యవస్థ. వంద సంవత్సరాలనుండి అన్నిరకాల పరిస్థితులలో పట్టుదలతో ఈ వ్యవస్థను సంఘ స్వయంసేవకులు నిరంతరంగా నడుపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే నడపాల్సి ఉంటుంది. కాబట్టి స్వయంసేవకులు నిత్యశాఖ కార్యక్రమాలలో మనసును నిమగ్నం చేసి మన సామర్ధ్యాలలో మార్పు తెచ్చుకునే సాధన చేస్తూ ఉండాలి. వ్యక్తిగత సద్గుణాలు, సామూహికతత్వపు సాధన చేయడం, సమాజపు కార్యకలాపాలలో భాగస్వామి కావడం, సహకారి కావడం ద్వారా సద్గుణాలను, ఐకమత్య వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసమే సంఘశాఖ ఉంది.

4. ఏ దేశమైనా అభివృద్ధిచెందాలంటే సమాజపు ఐక్యత ప్రధానం. మనది వైవిధ్యాలున్న దేశం. అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, భౌగోళిక వైవిధ్యం కారణంగా కలిసి ఉండటం, అనేక రకాల ఆహార పద్ధతులు, కులాలు, ఉపకులాలవంటి వైవిధ్యాలు మొదటినుండి ఉన్నాయి. వేయి సంవత్సరాలలో భారతదేశపు సరిహద్దులకు బయట ఉన్న దేశాలనుండి కూడా ఇక్కడికి కొన్ని విదేశీ సంప్రదాయాలు వచ్చాయి. ప్రస్తుతం విదేశీయులు వెళ్ళిపోయారు కానీ ఆ సంప్రదాయాలను స్వీకరించి నేటికి కూడా అనేక కారణాలవల్ల వాటిని పాటించే మన బంధువులే అయినవారు భారతదేశంలో ఉన్నారు. భారతదేశపు పరంపరలో వీళ్ళందరినీ స్వాగతించడంతోబాటు స్వీకరించడమూ జరిగింది. వాళ్ళు వేరు అనే దృష్టితో చూడము. ఈ వైవిధ్యాలను మనం మన విశిష్టతలుగా భావిస్తాము. విశిష్టతలను గౌరవించే స్వభావాన్ని అర్ధం చేసుకుందాం. అయితే ఈ వైవిధ్యం వేర్పాటుధోరణికి కారణం కాకూడదు. మనలో ఎంత వైవిధ్యం ఉన్నా మనమందరమూ ఒక పెద్ద సమాజంలో భాగం. సమాజం, దేశం, సంస్కృతి, రాష్ట్రం పరంగా మనమంతా ఒక్కటే. మన ఈ బృహత్ భావనే అన్నింటికన్నా ముఖ్యమైనదనే విషయం ఎల్లవేళలా దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మధ్యా సద్భావన, సహకారం ఉండాలి. ఎవరికి వారికి భక్తిశ్రద్ధలు, మహాపురుషులు, పూజాస్థలాలు ఉంటాయి. మనస్సు, వాక్కు, క్రియ ద్వారా వాటికి ఎలాంటి అవమానమూ. జరగరాదు. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. అందుకోసం జ్ఞానోదయం కల్గించాల్సిన అవసరముంది. నియమపాలన, వ్యవస్థాపాలన, సద్భావపూర్వకంగా వ్యవహరించడం మన స్వభావంగా మారాలి. చిన్నాపెద్ద విషయాల మీద, కేవలం మనసులో సందేహం ఉంది. కాబట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకుని రహదారులమీదికి రావడం, గుండాగిరి చేయడం, హింసకు పాల్పడే ప్రవృత్తి సరైనది కాదు. మనసులో పగను ఉంచుకుని లేదా ఏదైనా సముదాయాన్ని విశేషంగా రెచ్చగొట్టడం కోసం మన శక్తిని ప్రదర్శించడం వంటివి యోజనాబద్ధంగా చేయించడం జరుగుతోంది. అవి తాత్కాలికమైనా, దీర్ఘకాలికమైనా సరైంది కాదు. ఇలాంటి ప్రవృత్తి కలిగినవారిని అడ్డుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తమ పనిని ఎలాంటి పక్షపాతం లేకుండా లేదా ఎవరి ఒత్తిడికి లొంగకుండా, నియమానుసారంగా చేయాలి. అయితే సమాజంలోని సజ్జనశక్తి, యువతరం కూడా అప్రమత్తం కావాలి. సంఘటితమవాలి.

5. మన ఈ ఐక్యత ఆధారాన్ని డా. అంబేడ్కర్ అంతర్గత సాంస్కృతిక ఐక్యత (Inherent cultural unity) అని పిలిచాడు. భారతీయ సంస్కృతి ప్రాచీనకాలంనుండి కొనసాగుతూ రావడం భారతదేశపు విశేషత. అది అన్నింటినీ కలుపుకుపోయేది. అన్నిరకాల వైవిధ్యాలను గౌరవిస్తూ, స్వీకరించడమన్నది నేర్పిస్తుంది. ఎందుకంటే అవి భారతదేశపు ఆధ్యాత్మిక సత్యాలైన కరుణ, సుచిత్వం, తపం అనే సదాచారాలపైన అంటే ధర్మం మీద ఆధారపడినవి. ఈ దేశపు పుత్రరూప హిందూ సమాజం ఈ పరంపరను తన ఆచరణలో నిలుపుకుంది. అందుకేదాన్ని హిందూ సంస్కృతి అని పిలవడం జరిగింది. ప్రాచీన భారతదేశంలో ఋషులు తమ తపోబలంతో దీనిని వెలువరించారు. భారతదేశపు సమృద్ధమైన, సురక్షితమైన పరిస్థితి కారణంగా ఈ పని వారికి సాధ్యమైంది. మన పూర్వీకుల కష్టం, త్యాగం, బలిదానాల కారణంగా ఈ సంస్కృతి పుష్పించి ఫలించింది. మనదైన ఆ సంస్కృతి ఆచరణ, మాతృభూమిపట్ల భక్తి కలిసి మన జాతీయత అవుతుంది. వైవిధ్యాలను సంపూర్ణంగా స్వీకరించి, గౌరవపూర్వకంగా మన అందరినీ ఈ హిందూ జాతీయతే ఎల్లప్పుడూ ఒకటిగా ఉంచుతూ వచ్చింది. మన రాష్ట్రభావన కేవలం కల్పన కాదు. రాజ్యమనేది వస్తుంది, పోతుంది. కానీ రాష్ట్రమనేది నిరంతరంగా ఉండేది. మనందరి ఐక్యతకు కారణమైన దీన్ని ఎప్పటికీ మరువరాదు.

6. సంఘటిత హిందూ సమాజపు బలసంపన్నమైన, శీలసంపన్నమైన, సంఘటిత స్వరూపమే ఈ దేశపు ఐక్యత, సమగ్రత, అభివృద్ధి, రక్షణకు హామీ, హిందూ సమాజం ఈ దేశం పట్ల బాధ్యత కల్గిన సమాజం. అది అన్నింటినీ కలుపుకుపోయేది. పైకి అనేకరకాలైన పేర్లు, రూపాలను చూసి, మనలను వేర్వేరుగా భావించి, మనుషులుగా విభజించి, వేర్పాటుభావన కల్గించే’ మేము వాళ్ళు ‘ అనే మనస్తత్వం నుండి దూరమవ్వాలి.’ వసుధైక కుటుంబకమ్ ‘ అనే ఉదాత్తమైన ఆలోచనను కలిగించేది, సంరక్షించేది హిందూ సమాజమే. కాబట్టి భారతదేశం వైభవ సంపన్నమై, తననుండి కోరుకునే సహకారాన్ని ప్రపంచానికి అందివ్వగలిగినదిగా రూపొందడం హిందూ సమాజపు కర్తవ్యం అవుతుంది. ఆ సంఘటిత కార్యం శక్తిద్వారా ప్రపంచానికి కొత్తదారిని చూపగల ధర్మాన్ని సంరక్షిస్తూ భారతదేశాన్ని వైభవ సంపన్నంగా రూపొందించడమనే సంకల్పం తీసుకుని సంఘం సంపూర్ణ హిందూ సమాజ సంఘటనాకార్యాన్ని చేస్తోంది. సంఘటిత సమాజం తన అన్ని కర్తవ్యాలను సొంత బలంతో పూర్తిచేస్తుంది.

7. పైన పేర్కొన్న సమాజ చిత్రం సాకారమవ్వాలంటే వ్యక్తులలో, సమూహాలలో వ్యక్తిగత, జాతీయ శీలం- రెండూ బలోపేతమవ్వాలి. మన రాష్ట్ర స్వరూపపు స్పష్టమైన కల్పన, విధానాలు సంఘశాఖలో లభిస్తాయి. నిత్యశాఖలో జరిగే కార్యక్రమాల ద్వారా స్వయంసేవకులలో వ్యక్తిత్వం, కర్తృత్వం, నేతృత్వం, భక్తి, అవగాహన పెరుగుతాయి.
కాబట్టి శతజయంతి సంవత్సరంలో వ్యక్తినిర్మాణమనే కార్యం దేశమంతటా భౌగోళిక దృష్టితో సర్వవ్యాపి కావాలి. సహజమైన మార్పు తీసుకొచ్చే పంచపరివర్తన కార్యక్రమం స్వయంసేవకుల ఉదాహరణతో సమాజవ్యాపి కావాలన్నదే సంఘ ప్రయత్నం. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ సంరక్షణ, స్వదేశీ, పౌర విధులు అనే అయిదు విషయాలలో వ్యక్తి లేదా కుటుంబపు ఆదర్శం, ఆచరణలలో మార్పు తీసుకురావడంలో క్రియాశీలురం కావాలి. దీనిలో పనులు ఆచరించడానికి సరళమైనవి, సహజమైనవి, గత రెండు మూడేళ్ళుగా సమయానుకూలంగా సంఘ కార్యక్రమాలలో వీటి గురించి విస్తృతంగా ఆలోచించడం జరిగింది. సంఘ స్వయంసేవకులు కాకుండా, సమాజంలోని అనేక ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా ఇదే రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరితో సంఘ స్వయం సేవకుల భాగస్వామ్యం, సమన్వయం సాధారణంగా జరుగుతోంది.

మన ప్రాచీన పూర్వీకులు భారతభూమిలో నివసించే వైవిధ్యభరిత సమాజాన్ని సంఘటితం చేసి ఒక రాష్ట్రం రూపంలో ఈ కర్తవ్యాన్ని సంపూర్ణంగా పూర్తిచేసే సాధనంగా నిలిపారు. మన స్వాతంత్య్ర సంగ్రామంతో పునరుజ్జీవనపు మార్గదర్శకులు స్వతంత్రభారతదేశపు సమృద్ధి, సామర్థ్యాలను అభివృద్ధి చేసిన ఫలితమే ఈ చిత్రం. మన బెంగాల్ ప్రాంతపు పూర్వ సంఘచాలకులైన స్వర్గీయ కేశవచంద్ర చక్రవర్తి గారు చాలా అందమైన కవిత రూపంలో దీనిని వర్ణించారు.
బాలీ సింఘల్ జబ్ ద్వీపే
ప్రాంతర్ మాఝె ఉఠె ఎ
కోతో మఠ్ కోతో మందిర్
కోతో ప్రస్తరే ఫూల్ ఫోటోఎఎ
తాదేర్ ముఖేర్ మధుమయ్ బానీ
సునే థే మే జాయ్ సబ్ హెూ నా హానీ ఎ
అభ్యదయేర్ సభ్యతా జాగే
విశ్వేర్ ఘరే – ఘరే
(సింహళం, జావా ద్వీపం వరకు భారత సంస్కృతి ప్రభావం వ్యాపించి ఉంది. ప్రతిచోటా మఠమందిరాలున్నాయి. ఆయాచోట్ల జీవన సుగంధ పుష్పాలు పడిఉన్నాయి. భారతదేశపు మధురమైన, జ్ఞానవంతమైన మాటలను విని ఇతరదేశాలలోనూ శత్రుత్వభావన, అశాంతి సమాప్తమైపోతున్నాయి )
రండి, భారతదేశపు ఈ ఆత్మస్వరూపాన్ని ఈనాడు మళ్ళీ ప్రపంచంలో నిలబెట్టాల్సి ఉంది. పూర్వీకులనుండి లభించిన ఈ కర్తవ్యాన్ని ప్రపంచంలో నేటి అవసరాలనుబట్టి పూర్తిచేయడానికి మనమందరమూ కలిసి నడుస్తూ అగ్రేసరులుగా ఉండడానికి ఈనాటి విజయదశమి శుభ సందర్భంలో జరిపే సీమోల్లంఘనాన్ని విజయవంతం చేద్దాం.
భారత్ మాతాకీ జయ్