News

స్వదేశీ యాప్ అరట్టై దెబ్బకు వాట్సాప్ విలవిల…

220views

భారత మెసేజింగ్ యాప్ అరట్టై మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అరట్టై’ యాప్ వాట్సాప్ ను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్ యాప్ స్టోర్‌లోని సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో తాము అధికారికంగా నెంబర్ 1 స్థానానికి చేరుకున్నట్లు అరట్టై మాతృసంస్థ ‘జోహో’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది.

తమిళంలో ‘కబుర్లు’ అని అర్థం వచ్చే ‘అరట్టై’ పేరుతో 2021లో ఈ యాప్ ప్రారంభమైంది. అయితే ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు స్వదేశీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాలని పిలుపునివ్వడం ఈ యాప్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ‘స్పైవేర్ రహిత – మేడ్ ఇన్ ఇండియా’ అనే నినాదం కూడా వినియోగదారులను బాగా ఆకర్షించింది. దీంతో దేశభక్తితో పాటు, తమ డేటా భద్రతకు ప్రాధాన్యమిచ్చే యూజర్లు పెద్ద సంఖ్యలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రముఖ టెక్ వ్యాపారవేత్త వివేక్ వాధ్వా సైతం ఈ యాప్‌ను ‘ఇండియాస్ వాట్సాప్ కిల్లర్’ అని ప్రశంసించారు. కేవలం మూడు రోజుల్లోనే రోజూవారి సైన్ అప్స్ 3 వేల నుండి 3.5 లక్షల వరకు పెరిగాయి.

ప్రస్తుతం అరట్టై యాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఉంది. అయితే వాట్సాప్‌లో ఉన్నట్లుగా చాట్‌లకు ఈ భద్రతా ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ ఫీచర్‌ను తీసుకొస్తామని కంపెనీ చెబుతోంది. అలాగే వినియోగదారులు పెరుగుతుండడంతో యాప్ సర్వర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. దానివల్ల యాప్ ఫీచర్స్ సరిగ్గా పనిచేయడం లేదు. . ఈ సమస్యలను అంగీకరించిన జోహో, సర్వర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ సమస్యలను సరిదిద్దడానికి రెండు రోజులు పట్టవచ్చని తెలిపింది. ఇక వాట్సాప్ కు అరట్టై కు మధ్య తేడా ఏంటంటే…అరట్టై లో కాల్స్ ఎన్క్రిప్టెడ్ అయినా చాట్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావు. అంతేకాకుండా దీన్నిఫ్యామిలీ చాట్స్ క మాత్రమే కాకుండా ఆఫీస్ వర్క్, బిజినెస్ వర్క్ కూడా ఉపయోగించుకోవచ్చు. మరింతగా దీని లోపాలను సవరించుకుంటూ సర్వర్లపైన దఈష్టి సారిస్తే, రాను రాను ఈ స్వదేశీ యాప్ వాట్సాప్ కు గట్టి పోటీ ఇవ్వనుందని అంటున్నారు.