
హైదరాబాద్ విమోచన దినోత్సవం అంటే ఈ తరానికి ఒక సాధారణ సంఘటనలా అనిపించవచ్చు. కొందరు నాయకులకు రాజకీయ అవసరం కావచ్చు. కానీ సమాజం తమకు ఏమిచ్చిందని కాకుండా సమాజానికి తాము ఏమి ఇస్తున్నామన్న తలంపుతో ఉద్యమించిన ఎందరో త్యాగధనుల ఫలితం. ‘బ్రిటీష్ పాలకులు వెళ్లిన తరువాత తెలంగాణను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటా..’ అని బీరాలకు పోయిన నియంత మెడలు వంచిన అహింసావాదుల ప్రసాదం.‘ప్రజలంతా ఒక్కటైననాడు క్రూరాతిక్రూర నియంతలు సైతం వారి ముందు నిలబడలేరు. మోకరిల్లక తప్పదు’ అన్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మాటలకు వాస్తవ రూపం.
దేశ స్వరాజ్యం సంగ్రామంలో హైదరాబాద్ విమోచన ఉద్యమం మహోజ్జ్వల ఘట్టం. పత్రికలు, ఆర్యసమాజ్, హిందూ మహాసభ లాంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు ఉద్యమానికి ఊపిరులూదాయి. నిజాం, రజాకారులకు వ్యతిరేంగా హిందువులను జాగృతం చేశాయి. హైదరాబాద్ వివేక వర్ధని ప్రాంగణంలో సమావేశంలో (నవంబర్ 11,1921) తెలుగులో మాట్లాడిన అల్లంపెల్లి వెంకటరావుకు అవమానం ఎదురవడంతో మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు నేతృత్వంలో ‘ఆంధ్రజన సంఘం’ ఏర్పాటైంది. మాడపాటి, ఆదిరాజు, బూర్గుల రామకృష్ణారావు, ముఖ్దూం మొహియుద్దీన్, అరిగే రామస్వామి, రావి నారాయణరెడ్డి, మందుముల నరసింగరావు తదితరులు నిజాం నిరంకుశత్వంపై పోరాడుతూనే తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు పాటుపడ్డారు. సత్యాగ్రహ ఉద్యమాలకు సావర్కర్ మద్దతు( డిసెంబర్ 29, 1938) ప్రకటిస్తూ, జనవరి 14, 1939న హిందువుల డిమాండ్‌లను అంగీకరించకపోతే ఉద్యమం తప్పదని నిజాంను, ఆతని ప్రధానిని హెచ్చరించారు. ఎందరో నేతలు, నారీమణుల పోరాటం,అమరుల త్యాగలకు నిజాం ఏడవ నవాబ్ మీర్‌ఉస్మాన్ ఆలీఖాన్ దిగివచ్చి వల్లభభాయ్ పటేల్ సమక్షంలో సెప్టెంబర్ 17,1948న మోకరిల్లాడు.
ప్రజాహితమే నాటి పోరాటయోధులకు సమ్మతం. జనం కోసం జీవితాలను పణంగా పెట్టారు. ఆశయం కోసం అహరహం ఉద్యమించిన వారికి జైళ్లంటే వెరపు కానీ, ప్రాణం మీద తీపికాని లేవు.
గిరిజన పోరాట యోధుడు కొమరం భీం ‘జల్, జమీన్, జంగల్’ నినాదంతో ఉద్యమించారు. పశువుల కాపర్ల నుంచి నిజాం ప్రభుత్వం వసూలు చేస్తున్న అర్థం పర్థంలేని పన్నులకు నిరసనగా ఆసిఫాబాద్ జోడేఘాట్ గుట్టల పరసరాలు కేంద్రంగా గెరిల్లా దాడులకు దిగాడు. ఆయన పేరు వింటేనే నిజాంకు వణుకట. అయితే కుర్దుపటేల్ అనే వ్యక్తి ఇచ్చిన సమా చారంతో నిజాం సైన్యం భీంను, ఆయన అనుచరులను కాల్చి చంపింది.
నైజాం నవాబు హిందూ వ్యతిరేక మత దురంహంకార, అప్రజాస్వామిక పాలనపై పోరాడిన యోధుడు, నిష్కామ యోగి రామానంద తీర్థ (వేంకటేశ్ భావనరావు ఖడ్గిగర్). సామ్యవాదం, ప్రజాస్వామ్యం వంటి ప్రసంగాలతో ప్రజలను మేల్కొల్పిన మేటి దేశభక్తుడు. వందేమాతరం గీతాలాపన నిషేధం, హిందువులను మతం మార్చే ఇత్తేహాద్ చర్యలకు నిరసనగా ఆర్యసమాజ్ చేపట్టిన ఉద్యమ నిర్వహణంలో కీలకభూమిక పోషించారు. గాంధీ వారింపులను లక్ష్యపెట్టక నైజాం సరిహద్దులకు ఆవల సాయుధ స్థావరాలు ఏర్పాటు చేసి, నైజాం పోలీసులపైనా, రజాకార్లపైనా దాడులు చేయించారు.
నిజాం రాజ్యంలోని అన్యాయాలు, దౌర్జన్యాలను వెలికితీసేందుకు గోలకొండ పత్రికను స్థాపించి నిజాంకు వ్యతిరేక అనేక కథనాలు రాసిన ధీశాలి. సురవరం ప్రతాపరెడ్డి, ఆయన సంపాదకీయాలు నిజాం ప్రభుత్వం గుండెల్లో కుంపట్లు రాజేసేలా ఉండేవని ప్రసిద్ధి. ఆయన ‘గ్యారా కద్దూ బారా కోత్వాల్’ కథనం నిజాం పాలన అవినీతి గుట్టును రట్టు చేసింది.
ఉద్యమమే ఇంటి పేరు (వందేమాతరం)గా మారిన ఉద్యమశీలి వావిలాల రామచంద్రరావు. స్వరాజ్య సమరంలోనూ జైలులో తోటి ఖైదీలతో వందేమాతరం గీతం ఆలపిస్తుండంగా, ఆగ్రహించిన జైలు అధికారి ఆయన చెంపలపై కొట్టడంతో పాటు 24 కొరడా దెబ్బల శిక్ష వేశాడు. ప్రతి దెబ్బకు ‘వందేమాతరం’ అని నినదించారు రామచంద్రరావు. అదే ఇంటి పేరైంది. నైజం విమోచన ఉద్యమం కాలంలో అజ్ఞాతంగా పోరాటం సాగిస్తూ, సైనిక రహస్యాలను సేకరించి హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్ కెఎం మున్షీకి అందచేసే వారు. పండరీపురంలో జరిగిన బహిరంగసభలో వీరసావర్కర్ ఆయనకు (రామచంద్రరావు) ‘వందేమాతరం’ బిరుదు ప్రదానం చేశారు.
‘పుట్టుక నీది/చావు నీది/బతుకంతా దేశానిది’ అన్న ప్రజాకవి కాళోజీ దానిని అక్షరాల పాటించారు. 1946లో వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వారిలో ఆయన కీలకవ్యక్తి. హింసను ప్రతిఘటించేవారిని నరసింహులుగా అభి వర్ణించారు. ‘నవయుగంబున నాజీ వృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్లు?/ పోలీసు అండను దౌర్జన్యశక్తుల పోషణ పొందేదెన్నాళ్లు..’ అంటూ నిజాంకు వ్యతిరేకంగా కవితలల్లి కరపత్రాలు పంచుతూ జైలు పాలయ్యారు.
నిజాం పోలీసుల, రజాకారుల నికృష్ట చేష్టలపై…
‘మన కొంపలార్చి మన స్త్రీలను చెరిచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
కిరాతకులను కసి ఆరిపోకుండ బుస కొట్టు చుండాలె
కాలంబురాగానే కాటేసి తీరాలె’
అని జనాన్ని మేల్కొల్పారు.
తెలంగాణ ప్రాంత తొలి నవలా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణ విమోచన ఉద్యమాలలో నిజాంకు వ్యతిరేక రచనలతో ప్రజలను చైతన్యపరిచారు. నిజాంప్రభుత్వం ఆయనను నాలుగు జైళ్లకు తిప్పింది. జైళ్లలోని ఖైదీల మనోభావాలను విశ్లేషిస్తూ, ‘జైలు లోపల’ గ్రంథాన్ని వెలువరించారు. తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాటంగా మారడానికి ఆళ్వార్‌స్వామి రచనలే కారణంగా విశ్లేషకులు చెబుతారు.
దాశరథి ప్రజాకవి, విప్లవ కవి. విద్యావేత్త, నిరంకుశ ఏలికకు ‘అగ్నిధార’.
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి ,అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’… పద్యం ఆయన రచనల్లో తలమానికంగా పేర్కొంటారు. అడ్డూఅదుపు లేని చిత్రహింసలకు మనసు రగిలి, కట్టలు తెంచుకున్న ఆవేశంతో..
‘దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు/ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కాలబెట్టి /పెద్దరికం చేస్తావా?’ అని నిజాంను నిలదీసిన ధీశాలి.‘ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించి కారాగార శిక్ష అనుభవించారు.
తెలంగాణ భగత్ సింగ్‌గా పేరొందిన నారాయణ రావు పవార్ , తన అనుచరులు మేరా గుండయ్య, జగదీశ్‌లతో కలసి నిజాంపై బాంబులు వేసి ప్రాణభయం రుచి చూపారు. త్రుటిలో తప్పించుకున్న నిజాం, నారాయణరావు పవార్‌కు ఉరిశిక్ష, గండయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. పోలీస్ చర్య అనంతరం జైలు నుంచి విడుద లయ్యారు.
హైదరాబాద్ ఉక్కు మనిషి ఆర్యసమాజ్ పండిత్ నరేంద్ర జీ పేరు వింటేనే నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవట. ఆయనపై అనేకసార్లు హత్యాయత్నం జరిగింది. జైళ్లలో చిత్రవధలు పెట్టారు. ఆయన ధాటికి తట్టుకోలేక నిజాం నగర బహిష్కరణ చేశాడు. పండిత్ జీ మత మార్పిడులను వ్యతిరేకించి శుద్ధి కార్య క్రమంతో తిరిగి హిందూమతంలోకి రప్పించడంలో కీలక పాత్ర వహించారు.
నిజాం, ఆయన అనుచరుల అరాచకాలను వెలువరిస్తూ, ఏలికకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్. నిజాం రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలంటూ ఏడుగురు ముస్లిం పెద్దలు తయారు చేసిన వినతిని షోయబుల్లా తన పత్రిక ‘ఇమ్రోజ్’ (ఈరోజు)లో ప్రచురించినందుకు రజాకారులు హైదరాబాద్ కాచిగూడ కూడలిలో ఆగస్టు 9,1948న కుడిచేతిని నరికేయగా, ఆ మరునాడు ఆయన కన్నుమూశారు.
మరో ఉద్యమకారుడు, ఖమ్మంవాసి హీరాలాల్ మోర్వా….
‘మాకు వద్దీ నిజాంరాజు
ఈ కఠిన పాషాణ సదృశ
డీ నిరంకుశ లోహమూర్తి
మాకు వద్దు మాకు వద్దు’ అని గర్జించారు.
‘బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టీ
ఏ బండ్లే పోతావు కొడుకో
నైజం సర్కరోడా’ అంటూ బండి యాదగిరి నిగ్గదీత గీతం నాడు తిరగబడిన తెలంగాణ నోట నానింది. సామాన్యుడి నోట తూటాల పేలింది.
వరంగల్ నివాసి బత్తిని మొగిలయ్య ఓరుగల్లు గడ్డపై గస్తీ పోలీసులను ఎదురించి వరంగల్ తూర్పు కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అడ్డువచ్చిన రజాకార్లలో ముగ్గురిని మట్టుపెట్టారు. ఇంటికి చేరుతుండగా, రజాకారులు దారిలో అడ్డగించి బల్లేలతో దాడి చేశారు. ‘వందేమాతరం, భారత్ మాతాకీ జై ’అంటూ మొగిలయ్య నేల రాలాడు.
నిజాం తాబేదారు దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దురాగతాలను ప్రతిఘటించిన వీరవనిత చాకలి ఐలమ్మ. పొలంలోని పంటను స్వాధీనం చేసుకోవాలనే ఆయన ప్రయత్నాలను ధైర్యంగా ప్రతిఘటించారామె. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోప•ణపై భర్తను, కుమారుడిని అరెస్టు చేసినా, వ్యవసాయం కూలీలను కూడగట్టి దొరల దౌర్జన్యాలను ప్రతిఘటించారు.
నిజాం అనుయాయుల బాధలు భరించలేక భాయి శ్యాంలాల్ జీ బీదర్ జైలులో వారు ఇచ్చిన విషం తాగి ప్రాణత్యాగం చేశారు. సరిహద్దు అపర గాంధీగా పేరొందిన జమలాపురం కేశవరావు, ‘నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి బాధ్యతాయుత ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించగలమని బహిరంగంగానే గర్జించారు. జాగీర్దార్లు, దేశ్‌ముఖులు, భూస్వాములు, నిరంకుశ ఉద్యోగులకు వ్యతిరేకంగా పోరాడడంతో తెలంగాణ ప్రజలు కోటి గొంతుకలతో ఆయనను ‘సర్దార్’ అని సంబోధించారు.
సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ పోలో’ (సెప్టెంబర్ 13,1948) చేపట్టిన దరిమిలా హైదరాబాద్ రాష్ట్రం అదే మరో నాలుగు రోజులకు భారతదేశంలో విలీనమైంది. ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర విమోచనంతో పాటు అప్పటికి పదమూడు నెలల క్రితం వచ్చిన స్వరాజ్య సంబరాలను జరుపుకున్నారు.





