ArticlesNews

తెలుగు సాహిత్యానికి నాదం విశ్వనాథ సత్యనారాయణ

164views

( సెప్టెంబర్ 10 – విశ్వనాథ సత్యనారాయణ జయంతి )

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు, విలువలకు పట్టం కట్టిన నిజమైన సాహితీ చక్రవర్తి. జ్ఞానపీఠ్ అవార్డును స్వంతం చేసుకున్న తొట్టతొలి తెలుగు కవి. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు…. ఒక్క వచన కవిత్వం మినహా తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఆయన కలం నుంచి జాలువారిన రచనలు సుమారు లక్ష పేజీలు…. అవును అక్షరాలా లక్ష పేజీలు ఉంటుందంటే…. ఆయన ప్రతిభా పాటవాలను మనం అంచనా వేయవచ్చు.

విశ్వనాథసత్యనారాయణగారి ప్రతి రచనా పాఠకుల హృదయాలను దోచేస్తుంది. మదిలో మధురభావనలను మొలకెత్తిస్తుంది. పాఠకుల హృదయోద్యానవనాలలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని వికసింపజేస్తుంది. జీవన విలువలను ప్రబోధిస్తుంది. జీవన సంఘర్షణలను, వాటి పరిష్కారాలను వివరిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. యువ హృదయాలకు ప్రేమ మాధుర్యాన్ని పరిచయం చేస్తుంది. రస రమ్య గీతాలతో పరవశింపజేస్తుంది. ఉత్కంఠ రేపి ఉర్రూతలూపుతుంది. మధ్య తరగతి జీవన గమనాన్ని కళ్ళకు కడుతుంది. కన్నీరొలికిస్తుంది. కరుణామృత ధారల్ని కురిపిస్తుంది. ఇంటి పెద్దై మందలిస్తుంది. మార్గదర్శై అదిలిస్తుంది. సోదరుడై సంరక్షిస్తుంది. సహచరుడై సహగమిస్తుంది. అమ్మలా లాలిస్తుంది. అమ్మణ్ణిలా పాలిస్తుంది. అమ్మాయిలా మురిపిస్తుంది. పాపాయిలా ఆడిస్తుంది. ఆయన వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శలో, భాషణంలో, భూషణంలో ఒక విలక్షణత వెల్లివిరుస్తుంది. ఆయన ఒక కవి దిగ్గజం. తెలుగుతల్లి శిరస్సుపై నిలచిన కనక కిరీటం.

విశ్వనాథ సత్యనారాయణగారు 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 10 వ తేదీన, నేటి కృష్ణా జిల్లాలోని గుడివాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందమూరు గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విశ్వనాథగారికి వారి తండ్రిగారైన శోభనాద్రి గారే ఆదర్శం. ఆయనలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు బాల్యం నుండే మన సత్యనారాయణ గారికి కూడా వచ్చాయి. ఆ విషయాన్ని విశ్వనాథ గారు తన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ లో స్వయంగా తన తండ్రిగారి గురించి ప్రస్తావిస్తూ సెలవిచ్చారు. పుట్టుకైతే శ్రీమంతుల వంశం కానీ కాలక్రమేణ ఆస్తులన్నీ దాన ధర్మాలకు వెచ్చించి విశ్వనాథుల వారికి యుక్తవయస్సు వచ్చేసరికి తన కష్టార్జితంతోనే భుక్తి గడుపుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయనకు బాల్యంలోనే అబ్బిన కవితా జ్ఞానం ఆయనను కవి సామ్రాట్ ను చేసింది. ఆయన మొట్టమొదటి రచనా ప్రక్రియ 1916 లో ‘విశ్వేశ్వర శతకము’ తో మొదలై నాలుగేళ్ళలో తెలుగు భాషావేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడూ పాఠకుల స్థాయికి అనుగుణంగా రచనలు చేసి వారి మెప్పు పొందాలని తపన పడలేదు. పైపెచ్చు అసలైన సాహితీ విలువలను జొప్పించి, ప్రజలకు నిజమైన సాహితీ చైతన్యాన్ని రుచిచూపించాలని, కొంత వరకైనా భాషాసాహిత్యాన్ని ఉన్నత స్థితికి లాగాలని తపన పడ్డారు. కనుకనే ఆయన రచనలలో ఒక విశిష్టమైన శైలి కనిపిస్తుంది.

విశ్వనాథవారు ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడిన వారు. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగినవారు. శ్రీశ్రీ వంటివారు ఛాందసవాదిగా తనను అభివర్ణించినా సాహిత్యంలో జాతీయభావము, ఆరోగ్యవంతమైన ప్రాంతీయ భావము ప్రస్ఫుటించాలని విశ్వనాథవారు గాఢంగా విశ్వసించారు. దానినే ఆయన తన రచనలలోనూ, మాటలలోనూ ప్రకటించారు. శిల్పం కానీ, సాహిత్యం విజాతీయమై ఉండరాదని, ఖచ్చితంగా జాతీయమే అయివుండాలని నొక్కి వక్కాణించారు. “పక్షి సముద్రంపై ఎంత ఎగిరినా రాత్రికి ఏవిధంగా అయితే గూటికి చేరుతుందో…. అలాగే మనం మన జాతీయత, సాంప్రదాయాలను కాపాడుకోవాలి” అనేవారు.

విశ్వనాథవారు 1976 అక్టోబరు 18 న పరమపదించారు. ఆయన జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడిచింది. మాతృభాష, భారతీయ సంస్కృతి, విలువలు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఇవే మన తెలుగు సాహిత్య దిగ్గజం విశ్వనాథ సత్యనారాయణకు అర్పించే నిజమైన నివాళి.