ArticlesNews

జాతీయోద్యమ గణేశుడు

190views

హిందూ సమాజ పునరుజ్జీవనోద్యమానికి గణేశుడి ఆశీస్సులు ఉన్నాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌నిర్మించిన ఈ పునరుజ్జీవ నోద్యమం వెనుక వినాయకుడు ఉన్నాడు. కొంత రూపురేఖలు మారినా ఇవాళ దేశమంతా కనిపిస్తున్న సామూహిక వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు తిలక్‌ ‌మహరాజ్‌ ‌ప్రారంభించినవే.

భారతీయ సమాజం తనదైన ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోయి సాంస్కృతికంగా నిస్తేజంగా మిగిలి ఉన్న సమయంలో తిలక్‌ ‌గణేశుడి ఉత్సవాలను ప్రారంభించారు. 1893లో ఆయన మహారాష్ట్రలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మనదైన జీవనం కోసం, మనదైన తాత్త్వికతను పునరుద్ధరించడం కోసం ఆయనకు ఆ సమయంలో అలాంటి ప్రయత్నం అవసరమైంది. అనేక విధాలుగా చీలిపోయి ఉన్న హిందువులను ఆయన సామూహిక వినాయక పూజలతో ఐక్యం చేయాలని సంకల్పించారు. అంతకు ముందు పీష్వాలు కూడా ఇలాంటి ప్రయత్నం చేశారు. కానీ తిలక్‌ ‌కాలానికి ఇలాంటి సామూహిక భక్తి కార్యక్రమం అవసరం మరింత పెరిగింది. అందరూ ఎవరి ఇళ్లలో కూర్చుని వారు వినాయకుడిని పూజించే కంటే, సామూహిక ఉత్సవాలలో అందరినీ ఏకం చేస్తే కాగల కార్యాన్ని గణేశుడే పూర్తి చేస్తాడని తిలక్‌ ‌నమ్మారు. ఆయన ఆలోచన 1893లో కార్యరూపం దాల్చింది. తొమ్మిదిరోజుల పాటు కులాల సంగతి మరచి, ఆ తారతమ్యాలు పక్కన పెట్టి అంతా కలసి ఒకే పందిరి కింద విఘ్న నాయకుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అంతా కలసి నిమజ్జనోత్సవంలో పాల్గొనడం మరొకటి. కలసి పూజలు చేయడం, అడుగులో అడుగు కలిపి నడవడం. మళ్లీ చాలా కాలానికి హిందూ సమాజం నేర్చుకున్నది.

ఎన్నో ఫలితాలను ఇచ్చి, ఒక ఐక్యతకు బీజాలు వేసిన గణేశ ఉత్సవాల నిర్వహణ అంత సులభంగా ఏమీ సాధ్యం కాలేదు. ఇటు సమాజంలోని కొందరు ఛాందసవర్గాల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఆయన అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన వలె ఆలోచించే స్వాతంత్య్ర సమరయోధులు ఆనాడు ఎందరో ఉన్నారు. వారే లాలా లాజ్‌పతిరాయ్‌, ‌బిపిన్‌చంద్ర పాల్‌, అరవింద ఘోష్‌, ‌రాజ్‌నారాయణ్‌ ‌బోస్‌, అశ్వినీకుమార్‌ ‌దత్త మొదలైనవారు. వీరంతా తిలక్‌ ఆలోచనను సమర్ధించారు. సంస్కృతి ఆధారంగా రాజకీయోద్యమం నిర్మాణం కావాలన్న దృక్పథం కలవారే వారంతా. స్వతంత్ర దేశానికి భారతీయత పునాదిగా ఉండాలని కోరుకున్నవారు కూడా. మిగిలిన ప్రాంతాలలో కొంత తక్కువే అయినా సామూహిక గణేశ ఉత్సవాలు మహారాష్ట్రలో ఎంతో విజయం సాధించాయి. దాని ఫలితమే కావచ్చు. అక్కడ జాతీయోద్యమ ప్రభావం కూడా చాలా ఎక్కువ. ఆ రాష్ట్రంలోని వార్ధా, నాగ్‌పూర్‌, అమరావతి పట్టణాలు దీనికి చిరునామాగా కూడా మారాయి.

వినాయక చవితి ఉత్సవాలు బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని కూడా భయపెట్టాయి. రౌలట్‌ ‌కమిటీ ఈ ఉత్సవాల గురించి ప్రభుత్వాన్ని హెచ్చరించవలసి వచ్చింది. పేరుకు వినాయక చవితి ఉత్సవాలే అయినా ఈ నేపథ్యంతో యువతరంలో బ్రిటిష్‌ ‌వ్యతిరేకత పెరుగుతున్నదని ఆ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిం చింది. ఇవాళ్టికి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలో వీటి ప్రభావం గణనీయంగానే ఉంది. కొంత స్వరూపం మారి ఉండవచ్చు. అయినా వీటి అవసరం నేడూ కనిపిస్తున్నది. హిందువుల ఐక్యతకు ఇప్పటికీ బెడద ఉన్నది. దాని నుంచి భారతీయ సమాజాన్ని రక్షించు కోవడానికి ఈ ఉత్సవాల ద్వారా వచ్చే ఐక్యత ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉత్సవాల పవిత్ర తను కాపాడుకోవడం కూడా అవసరం. వీటి స్ఫూర్తిని విస్మరించకుండా, తిలక్‌ ఆశించిన జాతీయ స్ఫూర్తి అడుగంటకుండా కొనసాగించాలి.