News

పర్యావరణ అనుకూలంగా సాగిన అమర్‌నాథ్ యాత్ర..

174views

ఈ సారి అమర్‌నాథ్ యాత్ర పూర్తి పర్యావరణ అనుకూల (ఎకో ఫ్రెండ్లీ) గా సాగింది. అక్కడి వచ్చిన ప్రతి భక్తుడూ దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో స్వచ్ఛంగా, ప్లాస్టిక్ రహితంగా వుంచేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వ రూపొందించిన ‘స్వచ్ఛ భారత్ మిషన్ 2.0’ లక్ష్యాలకు అనుగుణంగా హిందువుల పవిత్ర అమర్‌నాథ్ యాత్రను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేశారు.

అత్యంత క్లిష్టతరమైన హిందూ యాత్రలలో అమర్‌నాథ్ యాత్ర ఒకటి.లక్షలాది మంది యాత్ర చేసే సమయంలో ఏర్పడే చెత్త, ఇతర వ్యర్థాలతో అత్యంత సున్నతమైన పర్యావరణ వ్యవస్థ కల్గిన హిమాలయాలకు ముప్పు లేకుండా చూడడం మరింత క్లిష్టతరమైన సవాలు.దీనిని జమ్మూ కశ్మీర్ సర్కార్ సమర్థవంతంగా నిర్వహించింది.

యాత్రలో ప్రతిరోజూ దాదాపు 11.67 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో 100% కంపోస్టింగ్ మరియు రీసైక్లింగ్ ద్వారా ప్రాసెస్ చేశామని అధికారులు ప్రకటించారు. ట్విన్-బిన్ స్టేషన్లు, 65 చెత్త సేకరణ వాహనాలు మరియు దాదాపు 1,300 సఫాయిమిత్రాల నెట్‌వర్క్ లాడ్జిమెంట్ కేంద్రాలు, లంగర్ సైట్‌లు మరియు యాత్రా శిబిరాలలో పరిశుభ్రతను కాపాడారు. మరోవైపు “గ్రీన్ ప్లెడ్జ్” ప్రచారంలో 70,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. యాత్రలో దీనికే కట్టుబడి వున్నారు భక్తులు.

సింగిల్ యూజ్ (single use) ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా పెద్ద ప్రచారమే జరిగింది. వీటి స్థానంలో జనపనార, వస్త్రాలతో తయారైన బట్ట సంచీలను అధికారులు పంపిణీ చేశారు.ప్లాస్టిక్ లావో, థెలా లెజావో మరియు బిన్ ఇట్, విన్ ఇట్ వంటి ఇంటరాక్టివ్ డ్రైవ్‌లు నిర్వహించారు. దీంతో పర్యావరణ అనుకూల యాత్రగా మారింది.

జమ్మూ కాశ్మీర్ గృహ, పట్టణాభివృద్ధి విభాగం ప్రకారం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టింది. స్వచ్ఛత ఎగ్జిక్యూటివ్‌లు, టూలిప్ ఇంటర్న్‌లు, స్వచ్ఛంద సేవకులు, NGOలతో సమన్వయం చేసుకుంటూ టెంట్లు, తాత్కాలిక హోటళ్లు, లంగర్ స్థలాలు సహా యాత్ర క్యాంపులలో ఉత్పన్నమయ్యే వ్యర్థాల విభజనను ప్రోత్సహించారు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ (Single use plastic)ను వినియోగించకుండా చూశారు. తద్వారా రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్‌ మాత్రమే అందుబాటులో ఉండేలా చూశారు. అక్కడున్నవారికి పరిశుభ్రత, శానిటేషన్ గురించి అవగాహన కల్పించారు. QR కోడ్ టాయిలెట్‌ల ద్వారా సానిటేషన్ సౌకర్యాలపై తక్షణ సమాచారం సేకరించేవారు.

రోజుకు సుమారు 11.67 మెట్రిక్ టన్నుల చెత్త (వ్యర్థాలు) ఉత్పత్తి అవుతుండగా, అందులో 3.67 MT డ్రై వ్యర్థాలు (పొడి చెత్త), 7.83 MT తడి వ్యర్థాలు (తడి చెత్త) ఉందని గుర్తించారు. ఈ రెండు రకాల వ్యర్థాలను పూర్తిగా 100% ప్రాసెస్ చేస్తూ వచ్చారు. లంగర్‌లు, లాడ్జ్‌మెంట్ సెంటర్‌ల నుండి వచ్చే తడి వ్యర్థాలను 3 ఆర్గానిక్ వేస్ట్ కంపోస్టర్‌లలో ప్రాసెస్ చేస్తున్నారు. ఒక్కో కంపోస్టర్ సామర్థ్యం 1 టన్ను. డ్రై వ్యర్థాలను సమీపంలోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలకు (MRF) పంపించారు. ఇలా మొత్తంగా అక్కడ ఉత్పన్నమైన చెత్తను చెత్తకుప్పలపైకి చేరకుండా పూర్తిగా ప్రాసెస్ చేస్తూ వచ్చారు.

యాత్ర మార్గంలో 1,016 ట్విన్-బిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలో పొడి చెత్త కోసం నీలం రంగు చెత్త డబ్బా (బిన్), తడి చెత్త కోసం ఆకుపచ్చ బిన్ ఏర్పాటు చేశారు. మహిళల టాయిలెట్‌ల సమీపంలో శానిటరీ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక బిన్‌లు ఏర్పాటు చేశారు. చెత్త సేకరించేందుకు 65 గార్బేజ్ కలెక్షన్ వెహికిల్స్, ట్విన్-కంపార్ట్‌మెంట్ ట్రక్‌ల ద్వారా విభజించిన వ్యర్థాలను MRFలకు, కంపోస్ట్ పిట్‌లకు సుగమంగా రవాణా చేశారు. 24×7 స్వచ్ఛతను నిర్ధారించడానికి, దాదాపు 1,300 సఫాయి మిత్ర వర్కర్లు నిర్విరామంగా పనిచేశారు.