
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాశాఖ అధికారి మాధవరావు పేర్కొన్నారు. అనపర్తి మహాలక్ష్మిపేటకు చెందిన రైతు రాజగిరి శ్రీనివాసరావు ఇంట్లో రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహించారు. ఒక రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రైతుతోనే ఆయన ఉంటారు. ఈ సమమయంలో రైతుతో కలిసి పొలానికి వెళ్లారు. సాగు, పశుపోషణ పరిశీలించారు. వారు 4.2 ఎకరాలు కౌలుకు తీసుకుని, 1.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం, 2.7 ఎకరాల్లో తక్కువ రసాయనాలతో డ్రమ్ సీడింగ్ విధానంలో వరి సాగు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. రాత్రి వారి ఇంటి వద్దే ఆ కుటుంబంతోనే బస చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారి మాట్లాడుతూ.. రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ సంచాలకుడు ఢిల్లీరావు ఉత్తర్వుల మేరకు చేపట్టినట్లు తెలిపారు. వారి జీవన విధానాలు, సాగు పద్ధతులు పరిశీలించి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు.





