News

మణిపూర్‌లో శాంతి, మెయిటీ-కుకిల మధ్య స్వయం సేవకుల మధ్యవర్తిత్వం ద్వారా : సునీల్ అంబేకర్

419views

మణిపూర్ లోని మెయిటీ, కుకి వర్గాల మధ్య సఖ్యతను పెంపొందించడానికి తమ స్వయం సేవకులు ముందుకు వస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. ఉద్రిక్తతలు తగ్గుతున్న కొద్దీ, సానుకూల మార్పులు వస్తునాయని పేర్కొంది, ఈ మార్పు మే 2023 నుండి సంఘర్షణతో బాధపడుతున్న మణిపూర్ రాష్ట్రంలో క్రమంగా సాధారణ స్థితికి తిరిగి రావడాన్ని సూచిస్తుందని పేర్కొంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క అఖిల భారత ప్రాంత ప్రచార సమావేశాలు ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రచారప్రముఖ్ సునీల్ అంబేకర్ ఢిల్లీలోని కేశవ కుంజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రచార సమావేశాలలో సంఘ కార్యకలాపాలు మాత్రమే కాకుండా ఇతర జాతీయ సమస్యలు కూడా చర్చించబడ్డాయి అని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అంబేకర్ సమాధానమిస్తూ, “ఎక్కడైనా పరిస్థితులు దిగజారితే, అది ఒక్క రోజులో మెరుగుపడదు. కానీ ఖచ్చితంగా, గత సంవత్సరాలతో పోల్చి చూస్తే, కొంతవరకు శాంతి తిరిగి రావడం ప్రారంభమైంది అని వారన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని చర్చిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలతో సంభాషణను ముందుకు తీసుకెళ్తోందని, అనేక సానుకూల సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు.