ArticlesNews

ముక్తిదాయకం.. రథయాత్ర దర్శనం

208views

జగన్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యాత్మికతలోని సమైక్యతా సూత్రాన్ని ఆవిష్కరిస్తుంది. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాత విగ్రహాలను తొలగించి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. పాత వాటిని ఆగమ, జ్యోతిష, గ్రహగతుల ప్రకారం ఖననం చేస్తారు. ఈ సందర్భంలో పాత విగ్రహాల్లోని జగన్నాథుని నాభి భాగాన్ని తొలగించి కొత్త విగ్రహానికి అమర్చుతారు. పురాణ కథనం ప్రకారం- కురుక్షేత్ర యుద్ధం ముగిశాక.. శ్రీకృష్ణుడు ద్వారకలో ఓ చెట్టు కొమ్మపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పాదాన్ని పక్షిగా భావించిన బోయవాడైన శబరరాజు బాణం సంధించాడు. దాంతో శ్రీకృష్ణపరమాత్ముడు ప్రాణం త్యజించాడు. ఈ విషాదవార్త తెలుసుకున్న అర్జునుడు ద్వారక చేరి.. అంతిమ సంస్కారాలు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి శరీరమంతా దగ్ధమైనా నాభి మాత్రం అలాగే ఉండటంతో అర్జునుడు ఆ భాగాన్ని సముద్రంలో నిక్షిప్తం చేశాడు. శ్రీకృష్ణుని దేహత్యాగానికి కారకుడైన శబరరాజు సముద్రతీరంలో తేలుతున్న నాభి భాగాన్ని గమనించి.. దాన్ని అనుసరించాడు. అలా ద్వారక నుంచి పూరీ క్షేత్రం వరకూ సాగాడు. అతని భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్ముడు ‘ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్లు’ అని ఆదేశించాడు. శబరరాజు దైవాజ్ఞను ఆచరించాడు. విష్ణుభక్తుడైన ఇంద్రద్యుమ్నుడు పూరీ క్షేత్రంలో ఆలయం నిర్మించాడన్నది స్థలపురాణం. రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే- అన్నది ఆర్యోక్తి. అంటే పూరీ జగన్నాథుడు వామన రూపంలో రథంలో ఆసీనుడై విహరిస్తున్న దృశ్యాన్ని చూసినవారికి పునర్జన్మ ఉండదని అర్థం. ఈ విశ్వాసంతోనే రథయాత్ర సందర్భంగా వేలాది భక్తులు జగన్నాథస్వామిని దర్శించుకుంటారు. పూరీ జగన్నాథ ఆలయానికి సమీపంలో ఇంద్రద్యుమ్న కోనేరు, మార్కండేయ సరస్సు, శ్వేతగంగ కోనేరు, మహాదధి (సముద్రం), రోహిణీ జలాశయం- అనే పంచ తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానమాచరించటం పుణ్యప్రదం.