
పరమశివుని సన్నిధిగా భక్తకోటి భావించే కైలాస పర్వతం, మానసరోవరాల దర్శనం కోసం బయలుదేరిన 36 మంది భారతీయ యాత్రికుల బృందం గురువారం ఆ పవిత్ర స్థానానికి చేరుకుందని చైనా అధికారులు వెల్లడించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఈ యాత్రలో పాల్గొంటున్న తొలి బృందం ఇదే. షిజాంగ్ (టిబెట్) స్వయంపాలిత ప్రాంతంలోని మాపం యున్‌త్సో (మానసరోవరం)ను దర్శించేందుకు వచ్చిన భారత యాత్రికుల బృందం గమ్యస్థానానికి చేరుకుందని చైనా రాయబారి షు ఫెయిన్‌హాంగ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం భారత-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు స్తంభించాయి.
కైలాస పర్వతం పరమశివుడి నివాస స్థలమని భక్తుల ప్రగాఢ నమ్మకం. హిందువులు, బుద్ధులు, జైనులు కైలాస పర్వతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. కొవిడ్ నేపథ్యంలో 2020లో ఈ యాత్రను నిలిచిపోయింది. అనంతరం గల్వాన్ ఘర్షణతో దిల్లీ, బీజింగ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. గతేడాది భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో భేటీ అయ్యారు. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమమైంది.





