ArticlesNews

దేశాన్ని సమైక్యపరచిన భారతమాతపై ఎందుకింత కోపం?

249views

వందల ఏళ్ళ పాటు పరాయిపాలనలో మగ్గిపోయిన భారతజాతిని బానిసత్వం నుంచి విడిపించేందుకు తల్లి భారతి పేరిటే ఉద్యమాలు చేశాం. మన మాతృభూమి అయిన భారతదేశాన్ని అమ్మగా కొలుస్తూ భారతమాత పేరు మీదనే వేలాదిమంది స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు జరిగాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో వందేమాతరం అంటూ భారతదేశాన్ని అమ్మగా పదే పదే తలుచుకుంటూ ఎందరో ఉద్యమకారులు బ్రిటిష్ వారి చేతుల్లో చావుదెబ్బలు తిన్నారు. అంతగా బ్రిటిష్ వారిని వణికించింది ఈ పిలుపు. అమ్మకు వందనం అంటూ వందేమాతర గీతాన్ని ఆలపించేందుకు ప్రతి భారతీయులందరూ పులకించిపోయేవారు. జైలుకు పోయినా ఫరవాలేదు కానీ, భారతమాతకు వందనం చెప్పాల్సిందేనంటూ వందేమాతర నినాదంతో దిక్కులు పిక్కటిల్లేలా చేశారు.

కానీ నేటి పరిస్థితి భారతమాతను కన్నీరు పెట్టించేలా ఉంది. ఇటీవల కేరళ గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌లో భారతమాత చిత్రపటాన్ని పూజించేందుకు, కనీసం గౌరవించేందుకు సైతం అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ముందుకు రాలేదు. భారతమాతకు ప్రభుత్వ గుర్తింపు, రాజ్యాంగ గుర్తింపు ఉన్నాయా? అని ఆ రాష్ట్ర వ్యవసాయమంత్రి పి.ప్రసాద్ ప్రశ్నించి స్వాతంత్య్రోద్యమాన్నే అవమానించారు. ఈ ఘటనపై దేశభక్తులు తల్లడిల్లగా, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించామంటూ గొప్పలు చెప్పుకునే 130 ఏళ్ళ నాటి ఒక ఘన రాజకీయ పార్టీ మాత్రం నోరు మెదపలేదు. భారతమాతను అవమానించేలా మాట్లాడితే శిక్షలు తప్పవని గతంలో 2022 జనవరిలో మద్రాస్ హైకోర్టు పాస్టర్ జార్జి కేసులో హెచ్చరించింది కూడా… ఈ సందర్భంగా భారతమాత మనకిచ్చిన ప్రేరణను స్మరించుకుందాం…

భారత్ మాతా కీ జై!” అనే ఈ స్ఫూర్తిదాయక నినాదం ప్రతీ భారతీయుడిలో ఉన్న దేశభక్తిని తట్టిలేపుతుంది. సమాజంలో జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వివిధ వర్గాలు, ప్రాంతాలు లేదా భాషా సమూహాలకు చెందిన వ్యక్తులు సమిష్టి అనుబంధ భావనను ఏర్పరుచుకున్నారంటే కారణం భారతమాత అనే భావన. అంటే ఈ దేశం నాతల్లి అనే భావననే…

కొన్ని ఆధారాల ప్రకారం, భారతమాత అనే భావన లేదా ఆలోచన 1857 తిరుగుబాటు తర్వాత వచ్చిందని చెబుతుంటారు. వివిధ రాజ్యాలు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు అందరూ కలిసి, ఈస్ట్ ఇండియా కంపెనీని సవాలు చేయడానికి కలిసి వచ్చినప్పుడు మనమంతా వేరువేరు కాదని, ఈ దేశ పుత్రులమే అనే భావనను పెంచాలని తలచి ముందుకు రాగా భారతమాత అనే భావన రేకెత్తింది. 1873లో కిరణ్ చంద్ర బెనర్జీ రాసిన ‘ భారత్ మాతా’ అనే బెంగాలీ నాటకంలో మనం మొదటిసారిగా జాతీయ మాతృ దేవత గురించి వింటాము. ఇది 1770 బెంగాల్ కరువు, కంపెనీపై తిరుగుబాటు చేయడానికి ఒక దేవత ప్రజలను ఎలా ప్రేరేపించిందో వివరిస్తుంది. 1882లో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సన్యాసి తిరుగుబాటు అనే ఇతివృత్తంలో ఈ భావనను మరోసారి పేర్కొన్నారు. అందులో ఆయన వందేమాతరం లేదా తల్లికి నమస్కారం అనే భావనను పరిచయం చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ సమయంలో కఠినమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో జాతీయవాద భావాన్ని రేకెత్తించడానికి మాత చిత్రాన్ని చిత్రించాడు.

బ్రిటీష్ వారు భారతదేశంలో అన్ని పాశ్చాత్య నమూనాలలో విద్యా వ్యవస్థను స్థాపించినప్పుడు, ఆర్ట్ కళాశాలలు, సంస్థలు కూడా పాశ్చాత్య కళా శైలిని అభ్యసించడం ప్రారంభించినప్పుడు, రవీంద్ర ఠాగూర్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ను స్థాపించారు, ఇది భారతీయ కళా శైలులను ప్రోత్సహించింది. మన స్వంత భారతీయ ప్రామాణిక శైలిని తిరిగి రూపొందించేలా ఆ సమయంలో రవీంద్రుని సమీప బంధువైన అవనీంద్రనాథ్ ఠాగూర్ దేశమాత చిత్రపటాన్నిగీశారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ప్రసిద్ధ జాతీయ కవితను దృశ్యమానం చేశారు. అవనీంద్రనాథ్ గీసిన భారత్ మాత చిత్రలేఖనం మంచి ఆదరణ పొందింది. స్వాతంత్ర్యానికి ముందు పోరాటంలో భారతమాతకి సంబంధించిన అనేక చిత్రాలు ఉద్భవించాయి. సుప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ 1898లో గీసిన భారత్ మాత చిత్రం, అమృత షెర్గిల్ 1935లో గీసిన చిత్రం, రూప్ కిషోర్ కపూర్ చిత్రం కూడా ఉన్నాయి. మొత్తంగా భారతమాత మన ప్రజలలో జాతీయవాద భావాన్ని గణనీయంగా పెంపొందించింది. భారత మాత చిత్రం అనేది కేవలం మాతృత్వభావనే కాదు దేశ ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది.

భారతమాత అనే భావన అనేది మన దేశ వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఇదే భావన అందరినీ ఏకంచేసింది. మన భారతదేశ చరిత్ర నుండి చూడగలిగితే, దాదాపు ప్రతి వంశం, అది రాజ్‌పుత్ రాజులు అయినా లేదా మరాఠాలతో పాటు ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు అయినా ఇలా ఏ రాజులు అయినా తమ సైన్యాలను యుద్ధభూమికి నడిపించే ముందు వారి ఇలవేల్పుకు పూజలు నిర్వహించేవారు. వారి దేవత ఆశీర్వాదాలు వారిని విజయానికి నడిపిస్తాయని నమ్మేవారు. అమ్మవారు శక్తిస్వరూపిణి. అందుకే, భారత మాత చిత్రం కూడా స్వాతంత్య్ర యుగంలో బలం, శౌర్యానికి దాదాపు సమానమైన చిత్రంగావున్నది. భారతీయ సంప్రదాయంలో, స్త్రీని దైవంగా భావించి పూజిస్తాం. శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధిస్తాం. భారతదేశాన్ని మాతృమూర్తిగా, పోషకురాలు, రక్షకురాలు అనే భావన కలుగుతుంది. భారత మాత అనే ఈ మాతృత్వ అంశం “వసుధైక కుటుంబకం” అనే భావనతో ప్రతిధ్వనిస్తుంది, ప్రపంచం ఒకే కుటుంబం, ఇక్కడ భూమిని తన పిల్లలందరినీ, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, పోషించే తల్లిగా చూస్తారు.

ప్రపంచంలోని అన్నీ దేశాలు పితృస్వామ్య దేశాలైతే మనదేశం ఒక్కటే మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం. మొదటి నుంచీ దేశాన్ని తల్లితో పోల్చడం అనే గొప్ప భావన కేవలం మనకు మాత్రమే సొంతం. అందుకే మనదేశాన్ని భారతమాత లేదా భారతాంబ అనే పదాలతో పిలుస్తాం. విదేశీ భావజాలంతో ప్రేరేపితమై, నడుపబడుతున్న కమ్యూనిస్టు పార్టీ కేరళలో భారతమాతపై అనవసర వివాదాన్ని రేపింది. ఆరెస్సెస్ పై గుడ్డి వ్యతిరేకతతో మన దేశాన్ని భారతమాతగా పూజించే ఆలోచనను వ్యతిరేకిస్తోంది.. భారతమాత అన్న భావనను ఆర్ఎస్ఎస్ సృష్టించినదనే వాదనతో వామపక్షాలు భారత మాతను వ్యతిరేకిస్తున్నాయి. దేశ ప్రజలందరు కూడా ఈ ఆలోచనను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.