
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వివరాలను కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు యోగా వేదిక వద్దకు చేరుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలలో 2018 సంవత్సరంలో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 60 వేల మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు.
అంతర్జాతీయంగా పలు దేశాల్లో యోగా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పాల్గొంటారని.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లైవ్ ప్రసారం జరుగుతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలియజేశారు.




