News

వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం.. రాత్రికి రాత్రే దుండగుల అరాచకం..

212views

తిరుపతి జిల్లాలో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా తిరుచానూరు లోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. తిరుచానూరు పద్మావతి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వారాహి అమ్మవారి ఆలయం కొలువై ఉంది. అయితే మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఈ ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి మూలవిరాట్టును, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసి.. నదిలో పడేశారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అయితే కొద్ది రోజులుగా వారాహి అమ్మవారి ఆలయం ఉన్న స్థలంపై వివాదం నడుస్తోంది. ఆలయం ఉన్న స్థలం తమదేనంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లారు. ఆలయంలో పూజలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ కొట్టివేసింది. దీనికి తోడు ఇటీవల ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత అవతలి పక్షం ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం అర్ధ రాత్రి సమయంలో ఏకంగా ఆలయాన్ని నేలమట్టం చేసి.. విగ్రహాలను పక్కన ఉన్న స్వర్ణముఖి నది ఒడ్డున పడేశారని ఆలయ పూజారి సురేంద్ర బాబు చెప్తున్నారు.