
గత నెలలో కర్నాటకలోని మంగళూర్ లో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సహాస్ హత్యను దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో వున్న నిందితులందర్నీ ఎన్ఐఏ ప్రశ్నించనుంది.
కర్నాటకలోని మంగళూరులో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టిని దుండగులు రోడ్డుపైనే ఘోరంగా నరికి చంపారు. నగరంలోని బాజ్‌పే కిన్నిపడవు సమీపంలో ఐదుగురు వ్యక్తులు కలిసి సుహాస్ ను దారుణంగా చంపారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సుహాస్ హత్య జరిగిన కొన్ని నిముషాల్లోనే Troll_mayadiaka అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘Finish’ అనే పోస్ట్ తో పాటు హత్య వీడియోను హంతకులు షేర్ చేశారు. నెక్ట్స్ వికెట్ కూడా త్వరలోనే పడబోతోంది అంటూ పోస్ట్ చేయడంతో మంగళూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హిందూ నేత సుహాస్ షెట్టి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈహత్యతో ప్రమేయమున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ముగ్గుర్ని బాజ్ పే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అజారుద్దీన్, అబ్దుల్ ఖాదీర్, నౌషద్ వున్నారు. దీంతో ఈ హత్య కేసులో సంబంధముండి, అరెస్టైన వారి సంఖ్య 11 కి చేరుకుంది. ఈ ముగ్గురికీ నిషేధిత ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురే సుహాస్ షెట్టి హత్యకు ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తోంది.





