
బలుచ్, స్తాన్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడినదే బెలూచిస్తాన్. బలుచ్ అనేది ఆ ప్రాంత ప్రజల తెగను సూచిస్తుంది. పాత ఇరానియన్ భాష ప్రకారం జాతి లేదా సమూహం అనే అర్థం వస్తుంది. ఇస్తాన్ అనేది పర్షియన్ పదం. అంటే ప్రత్యేక ప్రాంతం లేదా దేశం అనే అర్థం వస్తుంది. వీరు ఇండో-ఇరాన్ మూలాలు కలిగిన గిరిజనులు. బలోచి భాష మాట్లాడతారు.
చరిత్రలోకి చూస్తే` ఇప్పటి బెలూచిస్తాన్ ప్రాంతాన్నే నాడు కలత్ అని పిలిచేవారు. 1839లో బ్రిటిష్ సైన్యం కలత్‌పై దాడి చేసింది. కలత్‌ను మీర్ మెహ్రబ్ ఖాన్ అహ్మద్ జాయ్ 1817 నుండి 1839 వరకు పాలించాడు. బ్రిటిష్ వారు అఫ్గానిస్తాన్‌పై దాడి చేసినప్పుడు కలత్ రాజు వారికి సహకరించ లేదు. ఈ కారణంగానే 1839లో బ్రిటిషర్లు కలత్‌పై దాడి చేసి రాజును చంపారు. స్థానిక గిరిజన సర్దార్ నాయకులతో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయ పాలకులు తమ అదుపులో పెట్టుకున్నరు. ఇది బలోచ్ గిరిజనులలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. వారు తరచూ ఆంగ్లేయులపై వీరు తిరుగుబాటు చేసేవారు. 1920ల నాటికి బలోచ్ జాతీయవాదానికి అంకు రార్పణ జరిగింది. స్వాంతంత్ర కాంక్ష పెరిగింది.
1929లో అంజుమన్ – ఎ- ఇత్తెహాద్ – ఎ- బెలూచిస్తాన్ అనే సంస్థ పురుడు పోసుకుంది. ఈ సంస్థ లక్ష్యం బలోచ్ సంస్కృతిని కాపాడటం, కలోత్ రాజ్య స్వతంత్రం, అంటే బెలూచిస్తాన్ ఏర్పాటు. వలస రాజ్యాలకు స్వాతంత్రం ఇచ్చే సమయానికి అంటే భారతదేశ విభజన సమయానికి కలత్ రాజ్యం మీర్ అహ్మద్ యార్‌ఖాన్ నాయకత్వంలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ‘పిత’ చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా ఈ డిమాండ్‌కు మద్ధతు ఇవ్వడం గమనార్హం. కలత్ స్వతంత్రతను ముస్లింలీగ్ గౌరవిస్తుందని ఆగస్ట్ 11,1947న ఇరువురు నేతల మధ్య ఒప్పందం కుదిరింది. కాని పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మార్చి 27, 1948న సైన్యంతో వెళ్లి కలత్‌ను కబళించింది. విలీన ఒప్పందంపై సంతంకం చేయాలని కలత్ నేతలపై ఒత్తిడి ప్రారంభించింది. దీంతో కలత్ భారతదేశంలో కలిసేందుకు సిద్ధమవుతోందని అయితే బౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని భారత దేశ నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారన్న వార్తలు వచ్చాయి. ఇదే నిజం.
జిన్నా సూచన మేరకు 1948లో సైనిక చర్య చేపట్టారు. మీర్ అహ్మద్ యార్‌ఖాన్‌ను బలవంతంగా కరాచి తీసుకువెళ్లి పాకిస్తాన్‌లో విలీనం అయినట్లు సంతకం పెట్టించారు. దీన్ని బలోచ్‌లు, ప్రిన్స్ అబ్దుల్ కరీం తిరస్కరించి 1948లో గెరిల్లా దాడులతో తిరుగుబాటు చేశారు. పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచి వేసి, కరీంను జైల్లో పెట్టింది.
పాక్ మీద జరిగిన తొలి తిరుగుబాటుకు (1948) ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వం వహించారు. ఆయన అరెస్టు తర్వాత 1958-59 కాలంలో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు బెలూచిస్తాన్‌లో పాక్ సైన్యం చేస్తోన్న ఆకృత్యాలు, ఆధిపత్య ధోరణి, రాజకీయ నేతలపై అణచివేత చర్యలను వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తర్వాత 1963 నుండి 1969 వరకు బెలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఇది పాక్ జైళ్లలో ఉన్న బలోచ్ ఖైదీల విడుదలకు, బలోచ్ లోని గ్యాస్ సహా ఇతర వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని, వన్ యూనిట్ విధానం రద్దును కోరుతూ జరిగింది. అంటే బెలూచిస్తాన్ సింధ్, ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా, అప్పటి తూర్పు పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రాలను కలిపివేసి కేంద్రపాలన ఏర్పాటు చేయాలని కోరడమే. 1955 నుండి 1970 వరకు పాక్ పాలకులు వన్ యూనిట్ విధానం కోసం ఆలోచన చేశారు. దీన్ని అన్ని రాష్ట్రాల వారు తమ సంస్కృతి, భాష, సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోతాయని విభేదించారు.
చివరకు 1970లో ఇది రద్దు చేయడం జరిగింది. ఈ డిమాండ్లపై బీఎల్‌ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. దీనికి షేర్ మహమ్మద్ బిజ్రానీ మర్రీ నాయకత్వం వహించారు. ఇతను పరారీ అనే గెరిల్లా యుద్ద సంస్థను ఏర్పాటు చేసి పాక్ సైన్యంపై దాడులు చేశారు. చివరకు 1969 పాక్ సైన్యం- బీఎల్‌ఎఫ్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. వన్ యూనిట్ విధానం రద్దు అయింది. ఈ గెరిల్లా వార్‌లో పాల్గొన్న తిరుగుబాటు దారులకు పాక్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఆ తర్వాత 1973-77 కాలంలో తీవ్ర స్థాయిలో తిరుగుబాటు జరిగింది. దీనికి ఖైర్‌బక్ష్ మారీ, అతావుల్లా మెంగల్ వంటి స్థానిక గిరిజన సర్దార్ లు నాయకత్వం వహించారు. ఇందుకు ప్రధాన కారణం జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రభుత్వం బెలూచిస్తాన్ స్థానిక ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఇరాక్ నుండి బలోచ్‌వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80 వేల సైనికులు పాల్గొన్నారంటే బలోచ్ తిరుగు బాటు ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకో వచ్చు. ఈ దాడుల్లో ఏడు వేల నుండి పది వేల మంది బలోచ్‌వాదులు మరణించినట్లు చెబుతారు. పాక్ సైన్యంలోను మూడు నుండి ఐదు వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జుల్ఫికర్ ఆలీ భుట్టోను సైనిక చర్య ద్వారా దింపి జియా ఉల్ హక్ అధికారంలోకి రావడంతో ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధపడటం, బలోచ్ నాయకులు అఫ్ఘానిస్తాన్‌కు శరణార్థులుగా వెళ్లడంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ఇక ఆ తర్వాతి తిరుగుబాటు ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన తిరుగుబాటుగా చరిత్రకారులు చెబుతారు.
2006లో నవాబ్ అక్బర్ బుగ్టి హత్యతో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీసింది. బెలూచిస్తాన్‌లో జనరల్ ముషార్రఫ్ సైనిక స్థావరాలు పెంచడం, చైనా పాక్ ఆర్థిక కారిడార్ సీపెక్ ప్రాజెక్టును ప్రారంభించడం వంటి చర్యలు బలోచ్‌లలో తీవ్ర అసంతృప్తికి దారి తీసాయి. తమ వనరులు కొల్లగొడుతున్నారని, తమకు సరైన వాటా రావడం లేదని, పంజాబీల ప్రాబల్యం పెరుగు తుందన్న కారణాలతో బలోచీవాదులు తిరుగు బాటుకు సిద్ధమయ్యారు సీపెక్ ప్రాజెక్టుల్లో బలోచి స్థానేతరులకు ఉపాధి కల్పించడం వంటివి చర్యలు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే దీన్ని వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌గా పని చేసిన నవాబ్ అక్బర్ బుగ్టి హత్య కావడం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇతను వనరుల్లో సమాన వాటాను డిమాండ్ చేశారు. అంతే కాకుండా గ్వాదర్ పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అతని హత్య బెలూచిస్తాన్ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది.
బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) 2000 దశకంలో ఏర్పాటు అయింది. సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థగా దీన్ని రూపొందిం చారు. 1973 -77 కాలంలో తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఖైబర్ బక్ష్ మర్రీ కుమారుడు మీర్ బలచ్ మర్రీ ఈ ఆర్మీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇతని తండ్రి ఖైబర్ బక్ష్ మర్రీ బలోచీల జాతీయవాద ఉద్యమానికి ఓ ముఖ్య ప్రేరణగా నిలిచారు. అతని కూమారుడి సారథ్యంలో ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం అనే డిమాండ్ తో పురుడు పోసుకుంది. ఈ సంస్థ ఆధునిక గెరిల్లా యుద్ధ తంత్రాలను పుణికిపుచ్చుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలోచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావడం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావడం, హత్యలు కావించబడటం, పాక్ – చైనా ఆర్థిక కారిడార్ సీపెక్‌లో భాగంగా గ్వాదర్ పోర్టు నిర్మాణం, గ్యాస్, గోల్డ్ వంటి సహజవనరులు తరలించడం, వీటిని ఖండిస్తున్న నవాబ్‌అక్బర్ బుగ్టి హత్యతో బీఎల్‌ఏ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.
పాక్ సైన్యం పైన, చైనా ప్రాజెక్టులపైన దాడులకు బీఎల్‌ఏ దిగింది. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ సైన్యం పైన, పాకిస్థాన్ లో బాంబులు పేల్చడం వంటి చర్యలతో తమ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా పోరాటం చేస్తూనే ఉంది. ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీర్ బలోచ్ మర్రీ 2007లో నాటో దాడుల్లో మరణించారు. ఆ తర్వాత ఈ సంస్థను బషీర్ జెబ్ నడిపిస్తున్నారు.
ప్రత్యేక దేశం కావాలని పాక్‌పై పోరాటం చేస్తున్న బీఎల్‌ఏ ఇటీవల స్వతంత్రం ప్రకటించుకుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్‌కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బెలూచిస్తాన్ విడుదల చేసింది.





