News

బాలాజీ టెంపుల్ కూల్చివేతపై హైకోర్టు ఏం చెప్పిందంటే

369views

ఢిల్లీ ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆలయం కూల్చివేతపై శివ బాలాజీ , వెంకటేశ్వర మందిర్ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణకు రాగా.. ఈనెల 19వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది.స్టేటస్ కో యధాతధ స్థితిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అంత వరకూ విద్యుత్, నీటి సరఫరా కూడా కొనసాగించాలని హైకోర్టు స్ఫష్టం చేసింది.

ఈ సందర్భంగా పూజారి గోపాల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. తానేమైనా ఉగ్రవాదినా ఎందుకు తన గుడిని కూల్చివేస్తామని అంటున్నారని ప్రశ్నించారు. 1970 నుంచి ఇక్కడే గుడి నిర్మాణం చేసుకొని పూజలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. గుడికి మంచినీరు, కరెంట్ కట్ చేశారని.. తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. గుడిని కూల్చకుండా చర్యలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కమిషనర్ గుడిని కూల్చేస్తామని చెప్పారని.. ఇందుకోసం అధికారులను పంపించారన్నారు. అయితే హైకోర్టు మే 19 వరకు గుడిని కూల్చివేయొద్దని స్టే విధించిందని.. యధాస్థితిగా స్టేటస్‌కో ఆర్డర్ అమలు చేయాలని ఆదేశించిందని గోపాల్ కుమార్ మిశ్రా వెల్లడించారు.