News

‘నూర్‌ఖాన్‌’ నేలమట్టం

67views

పాకిస్తాన్‌పై భారత్‌ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం మీదా భారత్‌ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్‌విజన్‌’ తీసిన తాజా శాటిలైట్‌ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి.

ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్‌ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్‌ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్‌ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్‌ స్థావరం, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఝంగ్‌ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్‌ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మెద్‌ షరీఫ్‌ వెల్లడించారు.

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్‌ఖాన్‌ బేస్‌ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్‌లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్‌ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్‌–78 వంటి రీఫ్యూయిలర్‌ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం.