News

పాక్‌ నటీనటులపై ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ బ్యాన్‌

334views

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ AICWA ఖండించింది. వారిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘వారి కామెంట్స్‌ మన దేశాన్ని అగౌరవపరచేలా ఉండడం మాత్రమే కాదు.. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయి. మన చిత్ర పరిశ్రమలో వర్క్ చేసే పాకిస్థానీ కళాకారులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా బ్యాన్‌ విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌరవపరచడమేనని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం’’ భారతీయ గాయనీగాయకులు పాక్‌ సింగర్స్‌తో వేదికలను పంచుకోవద్దని సూచించింది. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.