News

విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ “ఆపరేషన్ సిందూర్” ర్యాలీ

375views

ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్… ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సభ్యులు శివప్రసాద్ అన్నారు. “ఆపరేషన్ సిందూర్” లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో టపాసులు కాల్చుతూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ భారత దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచ పటంపై మరోసారి నిలిపిందని కొనియాడారు. పహల్గామ్ దాడికి భారతదేశం సాహసోపేతంగా తగిన ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు.