ArticlesNews

విశ్వ అవతరణకు ప్రతీకలు దశావతారాలు

321views

వేదాలలో ‘సగుణ సాకార’ బ్రహ్మను వివిధ రూపాలలో అభివర్ణించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రధాన సాకార దేవతలు. ఈ త్రిమూర్తులు నిర్గుణ పరబ్రహ్మ’ రూపాలే. ఈ పరబ్రహ్మ మూడు కార్యకలాపాలు సాగిస్తాడు. మూడు రూపాలుగా భాసిస్తాడు. సృష్టి చేసేవాడు ‘బ్రహ్మ’, సృష్టిని పరిరక్షించేవాడు విష్ణువు, నశింపచేసేవాడు ఈశ్వరుడు. ఈ సాకార త్రిమూర్తుల స్వరూప స్వభావాలను, శక్తులను పురాణాలు సవివరంగా విశదం చేశాయి. ఇది ‘వివిధ దేవతాతత్వం’ మాత్రమే. అద్వితీయుడైన ‘పరబ్రహ్మ’ వివిధ రూపాలు ధరిస్తున్నాడు. భక్తుడు తన స్వభావానికి అనుగుణంగా ఏదో ఒక రూపాన్ని ఎంచుకుంటున్నాడు… ఆరాధిస్తున్నాడు.

పరబ్రహ్మ త్రివిధ రూపాలలో ఒకడైన ‘విష్ణువు’ క్రమంగా దశావతారాలు ధరించాడు. విశ్వ అవతరణలోని వివిధ దశలకు ఈ అవతారాలు ప్రతీక. మత్స్య (చేప) కూర్మ(తాబేలు) వరాహ, నరసింహ, వామన (పొట్టివాడు) పరశు రామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు మానవ క్రమవికాసంలో వివిధ దశలుగా గోచరిస్తాయి. దైవశక్తిని మొదట జంతురూపంలోను, క్రమంగా మానవ
రూపంలోను, చివరికి ఆదర్శపురుషుని రూపంలోను చిత్రీకరించడం భారతీయ తత్వం ప్రత్యేకత. వాస్తవిక దృష్టికి ఇది నిదర్శనం. రాముడు, కృష్ణుడు ఇద్దరూ ఆదర్శపురుషులు, ఈ మహనీయుల సంస్తుతితో ‘భక్తితత్వం’ సమున్న ఆధ్యాత్మిక శిఖరాగ్రాలకు చేరుకుంది. రాముడు ‘మర్యాదా పురుషోత్తముడు’. సక్రమ కార్యకలాపాలు సాగించే ఆదర్శపురుషుడు. ఆయన ధర్మానికి ప్రతిరూపం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’. రాముడు ధర్మానికి సజీవ రూపం.

కృష్ణుడు ‘లీలా పురుషోత్తముడు’. భగవంతుని జగన్నాటకంలో ఆదర్శ మానవుడు. మానవ సంబంధాలలో నెలకొన్న అన్ని రకాల ఆదర్శాలను పటిష్టం చేయడానికి రాముడు ప్రయత్నించాడు. అయితే మానవ సంబంధాలను పెంపొం దించడమే కృష్ణుని లక్ష్యం. మానవాళి మధ్య సత్సంబంధాలు పెంపొందడానికి వీలుగా ఆయన అసంఖ్యాక పద్ధతులను అన్వేషించాడు.
ఈ లక్ష్య సాధనకోసం ఆయన అంగీకృత ప్రవర్తనా సరళిని అతిక్రమించాడు కూడా. విప్లవ పరివర్తన ప్రాతిపదికగాకల ధర్మానికి ఆయన జీవితం ప్రతీక. విభిన్నజీవన సిద్ధాంతాలను సరికొత్త రీతిలో సమీకృతం, సమన్వయం చేశాడు.

మిగిలిన అవతారాలలో భగవంతుని కొన్ని ‘అంశలు’ మాత్రమే ప్రస్ఫుటించాయి. కానీ కృష్ణావతారంలో భగవంతుడు సర్వసమగ్రంగా, సంపూర్ణంగా ప్రస్ఫుటించాడు. పదహారు దైవకళలూ (భంగిమలు) కృష్ణునిలో ప్రతిబింబించాయి. ఒక జీవిత కాలంలో శ్రీకృష్ణుని వలె ప్రపంచ మానవాళికి ‘ఆదర్శాల అమృత భాండం’ అందించిన మహనీయుడు మరొకరు లేరు. ఆయన నదిఒడ్డున నృత్యం చేశాడు. సమర రంగంలో అర్జునునికి ‘గీత’ బోధించాడు. ఆయన ప్రవచించిన నిష్కామ కర్మ (స్వార్ధరహిత శ్రమ), ప్రేమ అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాలు.. మానవాళి బాధలకు అవి దివ్యఔషధాలు.

అత్యద్భుత విజయం
‘భజ్’ ‘క్తిన్’ అనే ధాతువుల సంయోగమే ‘భక్తి’. ‘సేవ చేయటం’ అని ఈ ధాతువులకు అర్ధం. ‘భగవంతునితో సన్నిహిత సంబంధమే భక్తి’ అని శాండిల్యుడు తన ‘భక్తి సూత్రం’లో పేరొన్నాడు. భక్తి అపరిమిత ప్రేమను కురిపిస్తుందని ‘భక్తిసూత్రం’ ప్రవచిస్తోంది. ఈ ప్రేమ అమృతతుల్యమైంది. భక్తుడు ఈ అమృతం తాగి పూర్తి సంతృప్తిని పొందుతాడు. యల్లబ్ధ్వ పునమ్ సిద్ధ భవతి అమృతో భవతే, తప్తోభవతి’ భక్తివల్ల భక్తునికి స్ఫూర్తి లభిస్తుంది. అమరత్వం సిద్ధిస్తుంది. భక్తి వల్ల భక్తుడు ఉన్నతిని పొందు తాడు. భక్తుడు కావడం ఆషామాషీ వ్యవహారం కాదు. మానవుడు భక్తుడు కావడం సమున్నత విజయశిఖరాలను అధిరోహించడమే కాగలదు.