ArticlesNews

‘ఎర్ర’ గాలితో ‘పచ్చ’ మంట! 2

366views

మతం మత్తుమందు అంటూనే….
రెడ్‌-గ్రీన్‌ బంధం 1990 ప్రాంతంలో అంకురించి, 2000 సంవత్సరంలో ఒక రాజకీయ ఉద్యమంగా ప్రపంచం దృష్టికి వచ్చిందని అంటారు. కానీ వాటి బంధం అంతకంటే పాతదే. కచ్చితంగా చెప్పాలంటే వందేళ్ల నాటిది. అంటే ఆదిలోనే మార్క్సిస్టులు మతం మత్తుమందు అన్న మార్క్స్‌ సూత్రానికి నీళ్లు వదిలేశారు. వామపక్షం, రాజకీయ ఇస్లాంల మధ్య బంధం సోవియెట్‌ యూనియన్‌ ఆవిర్భావంలోనే కనిపిస్తాయి. రష్యా అంతర్యుద్ధం వేళ పాశ్చాత్య శ్వేతజాతీయుల మద్దతు ఉన్న అక్కడి శిబిరాల మీద లేదా బోల్షివిక్‌ వ్యతిరేకుల మీద కాకాసెస్‌, మధ్య ఆసియాలో ఉన్న ముస్లింలను సోవియెట్‌ రష్యా నాయకులు ప్రయోగించారు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని సాయుధ ముస్లిం వర్గాలతో రెడ్‌ ఆర్మీ (యూఎస్‌ఎస్‌ఆర్‌ సైన్యం) ఒప్పందాలు చేసుకుంది. పాశ్యాత్య సామ్రాజ్య వాదంతో పోరాడేందుకు 1920 నాటి పీపుల్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ వారి కాంగ్రెస్‌లో పిలుపునిచ్చారు. ఈ సమావేశం రష్యాలోనే బకు అనే చోట జరిగింది. బందిపోట్లకు, అణచివేత దారులకు, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పవిత్రయుద్ధం ఆరంభించాలని బకు సభలలో కీలకంగా వ్యవహరించిన గ్రెగరి జినోవివ్‌ పిలుపునిచ్చాడు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇది లెనిన్‌ మరణం తరువాత మారి పోయింది. స్టాలిన్‌ ఈ ఆలోచనను వ్యర్థమైనదిగా భావించాడు.

స్టాలిన్‌ యుగం తరువాత అమెరికాను నిరోధించడానికి, ముఖ్యంగా మధ్య ఆసియాలో నిలువరించడానికి ఇస్లామిజాన్ని ఆశ్రయించారు. అంటే ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియెట్‌ రష్యా రాజకీయ ఇస్లాం సేవలను తీసుకున్నది. తమ ప్రయోజనాల కోసం ముస్లిం నేతలు కూడా సోవియెట్‌ ఆధిపత్యానికి తలొగ్గారు. విదేశీ సామ్రాజ్య వాదంతో పోరాడేందుకు అవసరమైన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించడానికి ఇదొక అవకాశంగానే ముస్లిం నాయకులు భావించారు. ఇది ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సరిగ్గా సోవియెట్‌ రష్యా రాజకీయ అవసరాలకు అనువుగా కూడా ఉంది. ఆ క్రమంలోనే సోవియెట్‌ రష్యా పాన్‌ అరబిస్ట్‌ ఉద్యమానికి, పాలస్తీనా గెరిల్లాలకు మద్దతుగా నిలిచింది. అరబిస్ట్‌ ఉద్యమం, పాలస్తీనా గెరిల్లాల లక్ష్యం ఒక్కటే. అది మధ్య ఆసియాలో ఇజ్రాయెల్‌, అమెరికాల ప్రాబల్యం సడలిపోవడం. గమాల్‌ అబ్దుల్‌ నసీర్‌ (ఈజిప్ట్‌), హఫీజ్‌ అల్‌ అసాద్‌ (సిరియా), యాసిర్‌ అరాఫత్‌, మహమ్మద్‌ అబ్బాస్‌ (పాలస్తీనా విమోచనా సంస్థ నేతలు) సోవియెట్‌ రష్యాకు అత్యంత సన్నిహితం కావడం అందుకే. ఇరాన్‌ విప్లవం సమయంలో షా (పాలకుడు) పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ అంటూ ప్రచారం చేయడంలో రష్యాదే కీలక పాత్ర. అప్పుడు కూడా జాతీయవాదులు (భారతదేశంలో జాతీయ వాదుల వంటివారు కాదు వీరు. నేషనలిస్టులు అని పిలుస్తారు. ఆ ఇంగ్లిష్‌ పదానికి అర్ధం మాత్రమే ఇక్కడ రాశాం); మార్క్సిస్టులు, ఇస్లామిస్టులు కూటములుగా షా వ్యతిరేక ఉద్యమం నిర్వహించారు. ఇందులో మార్క్సిస్టులు, ఇస్లామిస్టులు బలమైన వర్గంగా నిలిచారు. అయితే అక్కడ ముస్లింల తమ నిజ స్వరూపం బయటపెట్టారు. షాను తొలగించి అధికారంలోకి వచ్చిన గ్రీన్‌ వర్గం నాయకుడే అయితుల్లా రుహోల్లా ఖోమేని. ఇతడు నిర్మొహ మాటంగా రెడ్‌ వర్గాన్ని పక్కన పెట్టాడు. ఏప్రిల్‌ 1979లో ఇరాన్‌ను ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ అని ప్రకటించాడు. కాబట్టి ఇరాన్‌ మత రాజ్య స్థాపనలో కమ్యూనిస్టులది కీలక పాత్రేనని మరువరాదు. కానీ 66 మంది అమెరికన్‌లను బందీలుగా పట్టుకుని తాము మార్క్సిస్టుల కంటే పెద్ద ‘సామ్రాజ్య వ్యతిరేక వాదుల’మని చాటడానికి ఇరాన్‌ ఉద్యమకారులు ప్రయత్నించారు. అధికారంలో ఉన్న కూటమిలో ముజాహుదీన్‌ ఇ ఖాల్క్‌ (వామపక్ష భావాలు ఉన్న వర్గం) కూడా క్రమంగా అంతర్ధానమైంది.

కొత్త ప్రపంచ నిర్మాతలు మోదీ, ట్రంప్‌
నరేంద్ర మోదీ (భారత్‌), డొనాల్డ్‌ ట్రంప్‌ (అమెరికా), జేవియర్‌ మీలీ (అర్జెంటీనా) వంటి ప్రపంచ నేతలు సరికొత్త ప్రపంచ కన్సర్వేటివ్‌ ఉద్యమాన్ని నిర్మిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియో మెలోని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులది ఆది నుంచి ద్వంద్వ వైఖరేనని, ఇకపై ప్రపంచం వారి మాటలు నమ్మబోదని కూడా ఆమె స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్సర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌కు ఆమె వీడియో లింక్‌ ద్వారా సందేశం అందచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌ విజయంతో కమ్యూనిస్టుల అశాంతి కాస్తా మానసికోన్మాదంగా మారిపోయిందని మెలోని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు మా మీద ఏ పేరుతో ఎంత బురద జల్లినా జనం మమ్మల్ని ఎన్నుకుంటున్నారని చెబుతూ ఆమె, అందుకు కారణం తాము స్వేచ్ఛను రక్షిస్తున్నామని, సరిహద్దులు భద్రంగా ఉండాలని భావిస్తున్నామని, వాణిజ్య వ్యాపారాలకు, పౌరులకు రక్షణ ఇస్తున్నామని, ఓకిజానికి వ్యతిరేకంగా పోరాడు తున్నామని, మన పవిత్ర హక్కులకు రక్షణ కల్పిస్తున్నామని, భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షిస్తున్నా మని ఆమె అన్నారు. నాగరికతల విధ్వంసానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చారు కాబట్టి అఫ్గానిస్తాన్‌లో గత పరిస్థితులు పునరావృతం కావని ప్రగాఢంగా నమ్ముతున్నానని, భద్రతా చర్యలను పెంపొందించడం ద్వారా ఐరోపాలో మృగ్యమైపోయిన శాంతిని పునఃస్థాపించాలని ఆమె పిలుపునిచ్చారు.