News

తరలొచ్చిన వనదేవతలు.. తరించిన గిరిజనం

381views

వనదేవతలు నది దాటి వచ్చి మంగళస్నానాలకు అరుదెంచిన అపురూప ఘట్టం భక్తులను పులకింపజేసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు జలపాతం వద్ద రెండేళ్లకోసారి నిర్వహించే మన్యంకొండ (బడా యాత్ర) జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మన్యంకొండ జాతరలో వనదేవతలకు మంగళస్నానం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. ఒడిశా నుంచి వనదేవతలను ప్రత్యేక పడవల్లో సీలేరు నది దాటించి, పొల్లూరు గ్రామంలోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆసనంపై ఉంచారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకస్వామి అయినవిల్లి కుమార్‌స్వామి శర్మ ఆధ్వర్యంలో సీలేరు కాంప్లెక్స్‌ సీఈ వాసుదేవరావు, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అపూర్వ భరత్‌, ఏఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా, జెన్‌కో సివిల్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ వరప్రసాద్‌, ప్లాంట్‌ మేనేజర్‌ బాలకృష్ణ, సర్పంచి సీత, ఎస్‌ఏఓ ప్రసాద్‌, సీఐ తెల్లం దుర్గాప్రసాద్‌, ఎస్సై శివనారాయణ, పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావు, వనదేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం వేలాదిమంది భక్తులు, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల మధ్య సంప్రదాయబద్ధంగా వన దేవతల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి అభయారణ్యం మీదుగా పొల్లూరు జలపాతం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సుమారు 35 వేలమంది భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. సాయంత్రం 5 గంటలకు వనదేవతలను తిరిగి ఒడిశాకి తరలించారు. ఏఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా, సీఐ తెల్లం దుర్గాప్రసాద్‌, ఎస్సై శివనారాయణ ఆధ్వర్యంలో 300 మంది బందోబస్తులో పాల్గొన్నారు. అన్నపూర్ణ అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో మజ్జిగ, ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీల ఆధ్వర్యంలో భోజనాలు, తాగునీరు అందించారు.