
( ఫిబ్రవరి -26 శివరాత్రి ప్రత్యేకం )
సాలెపురుగు, సర్పం, ఏనుగు లాంటి మూగజీవాలకూ కైవల్యాన్ని ప్రసాదించిన మహాదేవుడు. మనలోని వ్యామోహాలను నశింపచేసే మహేశ్వరుడు. ఆర్తిగా ఆశ్రయించిన భక్తుల పాపాలను హరించి సంస్కరించే ‘హరుడు’ ఆ సదాశివుడు. లోకమంతా ఆయనలో ఉంది, ఆయనే లోకమంతా ఉన్నాడు. సర్వాధార చైతన్యాన్నే ‘శివుడు’ అంటోంది మన సనాతన ధర్మం. వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు శివతత్త్వాన్ని అనేక విధాలుగా విశదపరచాయి. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రతంతో మనం శివయోగులుగా మారతామని మహర్షులు ప్రతిపాదించారు. ఆ శివయోగంలో తరించే దివ్యమైన రాత్రే ‘మహాశివరాత్రి’ పర్వదినం.
అర్ధనారీశ్వరుడి అష్టతనువులు
మహేశ్వరుడికి ‘అష్టతనువు’ అనే విశేష నామముంది. అంటే ఎనిమిది దేహాలు కలిగినవాడని అర్థం. జలం శివుడి శరీరాల్లో ఒకటి. నిత్యం నీటిలో ఆ స్వామిని దర్శించుకోగలిగితే అదీ శివపూజే అవుతుంది. జలాన్ని గౌరవిస్తూ, సద్వినియోగం చేసుకుంటూ, కలుషితం కాకుండా చూసుకుంటే భూతేశుడు హర్షిస్తాడట. రెండోది హోమాగ్ని. యజ్ఞగుండంలో రగిల్చే అగ్ని లింగమూర్తితో సమానం. ఇంట్లో వంట కోసం వెలిగించే అగ్నిని కూడా హోమాగ్నిగా భావించాలి. ఈశ్వరుని మూడో శరీరం యజ్ఞకర్త. అంటే భగవంతుడికి కైంకర్యాలు చేసే వ్యక్తి. అలా భక్తుల్ని కూడా నీలకంఠుడిగానే భావించమంటున్నాయి పురాణాలు.
సూర్యచంద్రులు శివుడి నాలుగు, ఐదు శరీరాలు. మనకు వెలుగును, చైతన్యాన్ని, ఆహారాన్ని ప్రసాదించే ప్రభాకరుడు పరమశివుడే. మన మనసును చల్లబరిచే చంద్రుడు చంద్రశేఖరుడి ప్రతిరూపమే. ఇక ఆదిభిక్షువు ఆరో తనువు ఆకాశం. గగనం నుంచే ధ్వని పుడుతుంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. సృష్టిలో తొలుత పుట్టింది ప్రణవరూపమైన ఓంకారనాదమే. అందుకే శబ్దం పుట్టుకకు కారణమైన ఆకాశాన్ని చూసినప్పుడల్లా మహేశ్వరుడే స్ఫురణకు రావాలి. ఆయన ఏడో శరీరం పుడమి. సమస్త జీవులకూ ఆధారభూతమైన ఆ భూమిని సద్వినియోగం చేసుకోవటమూ సదాశివుని పూజించటమే. గంగాధరుడి ఎనిమిదో శరీరం గాలి. వాయువును గౌరవిస్తే ఆ విశ్వనాథుని అర్చించినట్లే! అందుకే పూజలు, సంధ్యావందనాల్లో ముందుగా ప్రాణాయామం చేయిస్తారు. ఈ విధంగా ఎనిమిది రూపాల్లో ఉన్న ఈశ్వరుని దర్శించి ధన్యులమవుదాం! అపచారాలకు తావీయక ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.
భక్తకవుల భావనల్లో..
భక్తకవులెందరో ఆ సర్వేశ్వరుని ప్రార్థించారు. ‘వాలిన భక్తి మొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్..’ అంటూ శివస్తుతితో భాగవత రచన ప్రారంభించాడు పోతన. శ్రీరాముడి పరమభక్తుడైన త్యాగరాజస్వామి పరమేశ్వరుడిని ప్రస్తుతిస్తూ ‘శంభో! మహాదేవ శంకర గిరిజా రమణ..’, ‘శివ శివ శివ యనరాదా.. భవ భవ బాధల నణచుకోరాదా..’ తదితర కీర్తనలు రచించారు. ఇక ముత్తుస్వామి దీక్షితులు ‘అక్షయలింగ విభో, స్వయంభో..’, ‘నీలకంఠం భజేహం సతతం, నీరజాసనాది నుతం..’ అంటూ కైలాసవాసుణ్ణి కీర్తించారు.
ఉపనిషత్తుల్లో ఉమాపతి ప్రస్తావన
పరమేశ్వరుడే భూమండలమంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే ‘సర్వం శివమయం జగత్’ అన్నది శివపురాణం. కఠ, మాండూక్య, శ్వేతాశ్వతర, బృహదారణ్యక, సూర్య, కైవల్య, స్కంద- తదితర ఉపనిషత్తులు శివమహిమను కీర్తించాయి. ‘ఈ జగత్తు అంతా ఈశ్వరుడే ఆవరించి ఉన్నాడు’ అని ఈశావాస్య ఉపనిషత్తు పేర్కొంది. శివలింగం ప్రకృతి పురుషులకు ప్రతీక అని తాత్త్వికులు వ్యాఖ్యానిస్తారు. ‘శివాయ గురవే నమః’, ‘ఈశానః సర్వ విద్యానాం’, ‘ఈశ్వరః సర్వభూతానాం’ అని వేదమంత్రాలు శివుని స్తుతించాయి. అంటే సర్వ విద్యలూ, సకల జీవులకూ ఆయన మూలకారకుడు. ‘బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః’ అన్నారు. అంటే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు, వేదాల్లోని మంత్రాలకూ ఉమాపతే అధిపతి. అయితే నిర్మలమైన మనసుతో స్వామిని కీర్తించి, ఆరాధించినప్పుడే సత్ఫలితాలుంటాయి. అందుకే ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేల?’ అని వేమన ఎద్దేవా చేశాడు.
అర్ధరాత్రి ఉద్భవించిన అభిషేకప్రియుడు…
మాఘ బహుళపక్ష చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. పరమాత్మను నిశిరేయిలో పూజించే ప్రత్యేక పర్వదినమిది. ఈ మహాశివరాత్రి రోజే శివుడు అగ్నిలింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాత్రి అనేది లౌకిక వ్యవహారాలు సద్దుమణిగే స్థితి. అందునా అర్ధరాత్రి. ‘బహిర్ముఖ దృష్టిని వదలి, బుద్ధిని అంతర్ముఖం చేసి, అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయడమే రాత్రి. పగలు బహిర్ముఖం, రాత్రి అంతర్ముఖం’ అని వ్యాఖ్యానించారు పారమార్థిక సాధకులు. ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల చుట్టూ భ్రమించే మనసును, చైతన్యానికి మూలకేంద్రమైన ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే శివరాత్రి అని వారు భావిస్తారు.
ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య- మనందరికీ తెలిసినవి. నాలుగోది అర్ధరాత్రి అయిన తురీయ సంధ్య. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించింది. అలజడులన్నీ అణగిన ఈ అచలస్థితి ధ్యానానికి మరింత అనుకూలం. మనసు పరమానందాన్ని అనుభవించే ఆ తాదాత్మ్యస్థితిలో లౌకిక లంపటాలన్నీ సద్దుమణుగుతాయి. దాన్నే ఆధ్యాత్మిక గురువులు ‘పరమమైన లయ’ అంటారు. ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట అభిషేకాలు, పూజలు, జాగరణ చేయాలని ‘లింగపురాణం’ చెబుతోంది. రోజంతా శివనామస్మరణతో గడపటం వల్ల మనసు పరిశుద్ధమవుతుందన్నది భక్తుల అనుభవం.
తిరుమలలో మహాశివరాత్రి
వేంకటాచల క్షేత్రానికి శివుడి మరో రూపమైన రుద్రుడు క్షేత్రపాలకుడు. తిరుమలేశునికి నివేదించే సమయంలో ఆ స్వామికి కూడా ప్రసాదం సమర్పిస్తారు. శివకేశవులకు భేదమే లేదనటానికి తిరుమలలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకే నిదర్శనం. ఉదయం శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, వేదపండితులు, భక్తులు ఛత్రచామరాలతో పూజాద్రవ్యాలు, మంగళ వాద్యాలతో ఊరేగింపుగా సమీపంలోని పాండవతీర్థానికి వెళ్తారు. అక్కడ వేంచేసి ఉన్న క్షేత్రపాలకుడైన రుద్రునికి ఏకాదశ నమక, చమక రుద్రమంత్రాలతో అభిషేకం చేస్తారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం రుద్రునికి వెండి నామాలు (ఊర్ధ్వపుండ్రాలు), నేత్రాలను అలంకరిస్తారు. పుష్పాలంకరణ చేసి, శాస్త్రోక్తంగా ధూపదీపాలను నివేదిస్తారు. రుద్రునికి నివేదనగా వడపప్పు, పానకం, పండ్లతో పాటు తాంబూలాన్ని సమర్పిస్తారు.





