బంగ్లాదేశీ వలసదారుల ద్వారా భారత్ లో విస్తరిస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద కార్యకలాపాలు : ఎన్ఐఏ

బంగ్లాదేశ్ టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JUM) ప్రస్తుతం భారత్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) డైరెక్టర్-జనరల్ యోగేష్ చందర్ మోదీ సోమవారం తెలిపారు. బంగ్లాదేశీ వలసదారుల ద్వారా ఇప్పటికే దాని తన పాద ముద్రలను బీహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలలో విస్తరించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్ ఐఏ జాతీయ సదస్సులో యోగేష్ చందర్ మోడీ JUM యొక్క కార్యకలాపాల గురించి వెల్లడి చేశారు. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల సీమాంతర ఉగ్రవాద వ్యతిరేక దళం(ATS)/స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF) అధిపతులు పాల్గొన్నారు. డైరెక్టర్-జనరల్ కూడా బంగ్లా టెర్రర్ సమూహం JUM బంగ్లాదేశీ వలసదారుల ముసుగుల కింద తన కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నదని తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో NIA అధికారులు అన్ని రాష్ట్రాల యాంటీ టెర్రరిస్ట్ దళాలు (ATS) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ (STF) అధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తీవ్రవాదుల ద్వారా ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించటానికి విస్తృతమైన, బలమైన తీవ్రవాద వ్యతిరేక దళాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఉద్దేశించిన ఈ సదస్సులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్, ఎన్ఐఏ డిజి వైసి మోడి, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ మరియు ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ అయిన ఆర్ ఎన్ రవి కూడా ఉన్నారు.
వైసి మోడీ అసోం-మేఘాలయ కేడర్ కు చెందిన 1984 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. 25 మంది JUM మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను రాష్ట్రాలకు అందించి తమ తమ రాష్ట్రాలలో వారిని అన్వేషించవలసిందిగా ఆయా విభాగాల అధికారులను కోరారు. ” రాష్ట్రాల సాయంతో ఇలాంటి టెర్రరిస్టు గ్రూపులను అణచివేసే సవాలును స్వీకరించేందుకు మేము సదా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇతర సారూప్య జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయంతో పని చేస్తున్నది” అని డైరెక్టర్-జనరల్ చెప్పారు.

ఎన్ ఐఏ ఇన్ స్పెక్టర్-జనరల్ అలోక్ మిట్టల్, ఐపీఎస్, టెర్రరిస్టుల నిధుల వ్యవహారంపై ఈ సదస్సులో విశదీకరించారు. “జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ ఫండింగ్ విషయంలోనిషేదిత సంస్థలు, మరియు వేర్పాటువాద అగ్ర నాయకుల అధిపతులను అరెస్టు చేసి ఛార్జ్షీటు దాఖలు చేశాం. పాకిస్థాన్ హైకమిషన్ నుంచి వివిధ అక్రమ మార్గాల ద్వారా ఈ నాయకులకు నిధులు సమకూరుతున్నాయ”ని ఆయన తెలిపారు. అయితే, ఇలా అరెస్టయిన ఉగ్రవాదుల్లో ఎవరూ ఇప్పటివరకు బెయిల్ కూడా పొందిన దాఖలాలు లేవని భారత అధికారులు నిర్ధారించారని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాద వ్యతిరేక చర్యల పై ఉమ్మడి వ్యూహం రూపొందించుకోవడానికి రాష్ట్రాల నుంచి విచ్చేసిన పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ ఎస్ ఏ) అజిత్ దోవల్ ప్రసంగించారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్ ఐఏ చేసినంత ప్రభావవంతమైన కృషి మరే ఇతర ఏజెన్సీ కూడా చెయ్యలేదని ఆయన అన్నారు.

ఉగ్రవాదానికి పాకిస్థాన్ నుంచి అందుతున్న నిధులపై దోవల్ మాట్లాడుతూ, ఒక నేరగాడికి రాష్ట్రం లేదా దేశం అండగా నిలబడితే అది ఖచ్చితంగా సవాలుగా మారుతుంది. ఉగ్రవాదులకు అండ విషయంలో కొన్ని దేశాలు ఆరితేరాయి. ఉదాహరణకు ఇప్పుడు పాకిస్థాన్ చేస్తోంది కూడా అదే. ఆ దేశం అండ లేకపోతే ఉగ్రవాదం ఎప్పుడో అంతమైపోయేది. పాక్ వారికి ఆర్థిక సాయం చేయకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. ఆర్థిక చర్యల కార్యదళం (FATF) సిఫార్సులను కూడా ఆ దేశం పెడచెవిన పెట్టింది. అందుకే ఉగ్రవాదం మీద పోరాటం మాత్రమే సరిపోదు. వారికి నిధులు సమకూర్చడాన్ని కూడా అడ్డుకోవాలి” అన్నారు. ప్రస్తుతం FATF విధించిన ఆంక్షలు పాకిస్థాన్ పై ఒత్తిడి కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ సదస్సులో ఇతర అంశాలతో పాటు టెర్రర్ ఫండింగ్, యువతను రెచ్చగొట్టడం, డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
ఆంగ్ల మూలం : DNAINDIA.COM,
తెలుగు అనువాదం : VSK DESK.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





