
దే శంలో హిందూత్వాన్ని పరిరక్షణ కోసం శ్రీ గౌడపాదాచార్యులు, శ్రీ గోవింద భగవ త్పాదులు, శ్రీ కుమారిభట్టులు, శ్రీ మండన మిత్రులు మొదలగువారు తమ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే, శైవులు, శాక్తులు, జైనులు తదితర విభిన్న మతాలవారు వారి వారి పద్ధతిలో బౌద్ధులనెదుర్కొనే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చినారు. అయినప్పటికీ వారు విడివిడిగా ఎంత సమర్థులైనా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మతోన్మాదులు, ఛాందసవాదులుగా, తాము పట్టిని కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలోసమర్థించుకోసాగారు. వీరందరినీ కలిపి ఒక దివ్యశక్తిని నిర్మాణం చేయగల మేధావి కొరత నెలకొంది. ఆ సమయంలో కేరళ ప్రాంతంలోని “కాలడి” గ్రామంలో నివసిస్తున్న శివగురు -ఆర్యాంబ దంపతులు చేసిన తపఃఫలముగా శంకరచార్యులు జన్మించినారు. వారు బాల్యావస్థలోనే వేద వేదాంగాలన్నింటినీ అభ్యసించి గొప్ప జ్ఞానాన్ని సంపాదిం చారు. తరువాత లోక కల్యాణం కోసం గోవింద భగవత్పాదుల దగ్గర సన్యాస దీక్ష స్వీకరించి గౌడపాదుల ఆశీర్వాదాన్ని గ్రహించి భానత పర్యటన చేసి, హిందూజాతిలోని మతమౌఢ్యాన్ని, పిరికితనాన్ని, వితండవాదాన్ని తొలగించడం ప్రారంభించారు. సమాజంలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించేందుకు వారు ఆధ్యాత్మ సిద్ధాంతాన్ని బోధించినారు.
సమాజాన్ని సమైక్యపరచడానికి అద్వైత సిద్ధాంతాన్ని పండితుల ముందర ఉంచారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే నినాదాలతో – ప్రజను తట్టిలేపి వారిలో ధైర్య సాహసాలను నింపారు. రాజులకు కర్తవ్య బోధచేసి వారిని దైవీశక్తి సంపన్నులుగా తయారుచేశారు. ‘అద్వైతమంటే ఈ ప్రపంచంలో ఉండేది ఒక్కటే ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్నది. అదే పరబ్రహ్మం. మనలో ఉన్న ఆత్మపరబ్రహ్మ అంశం. అందువలన మనం దీనులం, హీనులం, చేతకానివాళ్లం కానే కాదు. సాధన చేసి పరమేశ్వరుని దివ్యశక్తిని కూడ సంపాదించవచ్చు’ అంటూ ప్రజలను ఉత్సాహపరిచారు. వారు తమ జీవిత కాలంలోని ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయలేదు. చివరికి జైనీ, బౌద్ధ వితండవాదులను కూడా జయించి ఆక్రమణకారుల కుతంత్రాల రహస్యాలను బయటపెట్టి అజ్ఞానాన్ని తొలగించి స్వదేశభక్తి, స్వసమాజ ప్రీతి బోధించి సంపూర్ణ సమాజాన్ని సుసంఘటితం చేయగలిగారు. వారు చక్కటి సిద్ధాంత ప్రతిపాదకులే కాదు, చక్కటి సమాజ సంఘటితులు కూడా, తమ బుద్ధి కుశలతో, అహర్నిశ కృషితో స్వల్పకాలంలోనే ఈ సమాజాన్ని ఒక విరాట్ పురుషునివలె నిలబెట్ట గలిగినారు.
“కరిష్యే వందనం తవ” అంటూ సమాజ పురుషుడు వారిని అనుసరించాడు. సమాజానికి భగవద్భక్తితోబాటు దైవీశక్తి కూడా అవసరమని భావించిన శంకరాచార్యులు ఈ దేశంలో అనేక భక్తి కేంద్రాలతోబాటు శక్తి పీఠాలను కూడా ఏర్పాటు చేశారు. వాటిలో ముఖ్యమైనవి నాలుగు ఆచార్య పీఠాలు -ఉత్తరాన జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరి, పూర్వాన గోవర్ధన పీఠం (పురీ), పశ్చిమాన ద్వారకా. దేశాన్ని కాపలా కాసే జాగృత ప్రహరీలుగా పహరాహుషార్ అంటూ ప్రజలను రక్షించే బాధ్యత ఈ పీఠాలతో పాటు, శక్తి పీఠాలలో ఉత్తరాన – వింధ్యాచలదేవి, దక్షిణాన-మహిషాసుర మర్దినీ, పూర్వాన- కాళికాదేవి, పశ్చిమాన- దుర్గా ఒకే విధమైన విగ్రహాలు, ఒకే విధమైన పూజా విధానం వ్యవస్థ ద్వారా మనమంతా ఒకటేననే భావన కల్గిస్తూ సమాజాన్ని శక్తిమంతం చేసే కార్యం ఈ కేంద్రాలు కొనసాగించినవి.
శంకరాచార్యులు ఆనాడు సాధించిన ఈ కార్యం ద్వారా సమాజం తర్వాత జరిగిన అనేక దాడుల నెదుర్కొని 1000 సంవత్సరాల వరకు సుదీర్ఘ సంఘర్షణలను సాగించి ఈనాటికీ తన అస్థిత్వాన్ని కాపాడుకొని నిలబడి ఉ్నది. ఇది వారి తపః ఫలితమే. వారిని ఈ జాతి ఏనాడూ విస్మరించదు.