ArticlesNews

వీణాధారిణి విద్యాదాయిని

327views

వసంత పంచమి సందర్భంగా

అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన కరుణాలయ అమ్మ. శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించిన పరాశక్తి ఆ దేవి.

యాజ్ఞవల్క్యుడు అనే మునికుమారుడు వైశంపాయనుడి వద్ద శిష్యరికం చేశాడు. చిన్నతనంలోనే అనేక విద్యలు అభ్యసించాడు. కానీ అందరి కన్నా తనే తెలివైన వాడినన్న అహంకారంతో గురువును సైతం చులకన చేయగా- ‘నేర్చిన విద్యలన్నీ మర్చిపోవుగాక!’ అని శపించాడాయన. యాజ్ఞవల్క్యుడు పశ్చాత్తాపంతో సూర్యుణ్ణి ప్రార్థించాడు. ప్రభాకరుడు ఉపదేశించిన మంత్రంతో యాజ్ఞవల్క్యుడు సరస్వతీదేవిని ఉపాసించాడు. ఆ తల్లి కృపతో తిరిగి విద్యలన్నీ పొంది, యాజ్ఞవల్క్య మహర్షిగా ప్రసిద్ధుడయ్యాడు.
ప్రణోదేవీ సరస్వతీ

సరస్వతీదేవి శక్తి స్వరూపిణి. అందుకే ఆ తల్లి ఆరాధకులు ‘ప్రణోదేవీ సరస్వతీ’ అని ప్రార్థించి సకల శక్తులనూ సముపార్జించుకుంటారు. జ్ఞానం పరమాత్మ స్వరూపం. మేధ, శ్రద్ధ, నైపుణ్యం, స్ఫురణ, సాహిత్య సంగీతాది నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలు. ఏ సాధన ఫలించాలన్నా ఆ దేవి అనుగ్రహం ఉండాలి. అర్జునుడంతటివాడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బందిపోట్ల చేతిలో ఓడిపోయాడట. అంతవరకూ ఆయన ఆయుధాల్లో ప్రసరించిన శ్రీకృష్ణ చైతన్యం మాయమై పోవటమే అందుకు కారణం. ఆ శక్తులన్నీ వేదాగ్రణి అయిన శారదాదేవి స్వరూపాలే. అందుకే ‘జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్యప్రబోధినీం’ అమ్మా! నాకు విద్యాశక్తిని ప్రసాదించు’ అని ప్రార్థిస్తే విద్యాదేవి ప్రత్యక్షమై అనుగ్రహిస్తుందంటారు మునిపుంగవులు.

బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతిరూపంలో దర్శించి, ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశాడట. సరస్వతీ ఉపాసనతోనే వాల్మీకి రామాయణం రచించాడన్నది పురాణవచనం. అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి ‘వేదాలు, పురాణాలను అందించమని శ్రీమహావిష్ణువు నన్ను ఆదేశించాడు. అంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే నేనేం చేయాలి?’ అనడిగాడు. అప్పుడు వాల్మీకి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించగా.. గోదావరితీరంలో వాగ్దేవిని ఆరాధించాడట వ్యాసుడు. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, వాసరక్షేత్రంగా, బాసరగా ప్రసిద్ధమైందంటారు. పాణిని కూడా సరస్వతీదేవి ఆరాధకుడే! పోతనామాత్యులు ‘శారదనీరదేందు..’ అంటూ సరస్వతీ స్తుతితోనే శ్రీమద్భాగవతానికి శ్రీకారం చుట్టాడు.
అమ్మ రూపంలో అంతరార్థం

జగన్మాతకు వాణి, శారద, భారతి, వాగ్దేవి, బ్రాహ్మి, భగవతి, భాషాలక్ష్మి, మేధావిని, వాగీశ్వరి, వాగ్దేవి, విద్యాదేవి, వేదాగ్రణి, వీణాపాణి, వాక్కాంత- ఇలా అనేక పేర్లున్నాయి. ఈ తల్లి అక్షరానికి అధిదేవతగా, పలుకులతల్లిగా పూజలందుకుంటోంది. స్వచ్ఛతని సూచించే తెలుపురంగు ఆ తల్లికి ప్రియమైన వర్ణం. స్వచ్ఛత చిత్తశుద్ధికి కొలమానం. చిత్తశుద్ధి ఉన్నచోటే జ్ఞానం ఉంటుంది, పరిశుద్ధ మనసు ఉన్నవారి వద్దే జ్ఞానం శోభిస్తుందని సరస్వతీ తత్త్వం ప్రస్ఫుటం చేస్తుంది. ఆ దేవి నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన ఆమె శక్తినీ, సర్వవ్యాపకత్వాన్నీ సూచిస్తాయి. అమ్మవారి ఒకచేతిలో పుస్తకం, ఇంకోచేతిలో అక్షమాల ఉంటాయి. మరో రెండు చేతులతో కచ్ఛపి అనే వీణను మీటుతుంటుంది. భౌతికవిద్యకు సంకేతం పుస్తకం. వీణ లలితకళలకు ప్రతీక. అక్షమాల ఆధ్యాత్మిక విద్య, ధ్యానం, తపస్సులకు సూచిక. అమ్మవారి వాహనమైన హంస విచక్షణ, వివేకాలకు ప్రతీక. వివేకంతో కూడిన విద్యే శోభనిస్తుందని శారదాంబ తన వాహనం ద్వారా ప్రబోధిస్తోంది.
నదిగానూ నీరాజనాలందుకుంటూ..

సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు ‘సరస్వతీదేవీ! నదిరూపంలో ఈ పుడమిని పవిత్రం చేయమ్మా. నువ్వు ప్రవహించే తీరాలన్నీ యజ్ఞభూములు, తపోభూములు, దేవతాశక్తులు నెలవైన నేలలు అవుతాయి’ అన్నాడట. అందుకే వాగీశ్వరి నదీరూపిణిగానూ పూజలందుకుంటోంది. ‘అంబితమే నదీతమే దేవితమే సరస్వతి..’ అని కీరిస్తున్నాయి వేదాలు. అంటే ‘మాతృమూర్తుల్లో, నదుల్లో, దేవతల్లో గొప్పదానివి నీవు’ అని భావం. సరస్వతీనదీ తీరాన ఎందరో మహర్షులు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మనకు వారసత్వంగా అందించారు. కశ్యప ప్రజాపతి సరస్వతీ నదీతీరంలో శ్రీమహావిష్ణువును ఉపాసించి, ఆయన్నే సంతానంగా పొందాడు. ఆ పుత్రుడే కపిలమహర్షి. గంగ, యమున, సరస్వతి నదుల కలయికే పరమపవిత్ర త్రివేణి సంగమం. సరస్వతీనది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.
ఆ తల్లి కృపతో ఆత్మజ్ఞానం

జ్ఞానమే సౌభాగ్యం. ఆ జ్ఞానం ఆత్మజ్ఞానంగా పరిణమించినప్పుడు ముక్తి లభిస్తుంది. అందుకే పెద్దలు…

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమోనమః

పరబ్రహ్మస్వరూపం, జ్యోతిరూపధారి, సర్వవిద్యాధిదేవత అయిన సరస్వతీదేవికి నమస్కారం- అంటూ చదువులతల్లిని స్తుతిస్తారు. అలాగే ఆ దేవిని ‘సౌభాగ్యధాత్రి ధనదాత్రి యశోవిధాత్రి’ అని కీర్తిస్తారు. మనం మళ్లీ మళ్లీ జన్మించటానికి మన అజ్ఞానమే ప్రధాన కారణం. తెలియనితనం వల్లనే జననమరణ చక్రంలో చిక్కుకుంటున్నాం. అన్నమాచార్యులు ‘తెలిస్తే మోక్షము.. తెలియకుంటే బంధము’ అన్నారు. అలాంటి పరమజ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవే!
దేశమంతా దేవదేవికి పూజలు

సరస్వతీదేవిని ఆవిర్భవించింది మాఘశుద్ధ పంచమినాడు. దీన్నే శ్రీపంచమి, వసంతపంచమి అని కూడా వ్యవహరిస్తారు. ‘దేవీ భాగవతం’ తదితర గ్రంథాలు శ్రీపంచమి ప్రాశస్త్యాన్ని వివరించాయి. ఈరోజున తొలుత గణపతిని, ఆపై శారదాంబను ఆరాధించటం ఆనవాయితీ. ఈ పర్వదినాన దేవిని తెల్లని కుసుమాలతో అర్చిస్తారు. దక్షిణభారతంలోనే కాదు ఉత్తరభారతంలోనూ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బెంగాల్లో దేవీ నవరాత్రుల్లానే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, విద్యాసామగ్రి, వాయిద్యాలు పెట్టి పూజించి, అనంతరం నిమజ్జనం చేస్తారు.

మృదుభాషణ, ఎదుటివారి మనసుకు ఆహ్లాదం కలిగేలా మాట్లాడటం, హితంగా, మితంగా సంభాషించటం వాగ్దేవి ఆరాధనతో సమానమన్నారు ఆధ్యాత్మికవేత్తలు. పరుషమైన మాటలు, వ్యర్థ ప్రసంగాలు, నిందారోపణలు, ఇతరులను నొప్పించే వాక్కులు, ఇతరుల దోషాలను ఎత్తిచూపటం, వాటిని ప్రచారం చేయటం లాంటివన్నీ సరస్వతీదేవి దూషణతో సమానమంటారు. ఈ సూత్రాలను గుర్తుంచుకుని పాటించేవారే శారదాదేవి అసలైన ఆరాధకులు.

శ్రీశారద