
ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసం విశేషమైంది. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక మాఘమాసం అంటారు. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం ఉంది. ఇది విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైంది. మాఘ స్నాన విశిష్టతను బ్రహ్మాండపురాణం వివరించింది. మృకండు ముని, మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించింది. ఈ మాసంలో భగవద్గీత పఠించాలి. వస్త్రదానం చేయాలి. విష్ణువు, సూర్య భగవానులను పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. సర్వపాపాలూ తొలగి మోక్షం లభిస్తుంది. నిత్యం దీపం వెలిగించి తులసిని పూజిస్తే ఇంట్లో ప్రతికూలశక్తులు ప్రవేశించవు. మాఘమాసంలో తామసిక ఆహారం తినకూడదు. అబద్ధాలు, అవమానించటాలూ కూడదు. ఒంటిపూట భోజనం చేయాలి. ఇది వివాహాది శుభకార్యాలకు అనువైన మాసం. ఈ మాసంలో దీపారాధన, నువ్వుల దానం, నువ్వుల భక్షణం ముఖ్యమైనవి. మాఘ శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేస్తారు. పార్వతీపూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేస్తారు. శుద్ధ చవితి రోజున గణేశ పూజ, శివపూజ చెయ్యాలన్నది శాస్త్రవచనం. శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించటం శుభప్రదం. శుద్ధషష్ఠికి విశోక షష్ఠి, మందార షష్ఠి, రామ షష్ఠి, వరుణ షష్ఠి అనే పేర్లూ ఉన్నాయి. ఈ రోజున వరుణదేవుణ్ణి ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, పూలు, ధూపదీపాలతో పూజిస్తారు. రథసప్తమి నాడు సూర్యుని అర్చిస్తారు. భీష్మాష్టమినాడు కురువృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడుస్తారు. నవమినాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అంటారు. తర్వాత వచ్చే ఏకాదశికి భీష్మఏకాదశి వ్రతం చేస్తారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహిస్తారు. ద్వాదశినాడు వరాహద్వాదశీ వ్రతం చేస్తారు. ఇక త్రయోదశి విశ్వకర్మ జయంతి. సతీదేవి జన్మించిన తిథి మాఘపూర్ణిమ. ఈ రోజున శ్రీకాళహస్తి స్వర్ణముఖీనదిలో, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే విశేష ఫలదాయకం. మాఘ కృష్ణ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం, కృష్ణ సప్తమినాడు సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు, అష్టమినాడు మంగళవ్రతం, ద్వాదశినాడు తిలద్వాదశీవ్రతం చేస్తారు. కృష్ణ ఏకాదశే విజయ ఏకాదశి. రామసేతు నిర్మాణం పూర్తయిన తిథి. మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఇలా మాఘమాసంలో అనేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. మాఘంలో చివరిదైన అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేెస్తారు.





