
హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధమనీ, చిన్నాచితకా కారణాలతో విడాకుల కోసం కోర్టుకెక్కడం తగదని అలహాబాద్ హైకోర్టు ఈ నెల 15న స్పష్టం చేసింది. 1955 హిందూ వివాహ చట్టంలోని 14వ సెక్షన్ పెళ్లయిన సంవత్సరం లోపు అసాధారణ కష్టనష్టాలు ఎదురైతే తప్ప విడాకులు మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. నిశాంత్ భరద్వాజ్, రిశికా గౌతమ్ అనే కొత్త జంట ఈ చట్టంలోని 13 బి సెక్షన్ కింద విడాకుల కోసం దరఖాస్తు చేయగా, దాన్ని సహారన్‌పుర్ కుటుంబ కోర్టు తిరస్కరించింది. 14వ సెక్షన్ ప్రకారం పెళ్లయిన ఏడాదిలోగా విడాకులు మంజూరు చేయడం కుదరదని తెలిపింది. దానిపై భరద్వాజ్ హైకోర్టుకు అప్పీలు చేశారు. పరస్పరం పొసగడం లేదనే కారణం చెప్పి విడాకులను కోరడం సరికాదని, ఎంతో అసాధారణమైన కారణాలుంటే తప్ప పెళ్లయిన ఏడాదిలోగా విడాకులు ఇవ్వడానికి వీల్లేదని 14వ సెక్షన్ పేర్కొంటోందని హైకోర్టు గుర్తుచేసింది. కావాలంటే ఏడాది తరవాత మళ్లీ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.





