News

ముమ్మారు తలాక్‌ ఎఫ్‌ఐఆర్‌ల సమాచారం ఇవ్వండి

297views

‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్ట నిబంధనలు-2019’కి విరుద్ధంగా ముమ్మారు తలాక్‌ పద్ధతిలో భార్యలకు విడాకులిచ్చిన భర్తలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, అభియోగ పత్రాల వివరాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తక్షణం విడాకులకు దారితీసే ముమ్మారు తలాక్‌ పద్ధతిని నేరంగా పరిగణించే 2019 నాటి చట్ట రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ పలువురు ముస్లింలు దాఖలు చేసిన 12 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ‘‘ఈ కేసులో ప్రతివాది (కేంద్ర ప్రభుత్వం) ముస్లిం మహిళల వివాహ పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 4 కింద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్ల వివరాలు సమర్పించాలి. అలాగే పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తులు తమ వాదనకు బలం చేకూర్చే అంశాలను మూడు పేజీలకు మించకుండా దాఖలు చేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసుపై తుది విచారణ మార్చి 17న ప్రారంభమయ్యే వారంలో జరుగుతుంది. ‘‘ముమ్మారు తలాక్‌ చెల్లుబాటు కాదు. అలా మూడుసార్లు తలాక్‌ అని పలికితే ఇప్పుడు వివాహ బంధం సడలిపోదు. అయితే మూడుసార్లు తలాక్‌ అని పలకడాన్ని నేరంగా పరిగణించడమే ప్రస్తుత విషయం’’ అని ధర్మాసనం వివరించింది. ‘‘ముమ్మారు తలాక్‌ పద్ధతిలో విడాకులు చెల్లుబాటు కావు కాబట్టి భార్యాభర్తల బంధం అలాగే కొనసాగుతుంది. అయితే మీరు అలా పలకడాన్ని కూడా నేరంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయో వాటి ఎఫ్‌ఐఆర్‌లు కావాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని ఏ నాగరిక వర్గంలోనూ ఇలాంటి విడాకుల సంప్రదాయం లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా… ‘‘పిటిషనర్లు ముమ్మారు తలాక్‌ చెల్లుబాటు కావాలని కోరడం లేదు. అలా పలకడం నేరంగా పరిగణించడాన్ని మాత్రమే సవాలు చేస్తున్నారు’’ ధర్మాసనం వివరించింది.