
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ దాసరి నరసింహారెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి భారత్ మాతకు మాలార్పణ, ధ్వజారోహణ కావించడంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి ఛాయాచిత్ర ప్రదర్శనను బాదామి మల్లికార్జున గుప్తా గారు ట్రాపిక్ సీఐ మల్లికార్జున గుప్తా గారు ప్రారంభించారు.ఛాయాచిత్రాలు మన జీవితంలోని మధురాను భూతులను మనకు గుర్తు చేస్తాయని, మన సంస్కృతి సాంప్రదాయాల పదిమందికి పంచగలుగుతామని ఈ సందర్భంగా వారు వివరించారు.
అనంతరం సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి అధ్యక్ష ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘమిత్ర నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు.
తదుపరి కార్యక్రమంలో చిన్నారులు తమదైన శైలిలో సందేశాత్మకమైన నాటికలు ముఖ్యంగా సెల్ ఫోన్ వాడటం వల్ల ఉపయోగాలు అతిగా ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలను చక్కగా ప్రదర్శించారు. యావత్ మానవాళికి ఆహారం అందిస్తున్న మన నేస్తం అయినా రైతన్నల కష్టాలును వివరిస్తూ రైతన్నలకు సహాయ సహకారాలు అందించాలానే సందేశాన్ని నృత్యరూపకం ద్వారా వివరించారు.
అలాగే ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ అనే భూతాన్ని పారద్రోలి నంద్యాలను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చి దిద్దడానికి ఎలా పాటుపడాలో వివరిస్తూ “ప్లాస్టికాసురుడు” అనే నృత్య రూపకం ద్వారా చక్కగా వివరించారు. మనం ఈరోజు సురక్షితంగా, ఆనందంగా ఉండడానికి కారణమైన ఆర్మీ జవాన్ల త్యాగలను నృత్యరూపంకగా తెలిపారు.
ఆరోగ్యానికి సంబంధించిన యోగ, మన భారతీయ కళలలో భాగం అయిన యోగచాప్, పిరమిడ్లు, చెక్క భజన మొదలగు కార్యక్రమాలు ఆహుతులను చక్కగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతూ, సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసాంలో తాను ఒక కుటుంబ సభ్యుడుగా ఉండడానికి గర్విస్తున్నానని, నంద్యాల ప్రాంత ప్రజలకు సేవ అందించడంలో ముందుంటానని తెలియజేశారు. అలాగే శ్రీ ఏలుకూరి శ్రీనివాస్, శ్రీ ఏలుకూరి సురేష్ కుమార్, శ్రీ గంగ దాసరి నరసింహారెడ్డి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ప్రతి ఒక్కరూ తమ తోటి వారికి కొంతైనా సహాయ సహకారాలు అందిస్తూ వారి బాగోగులను, సమస్యలను అర్థం చేసుకొని ముందుకు నడపాలని కోరారు.
సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ కార్యదర్శి నివేదికను వివరిస్తూ, 40 చెంచుగూడలలో నిరంతర వైద్య సేవలు, ఐయమ్ ఏ మహిళా వైద్యుల సహకారంతో నెలవారీ ప్రసూతి వైద్య సేవలు, గ్రామీణ యువత లో కంప్యూటర్ యందు శిక్షణ అందించటానికి కొత్తపల్లి కేంద్రం గా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.నిరుద్యోగ యువతకు ఆర్ఆర్బి, బ్యాంక్ మరియు కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన శిక్షణ, మెటీరియల్ అందించడం జరిగిందని తెలిపారు.
విద్యార్థులకు వసతి, విద్య, వైద్యం, కల్పించడమే కాక వారికి వెన్నంటి ఉండడం తో పాటు వారు ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగటానికి సర్వాంగీన ఉన్నతికి, సంపూర్ణ మూర్తిమత్వం వికాసానికి సంఘమిత్ర కృషి చేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమాల నిర్వహనకు సుమారు 1500 మంది దాతల సహాయ సహకారాలు ఆశీస్సులు అభినందనలే కారణమని చిలుకూరి శ్రీనివాస్ గారు వివరించారు.
కార్యక్రమంలో సుమారు 1000 మంది దాతలు అభ్యాసికల చిన్నారులు తల్లిదండ్రులు, అతిథులు, సంఘమిత్ర కమిటీ సభ్యులు, నంద్యాల ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవ స్వయం సేవకులు మరియు ప్రాంత సహ సేవా ప్రముఖ్ శ్రీ కామునూరు మనోహర్ గారు పాల్గొన్నారు. ముఖ్య వక్త శ్రీ బాలి శెట్టి సుబ్బలక్ష్మయ్య గారు సంఘమిత్ర సేవా సమితిఅనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని అలాగే భారతదేశ అభ్యున్నతికి ప్రతి విషయంలో సాంప్రదాయ విలువలను పెంచుతూ సైనికులలాగా ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయం చేసుకోవాలని దేశాన్ని ప్రపంచ దేశంలో ముందు ఉంచాలని సూచించారు.
వందన సమర్పణ శాంతి పాఠంతో కార్యక్రమం సంపన్నమైంది.