ArticlesNews

చిట్టగాంగ్ లో ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు… హిందువుల భారీ ఆందోళన

261views

దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారిని ఢాకాలో అరెస్టు చేయడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను తీసుకెళ్తున్న వ్యాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ చిట్టగాంగ్ కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు.

భద్రతా బలగాలు సౌండ్ గ్రెనేడ్లను కాల్చి, లాఠీలను ప్రయోగించాయి. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న హిందువులపై పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంస్థ సమ్మిళిత సనాతన నేత అయిన బ్రహ్మచారిని హజ్రత్‌ విమానాశ్రయ సమీపంలో అరెస్ట్‌ చేసి, అనంతరం చిట్టగ్యాంగ్‌కు తీసుకువచ్చారు.

అక్టోబర్‌ 25న బ్రహ్మచారి ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపర్చారంటూ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో చిన్మయ్‌ కృష్ణ దాస్‌కు బెయిల్‌ ఇవ్వడానికి మంగళవారం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది.

చిట్టగాంగ్ కోర్టు వెలుపల తన అనుచరులను ఉద్దేశించి కృష్ణ దాస్ విక్టరీ సంకేతాన్ని చూపారు. తన మద్దతుదారులను ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని, శాంతిభద్రతలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరారు. ‘మేము దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేం సనాతనీయులం, దేశంలో భాగమే. ఐక్య బంగ్లాదేశ్ కోరుకుంటున్నాం. దేశాన్ని అస్థిరపరిచేందుకు, శాంతిని ధ్వంసం చేసేందుకు మేం ఏమీ చేయం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వాటిని శక్తిగా మార్చుకుని శాంతియుతంగా నిరసనలు తెలుపుతాం.’ అని కృష్ణ దాస్ స్పష్టం చేశారు.

కృష్ణ దాస్‌కు చిట్టగాంగ్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. చిన్మయ్‌ కృష్ణ దాస్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది కోర్టు ప్రాంగణానికి చేరుకుని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనను జైలుకు తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో ఆయన న్యాయవాది సైఫుల్‌ ఇస్లామ్‌ మృతి చెందారు.

చిట్టగాంగ్‌, ఢాకాలలోనూ వందలాది మంది హిందువులు ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మచారి అరెస్ట్‌ను భారత విదేశాంగ శాఖ, బంగ్లాదేశ్‌ హిందూ బౌద్ధ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ ఖండించింది. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బిజిబి)తో సహా భద్రతా బలగాలు నిరసనకారులను చెదరగొట్టడానికి సౌండ్ గ్రెనేడ్లు, లాఠీలను ప్రయోగించాయి. చివరికి మధ్యాహ్నం 3 గంటలకు వ్యాన్ కోర్టు ప్రాంగణం నుండి బయలుదేరింది. చిన్మోయ్ దాస్‌తో సహా మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది.