
పంట ఆకలి తీరుస్తుంది. గుడి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. మనిషికొక గుండెను ఇచ్చింది ప్రకృతి. భారతభూమిలో ప్రతి పల్లెలోను ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించింది నాగరికత. మన వరకు ఆలయాలంటే అవని మీద నక్షత్రాలు. అవొక వెలుగు. అవొక దిశానిర్దేశకాలు.
కాలపరీక్షకు నిలిచిన చింతనతో కలసి నాగరికత శిఖరాల వైపు సాగిపోయిన సమాజం ఆ చింతనతోనే తరాలపాటు ప్రయాణించడానికి చేసుకున్న ఏర్పాటు హిందూ దేవాలయం. ఆ వ్యవస్థలో కొన్ని సంప్రదాయాలు లుప్తమైపోయాయి. కొన్ని ఆచరణలో ఉన్నా గమనించాలన్న దృష్టి లేదు. మన నేల మీద ఏ పల్లెకైనా ఇద్దరు తల్లులట. ఒక తల్లి చెరువు. మరొక తల్లి కోవెల, ఇహపరాల పట్ల హిందువులు పాటించే సమతౌల్యం ఎలాంటిదో వినిపించేది జేగంట కాదా! ఈ భావన! గుడి ఎప్పుడూ పూజనీయ స్థలమే. తనలోని సత్వరజస్తమో గుణాలలో సత్త్వము (నిశ్చిలత)ను నిరంతరం పరిరక్షించుకుంటూ, మనిషి మనీషిగా ఆవిర్భ వించాలన్న సమున్నత భావనను సదా నిలిపి ఉంచేందుకు కాలం మీద శిల్పించు కున్న ఆదర్శమే ప్రతి భవ్య మందిరం. ఇంకా- అది విద్యాలయం, సామాజిక కేంద్రం. కళావేదిక, వైద్యాలయం, ఆఖరికి అవసరం వచ్చిన వారికి ధర్మవడ్డీకి డబ్బులు సర్దే బ్యాంక్, ఉరుముల ప్రభావం నుంచి, పిడుగుల దాడి నుంచి అటు ఊరినీ ఇటు గుడినీ రక్షించే ధ్వజస్తంభం ద్వారా గుడి అంటే ఒక వేధశాల. అంతరిక్షాన్నీ (బ్రహ్మాండ) మూలవిరాట్టునీ (పిండ) గోపురాలు, కలశాలు అనుసంధానిస్తాయి. కాబట్టే భారతీయమైన పిండ బ్రహ్మాండ భావనకు కళాత్మక ఆవిష్కృతి ఆలయం. లాటిన్ పదం టెంప్లమ్ నుంచి వచ్చిన టెంపుల్ అన్న పాశ్చాత్య భాషాపదం కల్పించే భావన నుంచి చూస్తే భారతీయ ఆలయ తాత్త్వికతలోని విశ్వరూపాన్ని, సాగర గర్భం వంటి రహస్యాన్ని దర్శించడం సాధ్యంకాదు. వాళ్ల ‘టెంపుల్’ అంటే పవిత్రస్థలం. కానీ మన గుడి అంతకు మించి ఎంతో, ఎంతెంతో, ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం ఎంతకాలం నిలిచి ఉంటుందో, అంతకాలం ఆలయమూ ఉంటుంది. ఆ ధర్మానికి అద్దం ఆలయమే కదా!
ఆలయం అంటే పరిశుభ్రత. హిందువులకు పరిశుభ్రత నేర్పిన చోటు. పరిశుభ్రత నాగరికతను మలుస్తుంది. అదే ఎదుగుదల. గురుశిష్య సంబంధానికి ఆలయమే ఆలవాలం. శాస్త్రీయతనూ, పటిష్ట సామాజిక దృష్టినీ ఇచ్చిన ప్రతి విలువకూ ఆలయంలోని ప్రతి ప్రతిమ ప్రతీక. వివాహం, కుటుంబం, సంతానం ఎలా ఉండాలో ప్రతిమల ద్వారానే తరం తరువాత తరం నేర్చుకోవడం లేదా! సమాజం ఏకత్రాటి మీదకు వచ్చే కళను నేర్పుతుంది రంగమంటపం. మన కుటుంబ, సామాజిక బంధాన్ని ఆలయంలోని ‘పరివార దేవతలు’ అనే సముదాయం నుంచి మనం నేర్చుకున్నాం. అసలు జీవ పరిణామాన్ని బోధించే దృశ్యాలు గుడిలో ఎన్ని ఉంటాయో కదా! మన మహాకావ్యాలన్నీ ఈ పుణ్యక్షేత్రాలలోనే పురుడు పోసుకున్నాయి.
విధర్మీయుల మొదటి దాడి ఆలయం మీదే కేంద్రీకృతం కావడానికి మూలం ఇదే కదా! హిందువుల పండుగలలో, పర్వదినాలలో ఆలయాల కూల్చివేత వెనుక ఉద్దేశం అది కాదూ! హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా కొన్ని వర్గాలు నాగరికతకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ అలాంటి ప్రయత్నం సాగడమే విషాదం. తాము ధ్వంసం చేస్తున్నది అనన్యమైన భౌతికశాస్త్ర, పర్యావరణ పరిరక్షణ సూత్రాలనేననీ, తాళపత్రాల రూపంలోని విశ్వశ్రేయో కావ్యాలనేననీ, అన్నింటికీ మించి కొన్ని తరాల శ్రమ అనీ, వారి మహోన్నత సృజనకు ఆనవాళ్లననీ పశుప్రాయమైన మూకకి ఎలా తెలుస్తుంది? అసలు ఇస్లాం ఇంకా పొలిమేరలలో ఉన్న కాలానికి చాలా ముందే వైభవ స్థితికి చేరుకున్న ఆలయాల మీద హక్కు మాదే అంటూ వక్ఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న దుండగీడుతనం ఇంకానా?
మన ఆలయ భావన తరాల మధ్య కనిపించని వారధి. భావనల వారసత్వమే తరాలను కలుపుతున్నది. తరం తరువాత తరం భుజం మార్చుకుంటూ అదే దేవుడి పల్లకీని మోస్తుంది మన సమాజం. ఆ వారసత్వం నిలబెట్టుకునే ప్రయత్నమే కంచి పీఠం వారు చేస్తున్న జీర్ణోద్ధరణ. కొండరు హిందువులు చేస్తున్న న్యాయ పోరాటమైనా అందుకోసమే. వారు చెబుతున్నదానిని బట్టి దాదాపు నలభయ్ వేల ఆలయాలు విముక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం, ప్రతిష్ఠ ఈ సంవత్సరం జరగడం, ఆలయాల మీద ప్రత్యేక సంచికను వెలువరించాలనుకోవడం యాదృచ్ఛికమే అయినా, ఎక్కడో ఆ స్ఫూర్తి ఉందనే అనిపిస్తుంది.





