
పూర్తి అజ్ఞానంతోనో లేక గడుసుదనంతోనో చరిత్రకారులు, ముఖ్యంగా యూరోపియన్ చరిత్రకారులు హిందువులు అంటే క్రీస్తు పూర్వం 1500 – 1000 సంవత్సరాల మధ్య ఐరోపా లేదా మధ్య ఆసియా నుండి దండెత్తి వచ్చిన ‘ఆర్యులు’ అని పిలవబడే సున్నితమైన చర్మం కలిగిన దేశదిమ్మరుల వారసులు అని పేర్కొన్నారు. వేదం విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చిన ఖ్యాతిని కూడా మాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఇండో ఆర్యన్స్ గా పిలవబడిన వాళ్ళకే ఆపాదించారు.
వాస్తవానికి హిందువులు అనేవాళ్ళు ఇక్కడే పుట్టిన వాళ్ళు కానీ, బయట నుండి వచ్చినవాళ్లు కారు. అప్పటికే మన సంస్కృత పదకోశం లో నాగరికులు/కులీనులు/జ్ఞానులు అనే అర్ధాలతో ‘ఆర్యులు’ అనే పదం వాడుకలో ఉంది. తరువాతి కాలంలో, వేదాలు కేవలం పురాణాలు మాత్రమే అని నమ్మించి హిందువులను మతం మార్చడానికి ప్రయత్నం జరిగింది అని నిరూపించబడినది.
మాక్స్ ముల్లర్ వేదాలు అటవికమైన వాటి కన్నా నీచమైనవి అనీ, మరొక్కసారి భారత దేశాన్ని విద్య ద్వారా జయించాలని, ఈ దేశం యొక్క మతం శాపగ్రస్తమైనదని పేర్కొన్నాడు. “రక్తం లో, రంగులో భారతీయులుగా ఉండి, అభిరుచుల్లో, ఆలోచనలలో, తెలివితేటలలో ఆంగ్లేయులుగా ఉండే జాతిగా హిందువులను మార్చే ఉద్దేశ్యంతో మన దేశం లో T.B.మాక్స్ ముల్లర్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంగ్లేయులు ముందు మన వేదాలను చాలా గట్టిగా అభిమానించారు, ఆ తరువాత ఆర్యులు ఈ దేశానికి వచ్చారని, వాళ్ళు వేదాలను రచించారని ప్రచారం చేశారు. ఆపై వేదాలు కేవలం పురాణాలు, అవాస్తవాలు అని, అందుకని అందరం క్రైస్తవాన్ని స్వీకరించడం మంచిది అని నమ్మించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు.
చాలా కాలం తరువాత, అంటే, క్రితం శతాబ్దపు మొదట్లో హరప్పా-మొహంజొదారో పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ ఆధారాలు చూసినాక మాత్రమే మనం పై వాదనని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగాము. ఇండో ఆర్యన్ ఆక్రమణలకు ముందే ఈ దేశం లో పూర్తిగా పరిణతి చెందిన, పట్టణ నాగరికత తెలిసిన జాతి ఒకటి క్రీస్తు పూర్వం 2600 నాటికే ఇక్కడ ఉందని తెలిసిపోయింది. ఒక నాగరికత స్థిరీకరించడానికి కనీసం ఐదు వందల సంవత్సరాలు పడతుంది కాబట్టి ఇక్కడ నాదరికత క్రీస్తు పూర్వం 3600 సంవత్సరాల పూర్వం మొదలయిందని మనం భావించవచ్చు.
అలాంటప్పుడు క్రీస్తు పూర్వం 1500-1000 మధ్య ఆర్యుల ఆక్రమణ జరిగింది అనడానికి అవకాశం ఉంటుందా?
ఈ ఆర్యుల ఆక్రమణ అనేది ఒక పస లేని వాదం. వివేకానందులవారు చెప్పినట్టుగా ఆర్యులు అనబడే వాళ్ళు బయటనుండి వచ్చారు అని చెప్పడానికి మన వాఙ్మయం లో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు అనేది వాస్తవం. సరిగ్గా అదే పంథాలో డాక్టర్ అంబెడ్కర్ కూడా “ఆర్యుల ఆక్రమణ అనేది కేవలం ఒక కల్పన. “అది కేవలం ఒక మనసుకు నచ్చే ఊహ మీద ఆధారపడి ఉంది. అది శాస్త్ర పరిశోధనల వక్రీకరణ మరియు సత్యానికి నిలబడే వాదం కాదు’ అని అభిప్రాయపడ్డారు. అవి ముందుగానే ఎంచుకున్న సిద్ధాంతం మరియు దానిని నిరూపించడానికి ఎంచుకున్న విషయాలు మాత్రమే’ అన్నారు.
1841 లో ‘హిస్టరీ అఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించిన మౌంట్ స్టువర్ట్ ఎల్ఫిన్ స్టోన్, “మను సిద్ధాంతంలో కానీ, వేదాలలో కానీ, మరే ఇతర గ్రంధములో కానీ భారత దేశము వెలుపల నివాసము కానీ, విజ్ఞాము కానీ ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదు. అది కేవలం ఒక అసందర్భపు ఊహ నుండి జనియించినదే.
వేదాలను, జెండ్ అవాస్తాను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్ అంబెడ్కర్ ఈ అభిప్రాయాలను వెలిబుచ్చారు…
వేద విజ్ఞానం లో ఆర్యులు అనే తెగ యొక్క ప్రస్తావనే లేదు.
వేదాలలో ఎక్కడా ఆర్యుల చేత ఓడించబడ్డ దాసులు/దాస్యులు కు సంబంధించిన ప్రస్తావనే లేదు.
దాసులు,దాస్యులు, ఆర్యులు అనబడే జాతుల మధ్య ఎలాంటి వైరుధ్యమూ కనిపించడం లేదు.
దాసులు/దాస్యుల కన్నా ఆర్యులు మంచి శరీర ఛాయ కలిగి ఉన్నారన్న ప్రస్తావన ఎక్కడా లేదు. అలాగే మనుషుల యొక్క పొడవు, బరువులు కొలిచే శాస్త్రం (ఆంథ్రోపోమెట్రీ) వీళ్ళందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు అని చెబుతోంది.
ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం మరి కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతోంది…
భూమితో, పర్వతాలతో, నదులతో, అడవులతో గట్టి అనుబంధం ఉంది అని చెప్పుకునే ఆర్యులు, తాము ఎక్కడి నుండి వచ్చారో ఆ ప్రాంతపు జ్ఞాపకాలు ఏవీ తమతో ఎందుకు తెచ్చుకోలేదు? అలాగే ఇక్కడి వాటి గురించి ఈ భూమి పుత్రుల లాగా ఎలా వ్రాయగలిగారు?
ఆర్యులు తమ స్వంత ప్రాంతం నుండి పాత్రలు కానీ, ఆయుధాలు కానీ, కళాకృతులు కానీ, తమ ఆరాధనకు సంబంధించిన వస్తువులను కానీ ఏమీ తీసుకురాకుండా ఎలా వచ్చారు? ఇలాంటి దాడులు జరిగినప్పుడు సహజంగా చోటు చేసుకునే జన హననం కానీ, కోటల విధ్వంసం కానీ ఎందుకు జరగలేదు?
మన వేదాలలో ఉటంకించిన సభ, సమితి, సామ్రాట్, రాజన్, అనే పదాలు దేశ దిమ్మరులైన ఆర్యులకు ఎలా తెలుసు? ఇవన్నీ ఇక్కడి స్వదేశీ హరప్పన్ నాగరికతకు చెందినవి కాదా?
వాయువ్య భారత దేశంలోని ఉష్ణమండల వాతావరణంలో మాత్రం కనిపించే మొక్కలు, జంతువుల గురించి శీతల మధ్య ఆసియా ప్రాంతం నుండి వచ్చిన నిరక్షరాశ్యులు, దేశదిమ్మరులు అయిన ఆర్యులు తమ గ్రంధాలలో ఎలా పేర్కొన్నారు?
కాలిబంగాన్, రోపార్, మాల్వాన్ ప్రాంతాలలో జరిపిన తవ్వకాలలో బయటపడ్డ గుర్రపు ఎముకలు ఈ ప్రాంతంలో మాత్రమే నివసించే పురా జీవులకు సంబంధించినవే కానీ, మధ్య ఆసియా ప్రాంతపు జంతువులవి కావు అని నిరూపించబడింది. సూర్కొటాడా అశ్వము కూడా భారతీయ మూలాలు కలిగినదే అని అంతర్జాతీయ నిపుణులు తేల్చి చెప్పారు. అలాంటప్పుడు ఈ దేశదిమ్మరులు మన దేశం మీద దాడి చేసే అవకాశం ఎక్కడుంది?
రధం లాంటి వాహనాలను విశాలమైన మైదానాలు కలిగిన ఉత్తర భారతదేశంలో తయారు చేసే అవకాశం ఉంటుంది కానీ, ఎగుడు దిగుడుగా ఉండే మధ్య ఆసియా ప్రాంతంలో ఎలా వాడతారు?
సనాతన హిందూ గ్రంధాలలో ఎక్కడా ఆర్యులు-ద్రావిడులు మధ్య ఘర్షణలు జరిగినట్టు పేర్కొనలేదు.
పై ప్రశ్నలకు వేటికీ సమాధానం దొరకని నేపథ్యంలో ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం అనేది కేవలం మన వేద సంస్కృతి పట్ల దురాలోచనలు కలిగిన వాళ్ళు సృష్టించినదిగా చెప్పుకోవచ్చు.
ఈ విషయం లో మనకి తిరుగులేని ఆధారం ఈమధ్య జరిపిన జన్యు సంబంధమైన పరిశోధనలలో వెలుగు చూసింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి శ్రీ లాల్జీ సింగ్ చేపట్టిన ఖండాంతర సెల్యులార్-మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన ఈ పరిశోధన ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్న మేధావులకు చెంప పెట్టులాంటిది.
అమెరికన్ పత్రిక ‘హ్యూమన్ జెనెటిక్స్’ లో ప్రచురితమైన పై పరిశోధనా ఫలితాలు గత 60,000 సంవత్సరాలనుండి భారతీయుల అందరి డీ ఎన్ ఏ ఒక్కటే అని, విదేశీ జన్యువుల ఉనికి ఏమాత్రం లేదని తేల్చింది. అంతేకాక, మధ్య ఆసియా ప్రాంతాలలో హిందువుల జన్యువులు కనపడినాయని ఆ పరిశోధన వెల్లడించింది.
ఈ ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం అనేది ఎంతగా మన దేశంలో పాతుకు పోయింది అంటే, శ్రీ లోకమాన్య తిలక్, శ్రీ వినోబా బావే లాంటి వారు కూడా తాము భగవద్గిత మీద వ్రాసిన పుస్తకాలలో దీనిని ఉటంకించారు. మెకాలే ప్రభావం నుండి బయట పడటానికి మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది.
భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ కి చెందిన జన్యు నిపుణులు మూడేళ్లపాటు చేసిన పరిశోధనా ఫలితాలు ‘సెల్’ అనే జర్నల్ లో ‘పురాతన హరప్పన్ జన్యువులో కనిపించని దేశదిమ్మర,ఇరానియన్ రైతుల ఉనికి’ అనే శీర్షికతో ప్రచురితమయ్యాయి. ఆ వ్యాసం, హిందువులు ఈ ప్రాంతానికి చెందినవారే అనే విషయాన్ని నిర్ద్వంద్వముగా తేల్చింది. ఈ పరిశోధన నిమిత్తం హర్యానాలోని హిసార్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 2800-2300 ప్రాంతానికి చెందిన ఒక అస్థిపంజరం నుండి డీ ఎన్ ఏ నమూనాలు సేకరించబడ్డాయి. ఈ వ్యాసకర్తలలో ముఖ్యలు శ్రీ వసంత్ షిండే ఆర్యుల ఆక్రమణ కానీ, వలస కానీ ఏవీ లేవని, ఆహారాన్ని సేకరించే స్థాయి నుండి ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు సాధించినవాళ్లు పూర్తిగా భారత దేశ ప్రజలే అని స్పష్టం చేశారు.
ఈ దేశంలోని హిందువులు సంపూర్ణంగా ఇక్కడి వాళ్ళు, ఆక్రమణ దారులు లేదా వలసదారులు ఏమాత్రం కాదు. కొంతమంది చెప్పే విదేశీ ఆక్రమణకు ముందు కూడా మనం ఆర్యులమే.
ఆంగ్ల మూలం ; శ్రీ రమాకాంత్ తివారి
తెలుగు అనువాదం : శ్రీ శేషశాయి దీవి, ఉపాధ్యాయులు.





