
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చునని బాంబే హైకోర్టు తెలిపింది. మూడో పెళ్లి చేసుకున్న వ్యక్తికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఠాణే మునిసిపల్ కార్పొరేషన్ వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ ఈ విషయం స్పష్టం చేసింది. అల్జీరియా మహిళను తాను మూడో భార్యగా స్వీకరిస్తున్నాననీ, తమ వివాహాన్ని రిజిస్టర్ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఓ ముస్లిం పురుషుడు ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ మహారాష్ట్ర వివాహాల చట్టం ఒక్క పెళ్లిని మాత్రమే గుర్తిస్తుందనీ, ఇది మూడో వివాహం కాబట్టి సాధికారంగా నమోదు చేసేది లేదని అధికారులు స్పష్టంచేశారు. దీంతో ముస్లిం దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చని ముస్లిం వైయక్తిక చట్టం అనుమతిస్తున్నదని న్యాయస్థానం పేర్కొంది. దంపతుల నుంచి కావలసిన పత్రాలన్నీ స్వీకరించి, వారి వివాహాన్ని అనుమతిస్తున్నట్లు కానీ లేదా నిరాకరిస్తున్నట్లు కానీ 10 రోజుల్లో తెలపాలనీ, తమ నిర్ణయానికి కారణాలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది.





